కూతురికి తండ్రి వీడియోకాల్
అప్పులు పెరిగి.. కిస్తీలు కట్టలేక రైతు ఆత్మహత్య
ఇచ్చోడ: ‘‘చనిపోతున్నా బిడ్డా..’’అంటూ ఓ తండ్రి కూతురికి వీడియో కాల్ చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసి.. వారు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తూ వెళ్లేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జున్ని గ్రామంలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. అప్పులు పెరిగిపోవడంతోపాటు, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
గ్రామస్తులు, ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. జున్ని గ్రామానికి చెందిన అడిగే జనార్దన్‌కు భార్య గంగబాయి, ముగ్గురు కూతుళ్లు లక్ష్మి, ప్రియ, గంగమణి, కుమారుడు విఠల్ ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. జనార్దన్ తనకున్న మూడెకరాల్లో పత్తి, సోయా సాగు చేశాడు. కొన్ని నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే ట్రాక్టర్ సరిగా నడవకపోవడంతో కిస్తీలు కట్టలేకపోయాడు. దీంతో కిస్తీలు కట్టాలని ఫైనాన్స్ వారు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో జనార్దన్ మద్యానికి బానిసయ్యాడు.
శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పుణేలో ఉంటున్న కూతురికి వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే ఆమె గ్రామంలోని తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించింది. వీడియో కాల్‌లో కనిపించిన ప్రదేశంలో సిమెంటు బెంచీలు ఉన్నాయని చెప్పింది.
దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చోడ పార్కులో గాలించారు. అక్కడ కనిపించకపోవడంతో పొలం చుట్టుపక్కల ప్రదేశంలో గాలిస్తుండగా.. ఓ స్టోన్ క్రషర్ సమీపంలో చెట్టుకు జనార్దన్ (50) మృతదేహం వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment