నిబంధనలకు విరుద్ధంగా ఓ విద్యా సంస్థ బస్సుల రిజిస్ట్రేషన్లు
కేంద్ర చట్టం బేఖాతరు.. భద్రతా ప్రమాణాలు గాలికి...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇదీ చిత్రం
సాక్షి, అమరావతి: ఆయనో టీడీపీ ఎంపీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల టైకూన్‌గా గుర్తింపు పొందారు. అంతకంటే అర్హత ఏముంటుందని రవాణా శాఖ అధికారులు భావించారు. అందుకే ఆయన విద్యా సంస్థకు చెందిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాల కోసం విద్యార్థుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఏమాత్రం పాటించకపోయినా సరే నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రతతో ముడిపడిన వ్యవహారం అయినప్పటికీ ఎంపీ ఒత్తిడికి తలొగ్గి ఆయన చెప్పినట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర మోటారు వాహనాల చట్టం ఏం చెబుతోందంటే..
విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రత్యేక చట్టం రూపొందించింది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు.. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. ఫైర్ డిటెక్షన్, అలార్మ్ సిస్టం, ఫైర్ సప్రెషన్ సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టంలకు సంబంధించిన పరికరాలు, ఉపకరణాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
రూల్స్, గీల్స్ ఏమీలేవు..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదేళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన కుటుంబం దశాబ్దాలుగా ఉన్నత విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఆ విద్యా సంస్థ కోసం ఇటీవల కొత్తగా 50 బస్సులను కొనుగోలు చేశారు. అందుకోసం చెన్నై నుంచి వాహనాల ఛాసీస్‌లను కొనుగోలు చేసి బస్సుల బాడీ బిల్డింగ్ పనులు చేయించారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అగ్నిమాపక పరికరాలు, ఉపకరణాలు ఏర్పాటు చేయలేదు. కానీ తమ విద్యా సంస్థల ట్రస్ట్ తరఫున కొనుగోలు చేసిన ఆ బస్సులను రిజిస్ట్రేషన్ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.
అగ్నిమాపక పరికరాలు పొందుపరచలేదని కొందరు అధికారులు చెప్పినా సరే ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ‘మా బస్సులను రిజిస్ట్రేషన్ చేయండి.. మిగిలిన విషయాలు ఎత్తొద్దు.. 40 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం.. మాకు కొత్తగా రూల్స్ చెప్పొద్దు’ అని ఆయన గదమాయించారు. దాంతో రవాణా శాఖ అధికారులు గప్‌చుప్‌గా ఆ విద్యా సంస్థ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో 17 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. మిగిలిన బస్సులకు కూడా త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేయడానికి అధికారులు దస్త్రాలు వేగంగా కదుపుతున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment