బంజారాహిల్స్: జీహెచ్‌ఎంసీ స్ట్రీట్‌లైట్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తనకు ఉద్యోగం వచి్చందన్న ఆనందాన్ని జీవిత భాగస్వామితో పంచుకునేందుకు వెళ్తున్న ఓ యువకుడిని కరెంటు స్తంభం రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన తుమ్మా భవానీ రుషి (35) హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
ఆయన భార్య సుజాత స్లేట్ స్కూల్‌లో టీచర్. యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం ఉదయం రుషి ఎక్కువ జీతంతో కూడిన మరో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. సాయంత్రం తనకు కొత్త సంస్థలో ఉద్యోగం వచ్చిందని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో కృష్ణానగర్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డులోని మెట్రో ఫిల్లర్ నంబర్– 1546 వద్ద జీహెచ్‌ఎంసీ సర్కిల్– 19 వీధిదీపాల కరెంటు స్తంభానికి అతని చేయి తగిలింది.
స్ట్రీట్‌లైట్ స్తంభానికి ఉన్న ఫ్యూజ్‌బాక్స్ ఓపెన్ చేసి ఉండడం, విద్యుత్ తీగలు వేలాడుతూ స్తంభానికి ఆనుకుని ఉండడంతో షాక్‌కు గురై రుషి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు పోలీసులకు రుషి భార్య సుజాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ సర్కిల్–19 స్ట్రీట్‌లైట్ విభాగం అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment