అమెరికాలో చదువుల కోసం భారతీయ యువత ఆరాటం
దేశీయ విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజుల ఖర్చు
కొన్ని అమెరికా సంస్థలతో సమానంగా ఉండటంతో విదేశీ విద్యపై ఆసక్తి
దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో పరిమిత సంఖ్యలోనే సీట్లు
మరోవైపు అధిక కటాఫ్‌లు, రిజర్వేషన్ విధానాలు, అవినీతి జాఢ్యంతో లభ్యంకాని సీట్లు
ఈ క్రమంలోనే భారత్ విద్యార్థుల చూపు అమెరికా వైపు
అధిక ప్యాకేజీలిచ్చే సంస్థల్లో ఉద్యోగాలు సాధించేందుకు నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్య అవసరమని యువత భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతీయ విద్యార్థులు విదేశాల్లో అవకాశాలను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో విద్యనభ్యసించేందుకు భారతీయ యువత ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే 2023–24లో అమెరికా వర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. – సాక్షి, అమరావతి
దేశీయంగా పరిమిత సంఖ్యలోనే సీట్లు
దేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఎక్కువ మంది యూఎస్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో అధిక కటాఫ్‌లు, రిజర్వేషన్ విధానాలు, అవినీతి ఘటనల కారణంగా చాలామంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన దేశీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందలేకపోతున్నారు. అత్యంత పోటీ ఉండే ఐఐటీల్లో లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు, అడ్వాన్స్‌కు హాజరవుతుంటే.. కేవలం వేలల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు.
కొన్ని సందర్భాల్లో జనరల్ కేటగిరీల్లో అత్యధిక స్కోర్ సాధించిన విద్యార్థులకు సైతం సీట్లు దక్కడం లేదు. తత్ఫలితంగా దేశంలో అగ్రశ్రేణి సంస్థల్లో అత్యంత పోటీ వాతావరణం చాలామంది విద్యార్థులను విదేశాల్లో చదువులను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. విదేశాల్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చు భారత్‌లోని కొన్ని అగ్రశ్రేణి సంస్థల ఫీజులతో సమానంగా ఉంటోంది. ఒకప్పుడు తక్కువ ఖర్చులు అధిక నాణ్యత కలిగిన విద్యను అందించిన ప్రసిద్ధ ఐఐటీలు ఇటీవల ఫీజులను పెంచేశాయి. అందుకే చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు.
అగ్రశ్రేణి వర్సిటీలకు నిలయం
అత్యాధునిక పరిశోధన అవకాశాలు, సౌకర్యాలు అందిస్తూ.. అంతర్జాతీయంగా జర్నల్స్‌ను ప్రచురించే అగ్రశ్రేణి వర్సిటీలకు అమెరికా నిలయంగా మారింది. భారతదేశంలో విద్య కొంతవరకు సాపేక్షంగా ఉన్నప్పటికీ ఐఐటీలు, ఐఐఎంల వంటి అగ్రశ్రేణి సంస్థలు యూఎస్ వర్సిటీలను అందుకోలేపోతున్నాయి. పైగా ఇటీవల కాలంలో ఐఐటీలు, ఐఐఎంల్లో ఫీజులు గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రవేశాలు పొందే అవకాశాలు మరింత సన్నగిల్లాయి.
మరోవైపు అమెరికా వర్సిటీలు విదేశీ విద్యార్థులకు సైతం అనుకూలమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. తద్వారా విద్యా, కెరీర్ వృద్ధికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఆ దేశం మారింది. ఈ క్రమంలోనే అమెరికాలో 42.9 శాతం మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్, 24.50 శాతం మంది ఇంజనీరింగ్, 11.20 శాతం మంది బిజినెస్ మేనేజ్‌మెంట్, 5.40 శాతం మంది ఫిజికల్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చేస్తున్నారు. దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో 2023–24లో 3.31 లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారు. ఇది అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ అగ్రస్థానంలో నిలబెట్టింది.
యూఎస్‌లో ఉద్యోగ అవకాశాలు
జాబ్ మార్కెట్‌లో ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు మెకిన్సే, గూగుల్, అమెజాన్, యాపిల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి అగ్ర కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎఫ్–1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 41శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment