రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: ప్రాణహాని నేపథ్యంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 2+2 భద్రత కలి్పంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు తనకు 5+5 భద్రత ఉండేదని, ఇప్పుడు 2+2 భద్రత సిబ్బందిని కూడా పంపడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ చక్రవర్తి సోమవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి న్యాయవాది గుడిసేవ నరసింహారావు వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గతంలో ఉన్న భద్రతను 1+1కు కుదిరించారని తెలిపారు. పిటిషనర్‌కు ఉన్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న 5+5 భద్రతను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పెద్దిరెడ్డికి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పారు.
ఎస్పీ నివేదికలో సైతం ఇదే విషయాన్ని చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఆయన 1+1 భద్రతకు మాత్రమే అర్హుడని, అందువల్ల అదే భద్రతను ఇస్తున్నామని చెప్పారు. భద్రత కోసం పెద్దిరెడ్డి పెట్టుకున్న దరఖాస్తు భద్రత రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) ముందు పెండింగ్‌లో ఉందన్నారు. ఎస్‌ఆర్‌సీ నిర్ణయం లేకుండా అదనపు భద్రతకు ఆదేశాలు ఇవ్వరాదని చెప్పారు. అలా చేస్తే మరింతమంది ఇదేరీతిలో అదనపు భద్రత కోసం పిటిషన్లు దాఖలు చేస్తారని తెలిపారు.
ప్రాణహాని నేపథ్యంలో ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నాం
ఈ సమయంలో జస్టిస్ చక్రవర్తి స్పందిస్తూ.. ప్రాణహాని నేపథ్యంలో దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధమైన పోస్టులో పెద్దిరెడ్డి కొనసాగుతున్నారని గుర్తుచేశారు. అందువల్ల మూడువారాల పాటు ఆయనకు 2+2 భద్రత కలి్పంచాలని ఆదేశించారు. ఈ సమయంలో దమ్మాలపాటి స్పందిస్తూ.. ఎస్‌ఆర్‌సీ నివేదిక వచ్చేవరకు ఈ భద్రతను కలి్పస్తామని చెప్పారు. అలా అయితే మూడువారాలు లేదా ఎస్‌ఆర్‌సీ నివేదిక వచ్చే వరకు 2+2 భద్రత కల్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రెండువారాలకు వాయిదా వేశారు. అనంతరం 4+4 భద్రతను కొనసాగించాలంటూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం కూడా విచారణకు వచ్చింది. ఏజీ దమ్మాలపాటి స్పందిస్తూ.. ఎంపీగా ఆయన 2+2కి అర్హుడని, ఆయనకు ఆదే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను రెండువారాలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment