విద్యాసంస్థలు విధిగా భద్రతా నియమాలు పాటించాలి
ఎలక్ట్రిక్ వైరింగ్, స్విచ్‌లు, జాయింట్ల తనిఖీ తప్పనిసరి
పాడైన ఎలక్ట్రికల్ మెటీరియల్‌ను తక్షణం మార్చేయాలి
ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రధాన బోర్డులకు కంచె వంటి ఏర్పాట్లు అవసరం
ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగం సూచన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విద్యాసంస్థల్లో తరగతులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పరిస్థితి మెరుగుపడిందికానీ, అనేక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో భద్రతా ప్రమాణాలు అంతంతమాత్రమే. పెచ్చులూడిపోయి నీరుకారే స్లాబులు, తడిచి చెమ్మెక్కిన గోడలు ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి.
అలాంటి విద్యాసంస్థల్లో వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యుత్ వైర్లు, లైన్లు, స్విచ్ బోర్డులు, ఎర్తింగ్, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి వాటిపై ఆడిట్ నిర్వహించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు విద్యుత్ ప్రమాదాల నివారణకు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
ఈ నియమాలు పాటిస్తే మేలు
» ఎలక్ట్రిక్ వైరింగ్, స్విచ్‌లు, జాయింట్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి.. పాడైపోయిన, అరిగిపోయిన వాటిని వెంటనే మార్చాలి
» పాఠశాలలు, కళాశాలల ఆవరణలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రధాన బోర్డులకు తప్పనిసరిగా కంచె ఏర్పాటుచేయాలి
»పిల్లలు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
» అన్ని ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎలక్ట్రికల్ సేఫ్టీ నిబంధనలను అనుసరించాలి
» భూమిలో ఉన్న స్తంభాలను సరిగ్గా ఇన్సులేట్ చేయాలి. అన్ని కేబుల్స్, జంక్షన్‌లను ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్లు, సరి్టఫైడ్ ఎల్రక్టీషియన్‌లతో తనిఖీ చేయించాలి
» ప్రామాణిక, మంచి నాణ్యత గల ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించాలి. కేబుల్స్, ప్లగ్‌లు కరగకుండా నిరోధించాలంటే సాకెట్‌కు ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఎక్కువ పరికరాలు సర్క్యూట్‌లో ప్లగ్ చేస్తే.. కరెంట్ వైర్లు వేడెక్కి స్పార్క్ వచ్చి మంటలు చెలరేగుతాయి
» విద్యార్థులు, సిబ్బందికి లీకేజీలు, ఎలక్ట్రిక్ షాక్‌లను అరికట్టడం, బాధితులను రక్షించడం, షాక్‌కు గురైన వారికి ప్రథమ చికిత్స అందించడం వంటి అంశాల్లో అవగాహన కల్పించాలి
» షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తే తప్పించుకోవడానికి వీలుగా అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలి
»సబ్‌స్టేషన్లు, సరఫరా లైన్లకు దూరంగా పాఠశాలలు ఉండేలా చూసుకోవాలి
»ఓపెన్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్, జంక్షన్ బాక్స్, స్ట్రీట్ బాక్స్ మొదలైనవి కూడా పాఠశాలలకు సమీపంలో ఉండకూడదు
»పాఠశాల ఆవరణలోను, విద్యార్థులు వెళ్లే మార్గంలోను ఉండే ట్రాన్స్‌ఫార్మర్లకు పూర్తి స్థాయిలో కంచె వేయాలి
» విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఎలక్రిక్ పరికరాల్లో మరమ్మతులు వస్తే తప్పనిసరిగా ఎల్రక్టీషియన్ సహాయం తీసుకోవాలి. సొంతంగా మరమ్మతులు చేయకూడదు
» కుళాయి, నీళ్ల ట్యాంకులకు సమీపంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగించకూడదు
» వర్షం, తుపానుల సమయాల్లో సరఫరా లైన్లు ఉన్న ఏ నిర్మాణం కింద ఆశ్రయం పొందకూడదు
»కరెంటు తీగలకు సమీపంలోని చెట్లు ఎక్కడం, తాకడం వంటివి చేయకూడదు
»ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులకు మెటల్ నిచ్చెనలు ఉపయోగించకూడదు
» స్విచ్ ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ప్లగ్‌ని పట్టుకుని కేబుల్స్‌ను డిస్‌కనెక్ట్ చేయాలి
» త్రీ పిన్ ఎర్త్ ప్లగ్‌లు, సాకెట్‌లను ఉపయోగించాలి. విరిగిన త్రీ పిన్ ప్లగ్‌లను ఎప్పుడూ వాడకూడదు
» ఎక్స్‌టెన్షన్ కేబుల్స్‌ను వినియోగించకపోవడమే మంచిది. తప్పదనుకుంటే ఒకే సామర్థ్యం (ఆంపియర్ రేటింగ్) ఉన్నదాన్ని ఎంచుకోవాలి
» అన్ని కనెక్షన్లు గట్టిగా, చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో నిర్ధారించుకుని.. ఏవైనా వదులుగా ఉంటే వెంటనే ఎలక్ట్రికల్ ఇన్‌చార్జికి తెలియజేయాలి
» కేబుల్స్ చాలా వేడిగా ఉన్నట్లు అనిపించినా.. షాక్ తగిలినా.. పరిస్థితిని సంబంధిత అధికారులకు తెలియజేయాలి
» వర్షం నీటితో నిండిపోయిన రహదారుల్లో విద్యుత్ వైర్లు పడిపోయే అవకాశం
ఉంటుంది. కాబట్టి ఆ దారిలో వెళ్లే వాహనాలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి
» ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలను తాకకూడదు
నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోంది
మానవ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం.. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టం నుండి ప్రజలను రక్షించడం ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ల కర్తవ్యం. అందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం.
విద్యాసంస్థలు తప్పనిసరిగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలి. మేం అందించిన సూచనల ప్రకారం నడుచుకోవాలి. తద్వారా విద్యార్థులను విద్యుత్ షాక్ నుంచి కాపాడుకోగలుగుతాం. – జి.విజయలక్ష్మి, డైరెక్టర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ
Comments
Please login to add a commentAdd a comment