సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గతంలో మాదిరిగా యథాతధంగా 2+2 భద్రతను కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.
కాగా, గతంలో తనకు కల్పించిన భద్రతను యథాతధంగా కొనసాగించాలంటూ పెద్దిరెడ్డి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు పెద్దిరెడ్డి పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రాణహాని నేపథ్యంలో పెద్దిరెడ్డికి 2+2 భద్రతను కల్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇక, విచారణ సమయంలో.. ప్రాణహాని నేపథ్యంలో దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని గుర్తు చేస్తూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల పాటు లేదా ఎస్‌ఆర్‌సీ నివేదిక వచ్చేంత వరకు పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. ఎంఆర్‌పల్లిలో తమ భూముల్లో నిర్మించుకున్న నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నియంత్రించాలని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇక, విచారణ సందర్భంగా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్న రోడ్డు, గేటు, ఇతర నిర్మాణాల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment