పెంద్రం మోహన్(ఫైల్), ఆత్రం భీంరావు(ఫైల్)
సాక్షి, ఆదిలాబాద్: గోండు వీరుడు కుమురంభీం వర్ధంతి కార్యక్రమం నిర్మల్ జిల్లాలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని గొండుగూడలో ఆదివారం భీం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జెండా గద్దె వద్ద భీం చిత్రపటాన్ని పెట్టి జెండా ఎగురవేసేందుకు ఇనుప పైపు అమరుస్తుండగా అది సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగకు తగిలింది.
విద్యుత్ సరఫరా కావడంతో పైపును పట్టుకున్న మోహన్, భీంరావు, వెంకట్‌రావు షాక్‌కు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు బాధితులను విద్యుత్ సరఫరా నిలిపివేయించి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పెంద్రం మోహన్(25) మార్గమధ్యలో మరణించాడు. ఆత్రం భీంరావు(26) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో బాధితుడు వెడ్మ వెంకట్‌రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆత్రం భీంరావుకు భార్య గంగామణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంద్రం మోహన్ బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇద్దరు యువకుల మృతితో చిన్నబెల్లాల్ గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. బీఆర్‌ఎస్ ఖానాపూర్ అభ్యర్ది భుక్యా జాన్సన్‌నాయక్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇవి చదవండి: ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి..
Comments
Please login to add a commentAdd a comment