మృతుల కుటుంబీకులకు చెక్కు అందిస్తున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, చిత్రంలో ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ
రాయదుర్గం/బొమ్మనహాళ్: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు వద్ద బుధవారం జరిగిన కరెంటు ప్రమాదంలో మృత్యువాత పడిన నలుగురు మహిళా కూలీ కుటుంబాలతోపాటు గాయపడినవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కూలీల కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చిన ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గంటల వ్యవధిలోనే పరిహారం ప్రకటించారు.
అంతేగాకుండా 24 గంటల్లోపే ప్రజాప్రతినిధుల ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గురువారం దర్గాహొన్నూరులో బాధిత కుటుంబాలను ఓదార్చారు.
అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, కళ్యాణదుర్గం ఆర్డీవో నిషాంత్‌రెడ్డిలతో కలిసి మృతులు వన్నక్క, రత్నమ్మ, శంకరమ్మ, పార్వతి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు.
ప్రమాదంలో గాయపడిన సుంకమ్మ, మహేష్, లక్ష్మి, చిట్టెమ్మ, ఓబుళలమ్మలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. కాపు రామచంద్రారెడ్డి సొంతంగా మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున అందజేశారు.
అంత్యక్రియలు పూర్తి
కరెంటు కాటుకు గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మృత్యువాత పడటంతో దర్గాహొన్నూరులో విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చారు. విగతజీవులుగా ఉన్న తమవారిని చూసి బంధువులు, కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుల పిల్లలు తమ తల్లుల మృతదేహాలపైపడి రోదించిన తీరుతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం ఉదయం నలుగురి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment