power accident
-
వానల వేళ.. కాటేసే కరెంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విద్యాసంస్థల్లో తరగతులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పరిస్థితి మెరుగుపడిందికానీ, అనేక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో భద్రతా ప్రమాణాలు అంతంతమాత్రమే. పెచ్చులూడిపోయి నీరుకారే స్లాబులు, తడిచి చెమ్మెక్కిన గోడలు ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి.అలాంటి విద్యాసంస్థల్లో వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యుత్ వైర్లు, లైన్లు, స్విచ్ బోర్డులు, ఎర్తింగ్, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిపై ఆడిట్ నిర్వహించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు విద్యుత్ ప్రమాదాల నివారణకు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే మేలు » ఎలక్ట్రిక్ వైరింగ్, స్విచ్‌లు, జాయింట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి.. పాడైపోయిన, అరిగిపోయిన వాటిని వెంటనే మార్చాలి » పాఠశాలలు, కళాశాలల ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, ప్రధాన బోర్డులకు తప్పనిసరిగా కంచె ఏర్పాటుచేయాలి »పిల్లలు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి » అన్ని ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎలక్ట్రికల్ సేఫ్టీ నిబంధనలను అనుసరించాలి » భూమిలో ఉన్న స్తంభాలను సరిగ్గా ఇన్సులేట్ చేయాలి. అన్ని కేబుల్స్, జంక్షన్లను ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు, సరి్టఫైడ్ ఎల్రక్టీషియన్లతో తనిఖీ చేయించాలి » ప్రామాణిక, మంచి నాణ్యత గల ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించాలి. కేబుల్స్, ప్లగ్‌లు కరగకుండా నిరోధించాలంటే సాకెట్‌కు ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఎక్కువ పరికరాలు సర్క్యూట్లో ప్లగ్ చేస్తే.. కరెంట్ వైర్లు వేడెక్కి స్పార్క్ వచ్చి మంటలు చెలరేగుతాయి » విద్యార్థులు, సిబ్బందికి లీకేజీలు, ఎలక్ట్రిక్ షాక్‌లను అరికట్టడం, బాధితులను రక్షించడం, షాక్‌కు గురైన వారికి ప్రథమ చికిత్స అందించడం వంటి అంశాల్లో అవగాహన కల్పించాలి » షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తే తప్పించుకోవడానికి వీలుగా అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలి »సబ్స్టేషన్లు, సరఫరా లైన్లకు దూరంగా పాఠశాలలు ఉండేలా చూసుకోవాలి »ఓపెన్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్, జంక్షన్ బాక్స్, స్ట్రీట్ బాక్స్ మొదలైనవి కూడా పాఠశాలలకు సమీపంలో ఉండకూడదు »పాఠశాల ఆవరణలోను, విద్యార్థులు వెళ్లే మార్గంలోను ఉండే ట్రాన్స్ఫార్మర్లకు పూర్తి స్థాయిలో కంచె వేయాలి » విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఎలక్రిక్ పరికరాల్లో మరమ్మతులు వస్తే తప్పనిసరిగా ఎల్రక్టీషియన్ సహాయం తీసుకోవాలి. సొంతంగా మరమ్మతులు చేయకూడదు » కుళాయి, నీళ్ల ట్యాంకులకు సమీపంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగించకూడదు » వర్షం, తుపానుల సమయాల్లో సరఫరా లైన్లు ఉన్న ఏ నిర్మాణం కింద ఆశ్రయం పొందకూడదు »కరెంటు తీగలకు సమీపంలోని చెట్లు ఎక్కడం, తాకడం వంటివి చేయకూడదు »ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులకు మెటల్ నిచ్చెనలు ఉపయోగించకూడదు » స్విచ్ ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ప్లగ్‌ని పట్టుకుని కేబుల్స్‌ను డిస్కనెక్ట్ చేయాలి » త్రీ పిన్ ఎర్త్ ప్లగ్‌లు, సాకెట్లను ఉపయోగించాలి. విరిగిన త్రీ పిన్ ప్లగ్‌లను ఎప్పుడూ వాడకూడదు » ఎక్స్టెన్షన్ కేబుల్స్‌ను వినియోగించకపోవడమే మంచిది. తప్పదనుకుంటే ఒకే సామర్థ్యం (ఆంపియర్ రేటింగ్) ఉన్నదాన్ని ఎంచుకోవాలి » అన్ని కనెక్షన్లు గట్టిగా, చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో నిర్ధారించుకుని.. ఏవైనా వదులుగా ఉంటే వెంటనే ఎలక్ట్రికల్ ఇన్చార్జికి తెలియజేయాలి » కేబుల్స్ చాలా వేడిగా ఉన్నట్లు అనిపించినా.. షాక్ తగిలినా.. పరిస్థితిని సంబంధిత అధికారులకు తెలియజేయాలి » వర్షం నీటితో నిండిపోయిన రహదారుల్లో విద్యుత్ వైర్లు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దారిలో వెళ్లే వాహనాలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి » ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలను తాకకూడదు నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోంది మానవ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం.. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టం నుండి ప్రజలను రక్షించడం ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ల కర్తవ్యం. అందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యాసంస్థలు తప్పనిసరిగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలి. మేం అందించిన సూచనల ప్రకారం నడుచుకోవాలి. తద్వారా విద్యార్థులను విద్యుత్ షాక్ నుంచి కాపాడుకోగలుగుతాం. – జి.విజయలక్ష్మి, డైరెక్టర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ -
Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తనకు ఉద్యోగం వచి్చందన్న ఆనందాన్ని జీవిత భాగస్వామితో పంచుకునేందుకు వెళ్తున్న ఓ యువకుడిని కరెంటు స్తంభం రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన తుమ్మా భవానీ రుషి (35) హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య సుజాత స్లేట్ స్కూల్లో టీచర్. యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం ఉదయం రుషి ఎక్కువ జీతంతో కూడిన మరో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. సాయంత్రం తనకు కొత్త సంస్థలో ఉద్యోగం వచ్చిందని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో కృష్ణానగర్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డులోని మెట్రో ఫిల్లర్ నంబర్– 1546 వద్ద జీహెచ్ఎంసీ సర్కిల్– 19 వీధిదీపాల కరెంటు స్తంభానికి అతని చేయి తగిలింది. స్ట్రీట్‌లైట్ స్తంభానికి ఉన్న ఫ్యూజ్‌బాక్స్ ఓపెన్ చేసి ఉండడం, విద్యుత్ తీగలు వేలాడుతూ స్తంభానికి ఆనుకుని ఉండడంతో షాక్‌కు గురై రుషి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు పోలీసులకు రుషి భార్య సుజాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సర్కిల్–19 స్ట్రీట్‌లైట్ విభాగం అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం!
సాక్షి, ఆదిలాబాద్: గోండు వీరుడు కుమురంభీం వర్ధంతి కార్యక్రమం నిర్మల్ జిల్లాలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని గొండుగూడలో ఆదివారం భీం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జెండా గద్దె వద్ద భీం చిత్రపటాన్ని పెట్టి జెండా ఎగురవేసేందుకు ఇనుప పైపు అమరుస్తుండగా అది సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగకు తగిలింది. విద్యుత్ సరఫరా కావడంతో పైపును పట్టుకున్న మోహన్, భీంరావు, వెంకట్రావు షాక్‌కు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు బాధితులను విద్యుత్ సరఫరా నిలిపివేయించి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పెంద్రం మోహన్(25) మార్గమధ్యలో మరణించాడు. ఆత్రం భీంరావు(26) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో బాధితుడు వెడ్మ వెంకట్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్రం భీంరావుకు భార్య గంగామణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంద్రం మోహన్ బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇద్దరు యువకుల మృతితో చిన్నబెల్లాల్ గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్ది భుక్యా జాన్సన్‌నాయక్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి.. -
కరెంటుతో జాగ్రత్త!.. ప్రాణాలు కోల్పోతున్న రైతులు, కూలీలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నాలుగేళ్లలో 41,914 విద్యుత్ ప్రమాదాలు సంభవించగా.. మహారాష్ట్ర 10,698, ఉత్తరప్రదేశ్ 9,970, గుజరాత్ 3,767 ప్రమాదాలతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో అదే నాలుగేళ్లలో 2,922 ప్రమాదాలు జరిగాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వీటిని సైతం నివారించాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విద్యుత్ షాక్‌కు గరవుతున్నారు. కొన్ని జాగ్రతలు పాటిస్తే పెనుప్రమాదం నుంచి బయటపడవచ్చని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి వ్యవసాయ పంపుసెట్లకు మోటార్ స్టార్టర్లు, స్విచ్‌లు ఉన్న ఇనుప బోర్డులకు విధిగా ఎర్తింగ్ చేయించాలి. తడి చేతులతో, నీటిలో నిలబడి విద్యుత్ మోటార్లను, స్విచ్‌లను, పరికరాలను తాకకూడదు. ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయడానికి విద్యుత్ అర్హత గల ఎలక్ట్రీషియన్‌ను పిలిపించాలి. పొలాల్లో తెగిపడిన, జారిపడి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండి.. 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంబంధిత విద్యుత్ సిబ్బందికి గానీ, గ్రామ సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ సహాయకులకు గానీ ఫిర్యాదు చేయాలి. పంటను జంతువుల బారినుంచి రక్షించేందుకు పెట్టే ఫెన్సింగులకు విద్యుత్ సరఫరా చేయకూడదు. పాడైన విద్యుత్ వైర్లను ఇన్సులేషన్ టేపుతో చుట్టాలి. వాహనాలపై విద్యుత్ తీగలు తగిలితే బయట పడేందుకు హాపింగ్ (గెంతుట, దుముకుట) విధానం అనుసరించాలి. అంతేతప్ప ఒక కాలు వాహనంలోనూ, మరో కాలు నేలపైనా ఉంచకూడదు. వర్షం వచ్చిన సమయంలో విద్యుత్ స్తంభాలను తాకరాదు. నీటిలో పడిన విద్యుత్ వైర్ల జోలికి వెళ్లకూడదు. స్తంభం, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు. విద్యుత్ స్తంభం నుంచి వ్యవసాయ మోటారుకు మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ దూరం ఉంటే గాలులు వీచినప్పుడు వాటి మధ్య ఉండే సర్వీస్ వైరు వదులై మోటారుపై ప్రభావం చూపుతుంది. విద్యుత్ స్తంభం నుంచి మోటారుకు కరెంటు నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్ బ్యాక్, స్టార్టర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మోటార్ వద్ద ఫ్యూజ్‌లు, ఇండికేటర్ బల్బులు, స్టార్టర్‌ను చెక్కపై బిగించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇనుప డబ్బాపై బిగించకూడదు. భవనాలు, బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉన్నట్టు గుర్తిస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఇదీ చదవండి: ప్రమాదాల వేళ గోల్డెన్ అవర్‌లో స్పందించండి.. పోలీసుల సూచనలివీ -
‘అనంత’లో విద్యుత్ ప్రమాదాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: విద్యుత్ ప్రమాదాలకు అవకాశమున్న ప్రాంతాలను, బలహీనంగా ఉన్న లైన్లను గుర్తించి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఎస్పీడీసీఎల్) రంగంలోకి దిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహెూన్నూరు సమీపంలో విద్యుత్ ప్రమాదం నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సంస్థ సీఎండీ కె.సంతోషరావు మంగళవారం తెలిపారు. అనంతపురం సర్కిల్ పరిధిలోని సబ్స్టేషన్లు, లైన్లను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదం జరిగేందుకు వీలున్న లైన్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ పనులు చేపట్టేందుకు వీలుగా సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి సర్కిల్ ఇన్చార్జ్, నోడల్ ఆఫీసర్ కె.గురవయ్య(చీఫ్ జనరల్ మేనేజర్/ఓఎం) నేతృత్వంలో అనంతపురం టౌన్, అనంతపురం రూరల్, గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, హిందూపురం డివిజన్లకు బాధ్యులుగా జి.బాలకృష్ణారెడ్డి (జనరల్ మేనేజర్/ఎనర్జీ ఆడిట్), కె.ఆదిశేషయ్య(సూపరింటెండింగ్ ఇంజనీర్/అసెస్మెంట్, ఎంక్వైరీస్), సీహెచ్.రామచంద్రారావు (జనరల్ మేనేజర్/కమర్షియల్), జి.సత్యనారాయణ(జనరల్ మేనేజర్/ప్రాజెక్ట్స్), జె.రమణాదేవి (సూపరింటెండింగ్ ఇంజనీర్/డీపీఈ), పి.మురళి (జనరల్ మేనేజర్/ప్లానింగ్)లను నియమిస్తూ ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. వీరికి సహాయకులుగా నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు డీపీఈ డివిజన్ల అధికారులు విధులు నిర్వహిస్తారని, సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్లలో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు వీలుగా అనంతపురం టౌన్, అనంతపురం రూరల్, గుత్తి, కళ్యాణ దుర్గం, కదిరి, హిందూపురం డివిజన్లకు మీటర్స్, ప్రొటెక్షన్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కేటాయించినట్లు వివరించారు. అధికారులంతా వారికి కేటాయించిన విధులకు తక్షణమే హాజరు కావాలని, ఈ పనులు పూర్తయ్యేవరకు వారంతా తమకు కేటాయించిన ప్రాంతంలోనే బస చేయాలని ఆదేశాలిచ్చామన్నారు. -
విద్యుత్ తీగల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ తీగల వల్ల ఇకపై ఒక్క ప్రాణం కూడా పోకూడదని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో అమాయక కూలీలు మృత్యువాత పడటంపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి ఇటువంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని అధికారులను హెచ్చరించారు. ఆయన గురువారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలపై ఎందుకు దృష్టిపెట్టలేదని అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన తక్షణమే స్పందించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 1912 గురించి ప్రచారం కల్పించాలని, అన్ని సచివాలయాల్లో ఈ నంబరు ప్రదర్శించాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించే అంశాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, వాటిని పరిష్కరించాలన్నారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లోనే కచ్చితంగా ఉండాలని చెప్పారు. విధుల్లో ఎవరైనా ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు అన్ని ప్రాంతాలను తనిఖీ చేస్తాయని తెలిపారు. లైన్మెన్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ రంగానికి సంబంధించి కర్నూలు, అనంతరపురం జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొంత నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. పాత విద్యుత్ లైన్లను సకాలంలో మార్చకపోవడం, ఆధునికీకరణ చేపట్టకపోవడంవల్ల లైన్లు తెగిపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ రెండు జిల్లాల ఎస్ఈ, ఈఈ స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని లైన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లన్నీ ఈ నెలలో ఇవ్వాలి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం ఈ నెలాఖరు నాటికి విద్యుత్ సర్వీసు ఇవ్వాలని నిర్దేశించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ)æ ద్వారా రైతులకు డబ్బు జమచేసేందుకు ఖాతాలు ప్రారంభించడం, ఆధార్ అప్డేట్ పనుల్ని మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి విద్యుత్‌పై వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, పలు జిల్లాల స్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ
రాయదుర్గం/బొమ్మనహాళ్: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు వద్ద బుధవారం జరిగిన కరెంటు ప్రమాదంలో మృత్యువాత పడిన నలుగురు మహిళా కూలీ కుటుంబాలతోపాటు గాయపడినవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కూలీల కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చిన ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గంటల వ్యవధిలోనే పరిహారం ప్రకటించారు. అంతేగాకుండా 24 గంటల్లోపే ప్రజాప్రతినిధుల ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గురువారం దర్గాహొన్నూరులో బాధిత కుటుంబాలను ఓదార్చారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, కళ్యాణదుర్గం ఆర్డీవో నిషాంత్రెడ్డిలతో కలిసి మృతులు వన్నక్క, రత్నమ్మ, శంకరమ్మ, పార్వతి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. ప్రమాదంలో గాయపడిన సుంకమ్మ, మహేష్, లక్ష్మి, చిట్టెమ్మ, ఓబుళలమ్మలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. కాపు రామచంద్రారెడ్డి సొంతంగా మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున అందజేశారు. అంత్యక్రియలు పూర్తి కరెంటు కాటుకు గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మృత్యువాత పడటంతో దర్గాహొన్నూరులో విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చారు. విగతజీవులుగా ఉన్న తమవారిని చూసి బంధువులు, కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుల పిల్లలు తమ తల్లుల మృతదేహాలపైపడి రోదించిన తీరుతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం ఉదయం నలుగురి అంత్యక్రియలు నిర్వహించారు. -
సత్యసాయి జిల్లా: ఆటో ప్రమాదానికి కారణం ఇదే..
సాక్షి, సత్యసాయి జిల్లా: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆటోలో వెళ్తున్న కూలీలపై హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడటంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై డీఎస్పీ రమాకాంత్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం ఆటోపై ఇనుప మంచం తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇనుప మంచానికి తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొందరు ఆటో నుంచి దూకి బయటపడ్డారు. ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు మాత్రం మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించాము అని తెలిపారు. ఇదిలా ఉండగా.. విద్యుత్ ప్రమాద ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాధ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడుత కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కరెంట్ వైర్‌ను ఎర్త్‌ను ఉడుత క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు వెల్లడించారు. అనంతపురం ఎస్.ఈతో పూర్తి విచారణకు ఆదేశించామని, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల తక్షణ సహాయం అందిచనున్నట్టు తెలిపారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియాకు, మెరుగైన చికిత్సకు ఆదేశం -
విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి
సాక్షి, వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి తాలుకా ఉల్లిపుదూరు గ్రామానికి చెందిన జయప్రకాష్(30) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య లక్ష్మి(26). వీరికి వివాహం జరిగి ఏడాది అవుతుంది. సోమ వారం రాత్రి జయప్రకాష్ భార్యతో కలిసి వ్యవసాయ బావి వద్ద ఉన్న పశువును పట్టుకొచ్చేందుకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దారిలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి పశువుతో పాటు దంపతులు జయప్రకాష్, లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు. బావి వద్దకు వెళ్లిన దంపతులు రాత్రి ఇంటికి రాకపోవడంతో మంగళవారం ఉదయం బంధువులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూశారు. వారు విగత జీవులుగా పడి ఉండడాన్ని గుర్తించి తిరువలం పోలీసులకు సమాచారం అందించారు. పందుల కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తల్లీకొడుకును బలిగొన్న బజ్జీలు) -
సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లుగా శుక్రవారం సీఎంఓ అధికారులు వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ (శుక్రవారం) ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. (ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) జల విద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. తెలంగాణ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ నేపత్యంలో శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవ్వాళ్టి సీఎం శ్రీశైలం పర్యటనను రద్దుచేస్తున్నట్టుగా సీఎం అధికారులు వెల్లడించారు. (శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) -
ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించి..
అశ్వాపురం, న్యూస్‌లైన్: ఆడేపాడే వయసులో విద్యుత్ ప్రమాదం జరిగి రెండు చేతులు కోల్పోయినా అతను ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. తమ్ముడికి, చెల్లెలికి ఉత్తరం రాయాలనే పట్టుదలే అతనిని వైకల్యం జయించేలా చేసింది. కాలితో రాయడంతో పాటు అన్ని పనులు చేసుకునేలా మార్చి ఉన్నత విద్యావంతుడిని చేసింది. అతనే అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పంచాయతీ కుమ్మరిగూడేనికి చెందిన పర్సిక రాజు. కుమ్మరిగూడేనికి చెందిన చంద్రయ్య, సీతమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 1981లో జన్మించిన రాజు ఆరేళ్ల వయసుల్లో తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు గ్రామ చివరకు వెళ్లాడు. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతనిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పట్లో సరైన వైద్యసదుపాయాలు లేకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రెండు చేతులు కోల్పోయాడు. రెండు చేతులు లేకపోవడంతో అతను మొదట్లో బాధపడ్డాడు. తోటి పిల్లలు బడికెళ్తుంటే తాను వెళ్లలేకపోతున్నానని కుమిలిపోయాడు. ఈ క్రమంలో బూర్గంపాడు, కిన్నెరసాని వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న చెల్లెలు భవానీ, తమ్ముడు రామారావులు ఉత్తరం రాయాలని ఆలోచన వచ్చింది. దీంతో అతను ప్రతీ రోజు సాధన చేసి కాలితో రాయడం నేర్చుకుని వారికి ఉత్తరాలు రాశాడు. అతని పట్టుదల, చదువుకోవాలనే ఆశ చూసిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో అతను మార్చి 2005లో అశ్వాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్‌గా పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2005 -07 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2007 నుంచి 2010 వరకు భద్రాచలం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, ఆ తర్వాత బీఎడ్ పూర్తి చేశాడు. అనంతరం ఖాళీగా ఉండకుండా అశ్వాపురంలోని సన్మార్గ్ వికలాంగుల ఆశ్రమంలో కంప్యూటర్ విద్యను సైతం నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... చేతులు లేవని ఇంట్లో కూర్చుని ఉండకుండా పట్టుదలతో ఉన్నత చదువులు చదివా. తల్లిదండ్రులు, అన్నదమ్ముల ప్రోత్సాహంతో ఇప్పటి వరకు ఆనందంగానే ఉన్నా. నా విద్యార్హతకు తగిన ఉద్యోగం కల్పించి జీవనోపాధి కల్పించాలని పలుమార్లు భద్రాచలం పీఓలకు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేదు. సీఆర్టీగా ఉద్యోగం కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నాకు ఉపాధి కల్పించి ఆదుకోవాలి. - పర్సిక రాజు