విద్యుత్‌ తీగల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదు | Peddireddy Ramachandra Reddy On Electric wires | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదు

Published Fri, Nov 4 2022 4:36 AM | Last Updated on Fri, Nov 4 2022 4:36 AM

Peddireddy Ramachandra Reddy On Electric wires - Sakshi

అధికారులతో సమీక్షలో విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ తీగల వల్ల ఇకపై ఒక్క ప్రాణం కూడా పోకూడదని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో విద్యుత్‌ తీగలు తెగిపడిన ఘటనలో అమాయక కూలీలు మృత్యువాత పడటంపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి ఇటువంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని అధికారులను హెచ్చరించారు.

ఆయన గురువారం విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి విద్యుత్‌ శాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలపై ఎందుకు దృష్టిపెట్టలేదని అధికారులను ప్రశ్నించారు. విద్యుత్‌ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబరు 1912 గురించి ప్రచారం కల్పించాలని, అన్ని సచివాలయాల్లో ఈ నంబరు ప్రదర్శించాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించే అంశాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, వాటిని పరిష్కరించాలన్నారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లోనే కచ్చితంగా ఉండాలని చెప్పారు. విధుల్లో ఎవరైనా ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు అన్ని ప్రాంతాలను తనిఖీ చేస్తాయని తెలిపారు. లైన్‌మెన్లు, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్‌ రంగానికి సంబంధించి కర్నూలు, అనంతరపురం జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొంత నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. పాత విద్యుత్‌ లైన్లను సకాలంలో మార్చకపోవడం, ఆధునికీకరణ చేపట్టకపోవడంవల్ల లైన్లు తెగిపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ రెండు జిల్లాల ఎస్‌ఈ, ఈఈ స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని లైన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. 

పెండింగ్‌ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లన్నీ ఈ నెలలో ఇవ్వాలి
దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం ఈ నెలాఖరు నాటికి విద్యుత్‌ సర్వీసు ఇవ్వాలని నిర్దేశించారు. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ)æ ద్వారా రైతులకు డబ్బు జమచేసేందుకు ఖాతాలు ప్రారంభించడం, ఆధార్‌ అప్‌డేట్‌ పనుల్ని మరింత వేగవంతం చేయాలన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి విద్యుత్‌పై వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, విజిలెన్స్‌ జేఎండీ బి.మల్లారెడ్డి, పలు జిల్లాల స్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement