కార్తీక్(ఫైల్)
కాలువ నీటిలో మునిగి ఇంటర్ విద్యార్థి మృతి
దండేపల్లి మండలంలో ఘటన
ఆదిలాబాద్: పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హోలీ ఆడుకుని స్నేహితులతో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాక ఇంటర్మీడియెట్ విద్యార్థి నీటమునిగి చనిపోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దండేపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం.. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు.
ఇంటర్మీడియెట్ విద్యార్థి, పెద్ద కుమారుడు కార్తీక్(18) గత ఐదు రోజుల క్రితం తల్లి అశ్వినితో కలిసి దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. అనంతరం వారితో కలిసి తానిమడుగు వద్ద గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద కడెం ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు.
దీంతో అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేదరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
అమ్మమ్మ ఇంటికి వచ్చి..
ఇంటర్ పరీక్షలు ముగియడంతో, కాలేజీకి సెలవులు వచ్చాయి. కార్తీక్ తన తల్లి అశ్వినితో కలిసి ఐదు రోజుల క్రితం పాతమామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా స్నేహితులతో గడుపుతున్నాడు. ఇంతలో సోమవారం హోలీ పండుగ రావడంతో, స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నాడు. స్నానం కోసం కాలువ వద్దకు వెల్లిన అతను స్నానం చేసేందుకు నీటిలో దిగాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకుపై పెట్టుకున్న ఆశలు అతని అకాల మృతితో ఆవిరయ్యాయి.
ఆదిలాబాద్‌లో మరో విద్యార్థి..
పండుగ పూట స్నానానికి వెళ్లి వాగులో గల్లంతై విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. ఆదిలాబాద్‌రూరల్ మండలం భీంసరి శివారులో గల వాగులో స్నానానికి వెళ్లి గుమ్ముల సాత్విక్ (14) అనే విద్యార్థి మృతి చెందాడు.
ఎస్సై ముజాహిద్, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్‌నగర్ కాలనీకి చెందిన గుమ్ముల స్వర్ణలతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారికి కొన్నేళ్ల క్రితం విడాకులయ్యాయి. ఇద్దరి పిల్లలను తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పోషిస్తోంది. చిన్నారులిద్దరూ పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.
సాత్విక్ సోమవారం హోలీ సంబరాలు చేసుకొని అనంతరం స్నానానికి మిత్రులతో కలిసి వాగుకు వెళ్లాడు. స్నేహితులంతా వాగు ఒడ్డున నిలబడి ఉండగా.. స్నానం చేస్తానని సాత్విక్ అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు బయటకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment