కంప్యూటర్ కీ బోర్డు ఆపరేట్ చేస్తున్న రాజు
అశ్వాపురం, న్యూస్‌లైన్: ఆడేపాడే వయసులో విద్యుత్ ప్రమాదం జరిగి రెండు చేతులు కోల్పోయినా అతను ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. తమ్ముడికి, చెల్లెలికి ఉత్తరం రాయాలనే పట్టుదలే అతనిని వైకల్యం జయించేలా చేసింది. కాలితో రాయడంతో పాటు అన్ని పనులు చేసుకునేలా మార్చి ఉన్నత విద్యావంతుడిని చేసింది. అతనే అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పంచాయతీ కుమ్మరిగూడేనికి చెందిన పర్సిక రాజు.
కుమ్మరిగూడేనికి చెందిన చంద్రయ్య, సీతమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 1981లో జన్మించిన రాజు ఆరేళ్ల వయసుల్లో తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు గ్రామ చివరకు వెళ్లాడు. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతనిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పట్లో సరైన వైద్యసదుపాయాలు లేకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రెండు చేతులు కోల్పోయాడు. రెండు చేతులు లేకపోవడంతో అతను మొదట్లో బాధపడ్డాడు.
తోటి పిల్లలు బడికెళ్తుంటే తాను వెళ్లలేకపోతున్నానని కుమిలిపోయాడు. ఈ క్రమంలో బూర్గంపాడు, కిన్నెరసాని వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న చెల్లెలు భవానీ, తమ్ముడు రామారావులు ఉత్తరం రాయాలని ఆలోచన వచ్చింది. దీంతో అతను ప్రతీ రోజు సాధన చేసి కాలితో రాయడం నేర్చుకుని వారికి ఉత్తరాలు రాశాడు.
అతని పట్టుదల, చదువుకోవాలనే ఆశ చూసిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో అతను మార్చి 2005లో అశ్వాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్‌గా పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2005 -07 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
ఆ తర్వాత 2007 నుంచి 2010 వరకు భద్రాచలం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, ఆ తర్వాత బీఎడ్ పూర్తి చేశాడు. అనంతరం ఖాళీగా ఉండకుండా అశ్వాపురంలోని సన్మార్గ్ వికలాంగుల ఆశ్రమంలో కంప్యూటర్ విద్యను సైతం నేర్చుకున్నాడు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...
చేతులు లేవని ఇంట్లో కూర్చుని ఉండకుండా పట్టుదలతో ఉన్నత చదువులు చదివా. తల్లిదండ్రులు, అన్నదమ్ముల ప్రోత్సాహంతో ఇప్పటి వరకు ఆనందంగానే ఉన్నా. నా విద్యార్హతకు తగిన ఉద్యోగం కల్పించి జీవనోపాధి కల్పించాలని పలుమార్లు భద్రాచలం పీఓలకు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేదు. సీఆర్‌టీగా ఉద్యోగం కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నాకు ఉపాధి కల్పించి ఆదుకోవాలి.
- పర్సిక రాజు