విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
స్తంభంపై పనిచేస్తుండగా విద్యుదాఘాతం
జవహర్‌నగర్: ‘సంక్రాంతికి వస్తా..నీవు ఆరోగ్యంగా ఉండు. నాకు చిన్న పని ఉంది చూసుకుని రేపు ఇంటికి బయలుదేరి వస్తా. పండగ అయ్యాక మనమిద్దరం కలిసి బియ్యం తీసుకుని హైదరాబాద్‌కు వెళ్దాం..’ అని గర్భవతి అయిన భార్యతో ఫోన్‌లో మాట్లాడి వెళ్లిన కొన్ని గంటలకే ఆ ఇంటి యజమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కరెంటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందాడు. జవహర్‌నగర్ సీఐ సైదయ్య, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా తండాకు చెందిన బానోతు ప్రశాంత్ (26), సరిత దంపతులు.
వీరు సంతో నగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ బాలాజీనగర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ప్రశాంత్ శుక్రవారం సంతోష్‌నగర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు తోటి కారి్మకులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో ఏఈ సాంబశివరావు, లైన్‌మెన్ నాగరాజుతో పాటు కాంట్రాక్టర్ రాజేశ్‌లు ఎల్‌సీ తీసుకున్నామని, మీరు పని పూర్తి చేయాలని చెప్పడంతో ప్రశాంత్ ఉదయం 10.20 నిమిషాల సమయంలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్ కట్‌చేస్తుండగా 11కేవీ తీగలు తగిలాయి. ప్రశాంత్ స్తంభంపైన పనిచేస్తుండగానే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యుత్ సరఫరాను ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ప్రశాంత్ మృతిచెందాడు.
తోటి కార్మికులు, ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్యతో ఉదయం ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే..మృత్యువాత పడిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కామేపల్లి మండల మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికుని కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామని విద్యుత్ అధికారులు హమీ ఇచ్చారు. ప్రస్తుతానికి తక్షణ సహాయంగా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment