సిడాం వినేష్(ఫైల్)
ఆదిలాబాద్: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని పా లుండిగూడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై దుబ్బక సునీల్, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఉట్నూర్ మండలంలోని చింతకర గ్రామానికి చెందిన సిడాం లక్ష్మణ్, కమలబాయి దంపతులకు కుమారుడు వినేష్(22) ఆటో నడుపుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు.
అయితే మండలంలోని పాలుండిగూడ గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఆ యువతితో పెళ్లి విషయంలో వినేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అప్పుడప్పుడు పాలుండిగూడకు వెళ్లి సదరు యువతిని కలిసేవాడు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి పాలుండిగూడ గ్రామంలో అతడి దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లాడు. రాత్రి బహిర్భూమికి వెళ్తానని బంధువులకు చెప్పి బయటకు వచ్చిన వినేష్ తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో యువకుడి బంధువులైన గజానంద్, కేశవ్‌లు గాలించగా బరద్వల్ బహుదుర్‌సింగ్ వ్యవసాయ చేనులో స్పృహ కోల్పోయి కనిపించాడు. ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై శనివారం ఉదయం పాలుండిగూడ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వినేష్ మృతితో చింతకర గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఇవి చదవండి: వరుసకు చెల్లి.. అయినా ప్రేమ పెళ్లి.. కానీ చివరికి?
Comments
Please login to add a commentAdd a comment