బుడమేరు వరద బాధితులకు అందని సాయం
గుర్తింపులో వివక్ష.. చాలా మందికి సగానికి పైగా సాయం కోత
ఎన్యుమరేషన్‌లోనే తీవ్రమైన లోపాలు
స్థానిక పరిస్థితులు తెలియక నష్టం అంచనాలో తేడాలు.. ఇళ్లు, వస్తువులు, వాహనాలన్నీ దెబ్బతిన్నా కొన్ని మాత్రమే నమోదు
గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతే.. ఫస్ట్ ఫ్లోర్ అని ధ్రువీకరణ
బాధితులు సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం
2.68 లక్షల కుటుంబాలు నీట మునిగితే.. 78 వేల కుటుంబాలే గుర్తింపు
రూ.400 కోట్లకు పైగా విరాళాలు వస్తే.. ఇచ్చింది మాత్రం రూ.202 కోట్లే
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: బుడమేరు వరదల్లో దారుణంగా దెబ్బతిన్న విజయవాడ నగరంలోని కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అప్రమత్తంగా లేక వారిని వరద నీటిలో నిలువునా ముంచి ఘోర తప్పిదం చేయడమే కాకుండా ఇప్పుడు పరిహారం పంపిణీలోనూ తీవ్రమైన తప్పులు చేస్తోంది. ఉద్దేశ పూర్వకంగా చాలా మంది బాధితులకు సాయం ఎగ్గొడుతోంది. సాయం అందించడంలోనూ వివక్ష చూపుతూ సరికొత్త రాజకీయం చేస్తోంది.
గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉంటూ నష్టపోయిన వారికి రూ.25 వేలు, పై అంతస్థుల్లో ఉండే వారికి రూ.10 వేలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పై అంతస్థుల్లో ఉండే కూటమి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు మాత్రం ఇప్పటికే పరిహారం జమ అయింది. వారంతా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటున్నట్లు నమోదు చేసుకుని ఎక్కువ పరిహారం పొందారు. వాస్తవంగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే వారిలో చాలా మందికి ఇప్పటికీ పరిహారం అందలేదు.
నష్టం అంచనాలను గుర్తించడం దగ్గర నుంచి బాధితులకు ప్రకటించిన సాయాన్ని అందించడం వరకూ అన్నింటా ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. జరిగిన నష్టంతో పోల్చితే ప్రకటించిన పరిహారం ఏ మూలకూ సరిపోదని బాధితులు చెబుతున్నారు. చివరికి ఇస్తామని చెప్పిన పరిహారాన్ని కూడా అందరికీ సక్రమంగా ఇవ్వకపోవడంతో బాధితుల ఆందోళన వర్ణనాతీతం.
తమను పట్టించుకునే నాథుడు లేడని, తమ గోడు ఎవరూ వినడంలేదని, తమకు సాయం అందడంలేదంటూ విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కి వేలాది మంది బాధితులు పోటెత్తడమే ఇందుకు నిదర్శనం. తమకు పరిహారం ఎందుకు ఇవ్వలేదంటూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సమస్యలే.
వరద వచ్చిన నెల రోజుల తర్వాత కూడా ఆ ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే సాయం అరకొరగా ఉండడం, అదీ అందరికీ అందకపోవడంతో అన్నిచోట్లా ఆందోళన వెల్లువెత్తుతోంది. విజయవాడ సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పరిశీలించినప్పుడు అడుగడుగునా బాధితుల కష్టాలే కనిపించాయి.
అంతా షో చేశారు..
⇒ ‘పది రోజులుగా వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని కాలం గడిపాం. తీరా వరద తగ్గాక సాయం కోసం 20 రోజులుగా కుస్తీ పడుతున్నా పట్టించుకొనే నాథుడే లేరు. ఇంటి వద్దకు సర్వే బృందాలు వచ్చి, ఫొటోలు, వివరాలు తీసుకున్నారు. తీరా జాబితాలో చూస్తే మాత్రం పేర్లు కనిపించలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాం. అయినా జాబితాలోకి పేర్లు ఎక్కలేదు. కలెక్టరేట్ వద్దకు వెళ్లి కూడా మా గోడు చెప్పుకున్నాం. కనికరం, జాలి లేదు’ అని బాధితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.
⇒ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు బయట ప్రాంతాల నుంచి సచివాలయ ఉద్యోగులను తీసుకువచ్చి నష్టాన్ని అంచనా వేయించారు. ఒక యాప్‌లో వివరాలు నమోదు చేయాలని చెప్పినా అందుకు సరైన సమయం ఇవ్వలేదు. దీంతో వారికి అన్ని ఇళ్ల గురించి తెలియకపోవడంతో ఎన్యుమరేషన్ అస్తవ్యస్తంగా సాగింది. పది రోజులపాటు నీళ్లు నిలవడంతో ఇళ్లు, ఇళ్లలోని సామాన్లు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంత నష్టం జరిగినా ఎన్యుమరేషన్‌లో మాత్రం చాలా తక్కువ నష్టం జరిగినట్లు నమోదు చేశారు.
⇒ వాస్తవానికి 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2.32 కుటుంబాలకు సంబంధించి 1700 సర్వే బృందాలతో సర్వే చేయించింది. 78,558 ఇళ్లు మాత్రమే మునిగాయని, అందులోనూ పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు 64,799 మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ లక్షకుపైగా ఇళ్లు మునిగిపోయినట్లు స్థానిక బృందాల ద్వారా తెలుస్తోంది.
⇒ మునిగాయని గుర్తించిన ఇళ్లకు సైతం సరిగా పరిహారం ఇవ్వలేదు. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయినా ఆ ఇల్లు దెబ్బతినలేదని రాశారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు కుటుంబాలు ఉంటే ఒకరికే నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ఇల్లు, వస్తువులు, వాహనాలు మునిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతే ఏదో ఒక దానికే పరిహారం ఇచ్చారు. రెండు వాహనాలు ఉంటే ఒక దానికే ఇచ్చారు. వాహనానికి పరిహారం ఇస్తే ఇంటికి ఇవ్వలేదు.
ఎన్యుమరేషన్‌లో అంతా కోతలే
⇒ కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు రాశారు. కొంతమంది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నా నష్టాల జాబితాలో రాయలేదు. ముఠా కార్మికులకు నాలుగు చక్రాల ట్రక్కులు ఉంటే వాటిని పట్టించుకోలేదు. ఎన్యుమరేషన్ బృందాలు నష్టాన్ని అంచనా వేసినప్పుడు చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకోవడంతో ఆ కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. దీంతో వారికి పరిహారం అందలేదు.
⇒ 25 వేలకుపైగా ఆటోలు దెబ్బతింటే కేవలం 4348 ఆటోలకు మాత్రమే పరిహారం ప్రకటించింది. లక్షన్నరకుపైగా ద్విచక్ర వాహనాలు ఎందుకూ పనికిరాకుండా పోతే 44,402 వాహనాలు మాత్రమే దెబ్బతిన్నట్లు గుర్తించారు. తోపుడు బండ్లు, కిరాణా షాపులు, చిన్న పరిశ్రమలు, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు వేలాదిగా నీట మునిగినా వాటి సంఖ్య తగ్గించి చూపించారు. ట్రేడ్ లైసెన్సులు ఉంటేనే చిన్నపరిశ్రమలకు పరిహారం ఇస్తామని చెప్పడంతో వేలాది బీరువా పరిశ్రమలకు ఒక్క పైసా పరిహారం అందలేదు.
⇒ ఎన్యుమరేషన్ బృందాలకు ప్రభుత్వం ముందే పరిమితులు పెట్టడంతో ఎక్కడికక్కడ కోతలు పెట్టేశారు. జరిగిన నష్టానికి, అంచనా వేసిన నష్టానికి సంబంధం లేకుండా పోయింది. చాలా మంది బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింకవకపోవడంతో పరిహారం జమ కాలేదు. డబ్బులు ఎకౌంట్‌లో పడని వారికి మళ్లీ ఎన్యుమరేషన్ చేస్తామని ప్రకటించినా, ఇంతవరకు అధికారులు బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం బ్యాంకు సమస్యలతో 20 వేల కుటుంబాలకు పరిహారం అందలేదు.
జాబితాలోనే కుట్ర
⇒ జాబితాలో పేర్లు లేవని బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో, మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. అప్పుడు 18 వేల దరఖాస్తులు రాగా, 13,700 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. గత నెల 30వ తేదీ అందరికి పరిహారం అందుతుందని సీఎం ప్రకటించినా అందలేదు. దీంతో కలెక్టరేట్‌కు బాధితులు పోటెత్తారు.
⇒ అర్జీలు సమర్పించిన వారిలో 90 శాతం మంది గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించే వారే ఉండటం గమనార్హం. నష్టం అంచనా జాబితా తయారీలోనే ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటున్నా.. ఫోర్త్ ఫ్లోర్ అని నమోదు చేశారని, ఇల్లంతా బురదమయం అయి కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని.. ఆధార్, బ్యాంక్ ఖాతాలు అన్నీ సక్రమంగానే ఉన్నా.. నాట్ ట్రేస్‌డ్ అని నమోదు చేశారని కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
⇒ నిరుపేదలు ఎక్కవగా ఉండే వాంబేకాలనీ, వడ్డెరకాలనీ, శాంతినగర్, పైపులరోడ్డు, సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేట, కండ్రిక, రాజీవ్‌నగర్, జక్కంపూడి, అంబాపురం, భవానిపురం, అంబాపురం, కెల్రావు నగర్, పాయకాపురం, రామలింగేశ్వరనగర్ కట్ట, మధ్యకట్ట, రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతాల ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు ఎక్కువగా వచ్చారు.
⇒ కాగా, సీఎం సహాయ నిధికి దాతలు రూ.400 కోట్లు అందజేశారు. ఇందులో బాధితులకు అందించిన సాయం రూ.202 కోట్లు మాత్రమే.
ఈ ప్రభుత్వానికి కనికరం లేదు
ఈ ప్రభుత్వానికి పేదలంటే అలుసు. కాస్త అయినా కనికరం లేదు. ఇల్లు మొత్తం మునిగిపోవడంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బయటపడ్డాం. వరద తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి రాసుకున్నారు. కానీ డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ పది సార్లు తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నాం. కూలీ పనులు చేసుకుని బతికేవాళ్లం. మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు.
– జమ్ము సన్యాసమ్మ, న్యూ రాజరాజేశ్వరిపేట
Comments
Please login to add a commentAdd a comment