
పెద్దిరెడ్డి భూముల కేసులో అధికారులకు హైకోర్టు ఆదేశం
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టీకరణ
విచారణ మార్చి 6కి వాయిదా
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పరిధిలోని అటవీ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించడంతోపాటు వాటిపై వివరణ ఇవ్వాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ విథున్‌రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, పి.ఇందిరమ్మ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నోటీసులను రద్దు చేసి, తమ భూముల విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని వారు తమ వ్యాజ్యాల్లో కోర్టును కోరారు.
ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలన్నా కూడా చట్ట నిబంధనలకు అనుగుణంగానే చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళంపేట గ్రామంలోని సర్వే నంబర్ 296/2లోని 18.94 ఎకరాల భూమిపై పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, సర్వే నంబర్ 295/1లోని 15 ఎకరాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 295/1సీ లోని 21 ఎకరాలపై మిథున్‌రెడ్డి, సర్వే నంబర్లు 295/1బీలో 10.8 ఎకరాలు, 295/1డీలో 89 సెంట్లు, 296/1లో 9.11 ఎకరాల భూముల విషయంలో ఇందిరమ్మ పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు అటవీ భూములను ఆక్రమించలేదని తెలిపారు.
ఆ భూములను 20 ఏళ్ల కిందటే వాటి యజమానుల నుంచి కొనుగోలు చేశారని వివరించారు. అప్పట్లోనే అక్కడ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఇప్పుడు వాటిని అటవీ భూములుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారని చెప్పారు. తమ మనుషుల సమక్షంలో సర్వే చేసినట్లు పేర్కొంటూ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారన్నారు.
నిరాధార ఆరోపణలతో ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చేసుకుని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం... పిటీషనర్ల విషయంలో కఠిన చర్యలేవైనా తీసుకోవాల్సి వస్తే, చట్ట ప్రకారమే నడుచుకోవాలని అధికారులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment