రాష్ట్ర ప్రజలపై యూజర్‌ పిడుగు | Chandrababu Govt User charges burden on Andhra Pradesh People | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలపై యూజర్‌ పిడుగు

Published Sun, Dec 22 2024 4:57 AM | Last Updated on Sun, Dec 22 2024 9:48 AM

Chandrababu Govt User charges burden on Andhra Pradesh People

మొన్న కరెంటు.. నిన్న రిజిస్ట్రేషన్‌.. నేడు యూజర్‌ చార్జీలు

జనంపై మరో భారం మోపుతున్న కూటమి సర్కార్‌

ఈ బాదుడుకు ‘వికసిత్‌ ఆంధ్రా 2029 కార్యాచరణ ప్రణాళిక’ అని పేరు

నీటి సరఫరా, నిర్వహణ, మురుగునీటి శుద్ధి నిర్వహణ అంటూ భారం

నిర్వహణకు అనుగుణంగా యూజర్‌ చార్జీలు పెంచేలా చర్యలు

ఆస్తి పన్ను ద్వారా మరింతగా బాదేందుకు సరికొత్త సంస్కరణలు

నగరాలు, పట్టణాల్లో ఆస్తులన్నీ రియల్‌ టైమ్‌ మదింపు

సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఆస్తుల ఆరా, అంచనా

అందుకనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేసేలా కార్యాచరణ

వీటన్నింటికీ తోడుగా జీఎస్టీపై వరదల సెస్‌ వేస్తారట!

అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రం

5% మించిన జీఎస్టీ శ్లాబులపై అదనంగా ఒక శాతం సెస్‌కు వినతి

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రతిపాదన

పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు.. రోజుకో రీతిన ప్రజలను బాదేస్తోంది. మొన్న కరెంట్‌ చార్జీల రూపంలో రెండుసార్లు భారీ షాక్‌లు ఇవ్వగా, నిన్న రిజిస్ట్రేషన్‌ చార్టీలను ఇదివరకెన్నడూ లేని రీతిలో పూరి గుడిసెలను సైతం వదలకుండా పెంచేసింది. క్లాసిఫికేషన్ల పేరుతో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా యూజర్‌ చార్జీల పేరుతో నగర, పట్టణ వాసులను భారీగా బాదేయడానికి సిద్ధమైంది. మరో వైపు ఏరు దాటేశామని ప్రజలందరినీ బోడి మల్లన్నలు చేస్తూ.. రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా వరదల సెస్‌ విధించడానికి అనుమతివ్వాలంటూ జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ప్రజలేమనుకుంటే మాకేంటని నిస్సిగ్గుగా ప్రజలను అన్ని రకాలుగా వాయించేస్తూ.. ‘బాబు అంటే బాదుడే బాదుడు’ అని నిరూపించుకుంటోంది. 

ఉమ్మడి రాష్ట్రంలో యూజర్‌ చార్జీలు అనే పదం వింటే తెలుగు రాష్ల్రాల ప్రజలందరికీ గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబునాయుడే. ఇప్పుడు ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోసారి ‘యూజర్‌ చార్జీలు’ అంటూ ప్రజల మీద భారం వేయడానికి సిద్ధమయ్యారు. ప్రధానంగా పట్టణ ప్రజలపై యూజర్‌ చార్జీల మోత మోగించాలని వికసిత్‌ ఆంధ్రా–2029 కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేశారు. 

ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వేలోనూ చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. నీటి సరఫరాకు సంబంధించి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఆపరేషన్, మురుగునీటి శుద్ది ప్లాంట్ల ఆపరేషన్‌.. నిర్వహణ, నీటి సరఫరా, పంపిణీ నెట్‌ వర్క్, యంత్రాల నిర్వహణ, ఆపరేషన్‌కు అయ్యే వ్యయాన్ని పట్టణ ప్రజల నుంచి యూజర్‌ చార్జీల రూపంలో వసూలు చేయడానికి అడుగులు ముందుకు వేస్తోంది. 

ఇందుకోసం వినియోగదారుల చార్జీల పేరుతో పట్టణ స్థానిక సంస్థలు సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం చేస్తోంది. ఎప్పటికప్పుడు యూజర్‌ చార్జీల నిర్వహణ, ఆపరేషన్‌ వ్యయానికి తగినట్లుగా రుసుము పెంచాల్సి ఉందని కూడా నొక్కి చెప్పింది. ఇలా ప్రజలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ బాదేస్తున్న కూటమి ప్రభుత్వం.. తమది సిటిజన్‌ ప్రెండ్లీ వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.

ఆస్తి పన్ను పెంచేలా అడుగులు
పట్టణాల్లో ఆస్తి పన్ను సంస్కరణల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇంటి నిర్మాణ వైశాల్యం, ఖాళీ స్థలం కొలతలను వేయించింది. పట్టణాల్లో ఆస్తులన్నీ రియల్‌ టైమ్‌ మదింపు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు. 

అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్‌ డిజిట్‌ ఉపయోగించి బిల్డింగ్‌ ప్లాన్‌ ఆమోదంతో సహా ఆస్తుల డేటా సేకరిస్తున్నారు. ఇంటిగ్రేటెట్‌ డిజిటలైజ్డ్‌ బిల్లింగ్‌ ద్వారా ఆస్తి పన్నుకు సంబంధించి ఆటోమెటిక్‌ డిజిటల్‌ బిల్లు జనరేట్‌ చేయనున్నారు. ఎస్‌ఎంఎస్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా ఆస్తి పన్ను చెల్లింపును యజమానులకు గుర్తు చేయనున్నారు. బౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్‌) ఆధారంగా ఆస్తుల వివరాలను మ్యాపింగ్‌ చేయనున్నారు. 

చాలా కాలంగా ఆస్తుల కిందకు రాని ఆస్తులన్నీ ఈ మ్యాపింగ్‌లోకి తీసుకురావడంతో పన్నుల పరిధిలో మరిన్ని ఆస్తులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్స్‌ ద్వారా కూడా ఇప్పటికే మ్యాపింగ్‌లో ఉన్న ఆస్తులకు అదనంగా ఉన్న ఆస్తులను జత చేస్తోంది. ఆస్తి పన్ను రిజిస్టర్‌ను రాష్ట్ర స్టాంప్‌ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్‌ శాఖ, రెవెన్యూ విభాగాలకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఆస్తులలో మార్పులు చేసినట్టయితే అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయడానికి వీలు కలుగుతుంది.

వరదలనూ వాడుకుంటాం..
రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా సెస్‌ విధించడానికి అనుమతివ్వాలంటూ కూటమి సర్కారు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. శనివారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ఈ ప్రతిపాదన చేశారు. 5 శాతం జీఎస్టీ దాటిన అన్ని వస్తువులపై అదనంగా ఒక శాతం ఏపీ ఫ్లడ్‌ సెస్‌ విధించడానికి అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారమన్‌కు విజ్ఞప్తి చేశారు. 

ఈ సెస్‌ ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంత్రాల్లో సహాయ, పునరావాస చర్యలు  చేపడతామన్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు ఇదే తరహాలో సెస్‌ విధించారని తెలిపారు. 5 శాతానికి మించిన జీఎస్టీ శ్లాబులపై ఈ సెస్‌ విధిస్తుండటంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం ఉండదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 

ఇన్నోవేషన్లకు ప్రొత్సహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే రీసెర్చ్‌ సర్వీసెస్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని, ఐజీఎస్టీ సెటిల్మెంట్‌ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, ఈ డేటా రాష్ట్రాలకూ అందుబాటులో ఉంచాలన్నారు. 

చిన్న వ్యాపారులు, కాంపోజిషన్‌ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్‌ ఛార్జ్‌ మెకానిజం (ఆర్‌సీఎం) నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్, కమర్షియల్‌ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ అహ్మద్‌ బాబు కూడా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement