Distribution of compensation
-
AP: పరిహారం.. పంపిణీ అస్తవ్యస్తం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: బుడమేరు వరదల్లో దారుణంగా దెబ్బతిన్న విజయవాడ నగరంలోని కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అప్రమత్తంగా లేక వారిని వరద నీటిలో నిలువునా ముంచి ఘోర తప్పిదం చేయడమే కాకుండా ఇప్పుడు పరిహారం పంపిణీలోనూ తీవ్రమైన తప్పులు చేస్తోంది. ఉద్దేశ పూర్వకంగా చాలా మంది బాధితులకు సాయం ఎగ్గొడుతోంది. సాయం అందించడంలోనూ వివక్ష చూపుతూ సరికొత్త రాజకీయం చేస్తోంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉంటూ నష్టపోయిన వారికి రూ.25 వేలు, పై అంతస్థుల్లో ఉండే వారికి రూ.10 వేలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పై అంతస్థుల్లో ఉండే కూటమి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు మాత్రం ఇప్పటికే పరిహారం జమ అయింది. వారంతా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటున్నట్లు నమోదు చేసుకుని ఎక్కువ పరిహారం పొందారు. వాస్తవంగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే వారిలో చాలా మందికి ఇప్పటికీ పరిహారం అందలేదు. నష్టం అంచనాలను గుర్తించడం దగ్గర నుంచి బాధితులకు ప్రకటించిన సాయాన్ని అందించడం వరకూ అన్నింటా ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. జరిగిన నష్టంతో పోల్చితే ప్రకటించిన పరిహారం ఏ మూలకూ సరిపోదని బాధితులు చెబుతున్నారు. చివరికి ఇస్తామని చెప్పిన పరిహారాన్ని కూడా అందరికీ సక్రమంగా ఇవ్వకపోవడంతో బాధితుల ఆందోళన వర్ణనాతీతం. తమను పట్టించుకునే నాథుడు లేడని, తమ గోడు ఎవరూ వినడంలేదని, తమకు సాయం అందడంలేదంటూ విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కి వేలాది మంది బాధితులు పోటెత్తడమే ఇందుకు నిదర్శనం. తమకు పరిహారం ఎందుకు ఇవ్వలేదంటూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సమస్యలే. వరద వచ్చిన నెల రోజుల తర్వాత కూడా ఆ ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే సాయం అరకొరగా ఉండడం, అదీ అందరికీ అందకపోవడంతో అన్నిచోట్లా ఆందోళన వెల్లువెత్తుతోంది. విజయవాడ సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పరిశీలించినప్పుడు అడుగడుగునా బాధితుల కష్టాలే కనిపించాయి. అంతా షో చేశారు..⇒ ‘పది రోజులుగా వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని కాలం గడిపాం. తీరా వరద తగ్గాక సాయం కోసం 20 రోజులుగా కుస్తీ పడుతున్నా పట్టించుకొనే నాథుడే లేరు. ఇంటి వద్దకు సర్వే బృందాలు వచ్చి, ఫొటోలు, వివరాలు తీసుకున్నారు. తీరా జాబితాలో చూస్తే మాత్రం పేర్లు కనిపించలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాం. అయినా జాబితాలోకి పేర్లు ఎక్కలేదు. కలెక్టరేట్ వద్దకు వెళ్లి కూడా మా గోడు చెప్పుకున్నాం. కనికరం, జాలి లేదు’ అని బాధితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ⇒ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు బయట ప్రాంతాల నుంచి సచివాలయ ఉద్యోగులను తీసుకువచ్చి నష్టాన్ని అంచనా వేయించారు. ఒక యాప్‌లో వివరాలు నమోదు చేయాలని చెప్పినా అందుకు సరైన సమయం ఇవ్వలేదు. దీంతో వారికి అన్ని ఇళ్ల గురించి తెలియకపోవడంతో ఎన్యుమరేషన్ అస్తవ్యస్తంగా సాగింది. పది రోజులపాటు నీళ్లు నిలవడంతో ఇళ్లు, ఇళ్లలోని సామాన్లు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంత నష్టం జరిగినా ఎన్యుమరేషన్లో మాత్రం చాలా తక్కువ నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ⇒ వాస్తవానికి 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2.32 కుటుంబాలకు సంబంధించి 1700 సర్వే బృందాలతో సర్వే చేయించింది. 78,558 ఇళ్లు మాత్రమే మునిగాయని, అందులోనూ పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు 64,799 మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ లక్షకుపైగా ఇళ్లు మునిగిపోయినట్లు స్థానిక బృందాల ద్వారా తెలుస్తోంది. ⇒ మునిగాయని గుర్తించిన ఇళ్లకు సైతం సరిగా పరిహారం ఇవ్వలేదు. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయినా ఆ ఇల్లు దెబ్బతినలేదని రాశారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు కుటుంబాలు ఉంటే ఒకరికే నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ఇల్లు, వస్తువులు, వాహనాలు మునిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతే ఏదో ఒక దానికే పరిహారం ఇచ్చారు. రెండు వాహనాలు ఉంటే ఒక దానికే ఇచ్చారు. వాహనానికి పరిహారం ఇస్తే ఇంటికి ఇవ్వలేదు. ఎన్యుమరేషన్లో అంతా కోతలే⇒ కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు రాశారు. కొంతమంది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నా నష్టాల జాబితాలో రాయలేదు. ముఠా కార్మికులకు నాలుగు చక్రాల ట్రక్కులు ఉంటే వాటిని పట్టించుకోలేదు. ఎన్యుమరేషన్ బృందాలు నష్టాన్ని అంచనా వేసినప్పుడు చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకోవడంతో ఆ కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. దీంతో వారికి పరిహారం అందలేదు.⇒ 25 వేలకుపైగా ఆటోలు దెబ్బతింటే కేవలం 4348 ఆటోలకు మాత్రమే పరిహారం ప్రకటించింది. లక్షన్నరకుపైగా ద్విచక్ర వాహనాలు ఎందుకూ పనికిరాకుండా పోతే 44,402 వాహనాలు మాత్రమే దెబ్బతిన్నట్లు గుర్తించారు. తోపుడు బండ్లు, కిరాణా షాపులు, చిన్న పరిశ్రమలు, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు వేలాదిగా నీట మునిగినా వాటి సంఖ్య తగ్గించి చూపించారు. ట్రేడ్ లైసెన్సులు ఉంటేనే చిన్నపరిశ్రమలకు పరిహారం ఇస్తామని చెప్పడంతో వేలాది బీరువా పరిశ్రమలకు ఒక్క పైసా పరిహారం అందలేదు. ⇒ ఎన్యుమరేషన్ బృందాలకు ప్రభుత్వం ముందే పరిమితులు పెట్టడంతో ఎక్కడికక్కడ కోతలు పెట్టేశారు. జరిగిన నష్టానికి, అంచనా వేసిన నష్టానికి సంబంధం లేకుండా పోయింది. చాలా మంది బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింకవకపోవడంతో పరిహారం జమ కాలేదు. డబ్బులు ఎకౌంట్లో పడని వారికి మళ్లీ ఎన్యుమరేషన్ చేస్తామని ప్రకటించినా, ఇంతవరకు అధికారులు బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం బ్యాంకు సమస్యలతో 20 వేల కుటుంబాలకు పరిహారం అందలేదు.జాబితాలోనే కుట్ర⇒ జాబితాలో పేర్లు లేవని బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో, మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. అప్పుడు 18 వేల దరఖాస్తులు రాగా, 13,700 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. గత నెల 30వ తేదీ అందరికి పరిహారం అందుతుందని సీఎం ప్రకటించినా అందలేదు. దీంతో కలెక్టరేట్‌కు బాధితులు పోటెత్తారు. ⇒ అర్జీలు సమర్పించిన వారిలో 90 శాతం మంది గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే వారే ఉండటం గమనార్హం. నష్టం అంచనా జాబితా తయారీలోనే ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటున్నా.. ఫోర్త్ ఫ్లోర్ అని నమోదు చేశారని, ఇల్లంతా బురదమయం అయి కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని.. ఆధార్, బ్యాంక్ ఖాతాలు అన్నీ సక్రమంగానే ఉన్నా.. నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ నిరుపేదలు ఎక్కవగా ఉండే వాంబేకాలనీ, వడ్డెరకాలనీ, శాంతినగర్, పైపులరోడ్డు, సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేట, కండ్రిక, రాజీవ్‌నగర్, జక్కంపూడి, అంబాపురం, భవానిపురం, అంబాపురం, కెల్రావు నగర్, పాయకాపురం, రామలింగేశ్వరనగర్ కట్ట, మధ్యకట్ట, రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతాల ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు ఎక్కువగా వచ్చారు. ⇒ కాగా, సీఎం సహాయ నిధికి దాతలు రూ.400 కోట్లు అందజేశారు. ఇందులో బాధితులకు అందించిన సాయం రూ.202 కోట్లు మాత్రమే. ఈ ప్రభుత్వానికి కనికరం లేదుఈ ప్రభుత్వానికి పేదలంటే అలుసు. కాస్త అయినా కనికరం లేదు. ఇల్లు మొత్తం మునిగిపోవడంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బయటపడ్డాం. వరద తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి రాసుకున్నారు. కానీ డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ పది సార్లు తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నాం. కూలీ పనులు చేసుకుని బతికేవాళ్లం. మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు. – జమ్ము సన్యాసమ్మ, న్యూ రాజరాజేశ్వరిపేట -
విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ
రాయదుర్గం/బొమ్మనహాళ్: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు వద్ద బుధవారం జరిగిన కరెంటు ప్రమాదంలో మృత్యువాత పడిన నలుగురు మహిళా కూలీ కుటుంబాలతోపాటు గాయపడినవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కూలీల కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చిన ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గంటల వ్యవధిలోనే పరిహారం ప్రకటించారు. అంతేగాకుండా 24 గంటల్లోపే ప్రజాప్రతినిధుల ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గురువారం దర్గాహొన్నూరులో బాధిత కుటుంబాలను ఓదార్చారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, కళ్యాణదుర్గం ఆర్డీవో నిషాంత్రెడ్డిలతో కలిసి మృతులు వన్నక్క, రత్నమ్మ, శంకరమ్మ, పార్వతి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. ప్రమాదంలో గాయపడిన సుంకమ్మ, మహేష్, లక్ష్మి, చిట్టెమ్మ, ఓబుళలమ్మలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. కాపు రామచంద్రారెడ్డి సొంతంగా మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున అందజేశారు. అంత్యక్రియలు పూర్తి కరెంటు కాటుకు గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మృత్యువాత పడటంతో దర్గాహొన్నూరులో విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చారు. విగతజీవులుగా ఉన్న తమవారిని చూసి బంధువులు, కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుల పిల్లలు తమ తల్లుల మృతదేహాలపైపడి రోదించిన తీరుతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం ఉదయం నలుగురి అంత్యక్రియలు నిర్వహించారు. -
మాది రైతు ప్రభుత్వం
సంగారెడ్డి అర్బన్: రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఐఐటీ కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోయిన 20 మంది రైతులకు ఇంటి స్థలాల పట్టాలు, సింగూర్ పైప్‌లైన్ వల్ల భూములు కోల్పోయిన 47 మంది రైతులకు రూ. 56.37 లక్షల పరిహారాన్ని మంత్రి హరీష్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిహారం అందాల్సిన వారు ఇంక ఎవరున్నా వారికి కూడా త్వరలోనే పరిహారం పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం పరిహారంగా ఎకరాకు రూ.3 లక్షల చెల్లించగా, ప్రస్తుతం ఆ పరిహారాన్ని పెంచి రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. రుణమాఫీ కింద ఇప్పటికే రూ.499 కోట్లు జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. ఇప్పటివరకు రైతులకు రూ.700 కోట్ల కొత్త రుణాలు రైతులకు మంజూరు చేయించామన్నారు. అంతేకాకుండా రైతులకు మద్దతు ధర దక్కేలా జిల్లా వ్యాప్తంగా మక్క, వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం లోనే ప్రయోగాత్మకంగా జిల్లాలో సేకరించిన మొక్కజొన్నకు కూడా ఆన్లైన్ ద్వారా రైతులకు చెల్లింపులు ప్రారంభించామన్నారు. 72 గంటల్లో రైతులకు డబ్బు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంతేకాకుండా పాడి రైతుకు మేలు జరిగేలా లీటరుకు రూ. 4 పెంచినట్లు వివరించారు. షేడ్‌నెట్ కింద రైతులు కూరగాయలు పండించేందుకు రూ. 280 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ సాగు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో, చిన్న సన్న కారు రైతులకు 90 శాతం, మిగతా రైతులందరికీ 80 శాతం సబ్సిడీతో పరికరాలను సమకూర్చనున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ఎంతో కాలంగా పెండింగ్‌లోఉన్న పరిహారాన్ని , ఇళ్ల స్థలాల పట్టాలను నూతన ప్రభుత్వం మంజూరు చేసి రైతులను ఆదుకుందన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయినట్లయితే సంబంధిత తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 8న పింఛన్ల పంపిణీ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, జిల్లాలో ఆహార భద్రత కార్డులకు 8 లక్షల దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 50 శాతం పరిశీలన పూర్తయిందని తెలిపారు. పింఛన్ కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులందగా, 60 శాతం పరిశీలన పూర్తయిందన్నారు. నవంబర్ 1 తేదీ నాటికి పరిశీలన పూర్తిచేసి 8వ తేదీన అందరికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు చివరి తేదీ అంటూ ఏమీ లేదన్నారు. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, జేసీ శరత్, అదనపు జేసి మూర్తి, డీఆర్ఓ దయానంద్, సంగారెడ్డి తహశీల్దార్ గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యవేక్షణకు ‘జన్మభూమి కమిటీలు’
తుపాను సాయంపై సీఎం చంద్రబాబు ప్రకటన రేపు సాయంత్రానికల్లా చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందిస్తాం రేపే విశాఖ బీచ్‌లో ‘తుపానును జయిద్దాం’ ర్యాలీ వాకతిప్ప పేలుళ్ల మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటన హైదరాబాద్: తుపాను ప్రభావిత ప్రాంతా ల్లో బాధితులకు అందించే పరిహారం పంపిణీ పర్యవేక్షణ అధికారాలను.. ‘జన్మభూమి- మా ఊరు’ సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీలకే అప్పగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. న్యాయ సమ్మతంగా బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ కమిటీలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తాయన్నారు. బాబు సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పంటల నష్టం, ఇళ్ళు నష్టం తదితరాల అంచనాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 400 బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. నష్టం అంచనా వివరాల్ని ఎన్ఆర్ఎస్ఏ డేటాతో అనుసంధానం చేసి నిజమైన అర్హుల్ని గుర్తిస్తామన్నారు. రేపటికల్లా బాధితులందరికీ సాయం... ఈ నెల 22 సాయంత్రానికి తుపాను కారణంగా నష్టపోయిన చిట్ట చివరి బాధితుడికి సాయం అందేలా అన్ని ఏర్పాట్లు చేశామని సీఎం చెప్పారు. బాధితులకు అందించే సాయం పరిమాణాన్ని రెండు విభాగాలుగా విభజించామని.. తీవ్రంగా నష్టపోతే ఒక కేటగిరీ కింద, మిగిలిన నష్టానికి మరో కేటగిరీ కింద సాయం అందిస్తామని తెలిపారు. తుపాను బాధిత ప్రజలకు ఏ ఏ సరుకులు ఇస్తున్నామో.. ఫ్లెక్సీలు రూపొందించి చౌక ధరల దుకాణాల ఎదుట ఉంచుతున్నామని, అంతేకాకుండా ఆటోల, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ఆదేశాలిచ్చామన్నారు. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు అంటే 22వ తేదీ (బుధవారం) విశాఖలోని ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తులు, కాగడాలతో ‘తుపానును జయిద్దాం’ పేరుతో ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 78 సార్లు తుపాన్లు వచ్చాయని.. వాటిని ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. రుణవిముక్తికి ఇక బ్యాంకులదే ఆలస్యం... రైతుల్ని రుణ విముక్తి చేసేందుకు విజయవాడలో మంగళవారం రైతు సాధికారత సంస్థను ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్లుడ్వాక్రా మహిళల రుణాల మాఫీకి త్వరలో ఓ సాధికారిత సంస్థను ఏర్పాటు చేస్తామని బాబు చెప్పారు. ఇసుక పాలసీపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని, డ్వాక్రా సంఘాల ద్వారా ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలో ఇసుక రీచ్‌లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. యూనిట్ ఇసుకను రూ. వెయ్యికే అందిస్తామన్నారు. ఎర్రచందనం, బెరైటీస్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలో బాణా సంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో 11 మంది మృతి చెందటం ఎంతో బాధాకరమని, దీనిపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా జిల్లా కలెక్టరును ఆదేశించానని సీఎం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వ పరిహారం ప్రకటించారు. సాధికారిక సంస్థకు 5 వేల కోట్లు విడుదల రైతు రుణ విముక్తి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ(ఆర్ఎస్ఎస్)కు రూ. 5 వేల కోట్లను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ సంస్థలకు తుపాను ప్రాంతాల దత్తత... తుపాను బాధిత ప్రజల్ని ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయని, అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకు ఈ విపత్తు సాయం రానందున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని, కార్పొరేట్ సంస్థలకు ఇబ్బంది లేకుండా చేస్తామని సీఎం చెప్పారు. తుపాను ప్రాంతాలను కార్పొరేట్ సంస్థలకు దత్తతకు ఇస్తామని, వారిచ్చే డబ్బుకు, ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అన్ని వసతులతో, కాలనీలు నిర్మిస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్‌షిప్పులు, గ్రామాల్లో ఆదర్శ కాలనీలు నిర్మిస్తామన్నారు. -
పరిహారం ఇస్తారా.. చావమంటారా?
అధికారులను నిలదీసిన భూ నిర్వాసితుడు నర్సింగపూర్(చందుర్తి): పరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందనే మనస్తాపంతో అధికారుల ఎదుటే ఓ రైతన్న ఆత్మహత్యాయత్నం చేశాడు. చందుర్తి మండలం నర్సింగపూర్ ఊరచెరువును.. ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండో దశలో రిజర్వాయర్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో రైతు దేవయ్య పొలం, బావి కోల్పోయాడు. తనకు అందాల్సిన పరిహారాన్ని భూసేకరణ అధికారులే ఇతర రైతుల పేర్లపై నమోదు చేశారని దేవయ్య ఆరోపించాడు. భూసేకరణ డెప్యూటీ తహశీల్దార్ రాజమణి సోమవారం గ్రామంలో పరిహారం చెక్కులు పంపిణీ చేస్తుండగా దేవయ్య గోడు వెల్లబోసుకున్నాడు. పరిహారం అందకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పురుగుమందు డబ్బా వెంటతెచ్చుకున్నాడు. తప్పిదాలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతు వెనుదిరిగాడు.