విజయవాడ నుంచి కొల్లేరు వరకు బుడమేరు ఉగ్రరూపం
తేలప్రోలు నుంచి నందమూరు వెళ్లే రహదారిపై నీటి ఉధృతి
కొయ్యగూరపాడు వద్ద రెండు వైపులా మునిగిపోయిన రోడ్డు
పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
ప్రజలకు కునుకు కరువు
(బుడమేరు పరీవాహక ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) : ‘బుడమేరు వరద ఉధృతి దిగువ ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చింది. గ్రామాలకు ఆనుకుని ఉన్న పొలాలన్నీ మునిగిపోయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. మన పక్క ఊరిలో మెయిన్ రోడ్డుపైకి నీరు వచ్చేసింది. మన ఊరికి అటూ ఇటూ కూడా రోడ్డు మునిగిపోయింది.
చుట్టూ నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏ క్షణమైనా మన గ్రామాన్ని వరద నీరు ముంచెత్తవచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండాలి..! ’’ బుడమేరు పరీవాహక గ్రామాల్లో పదకొండు రోజులుగా ఇలా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడు వరద విరుచుకుపడుతుందోననే భయంతో నిరంతరం కాపలా కాస్తున్నారు. బుడమేరు వరద ఉధృతితో గ్రామాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది.
వరదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో బెజవాడను ముంచెత్తిన బుడమేరు క్రమంగా శాంతిస్తున్నప్పటికీ పరీవాహక గ్రామాలను మాత్రం బేజారెత్తిస్తోంది. ఖమ్మం–కృష్ణా జిల్లాల నడుమ కొండల్లో మొదలయ్యే బుడమేరు వరద నీరంతా విజయవాడ నుంచి దిగువకు ప్రవహించి కొల్లేరులో కలిసే వరకు అనేక గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో పలు గ్రామాలు పదకొండు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రధాన రహదారులపైకి బుడమేరు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. పదుల సంఖ్యలో గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.
ఉంగుటూరు మండలం తేలప్రోలు నుంచి గుడివాడ మండలం నందమూరు వెళ్లే ప్రధాన రహదారిపై బుడమేరు వరద నీటి ఉధృతి పదకొండు రోజులుగా తగ్గకపోవడంతో అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంచె వేసి పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం రాత్రి పగలు గస్తీ కాస్తున్నారు. దీనివల్ల 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అటువైపు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి వచ్చేందుకు అవస్థ పడుతున్నారు. గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారిపై కొయ్యగూరపాడు రోడ్డు ఇరువైపులా మునిగిపోయింది. దీంతో గన్నవరం, నందివాడ మండలాల్లోని పది గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
విజయవాడ శివారు ఎనికేపాడు నుంచి దోనేటుకూరు, నిడమానూరు సరిహద్దుల మీదుగా గూడవల్లి, ఉప్పులూరు, మంతెన, తరిగొప్పుల, ఉంగుటూరు, ఆముదాలపల్లి, కొయ్యగూరపాడు, పుట్టగుంట, అరిపిరాల, రామాపురం, కుదరవల్లి, ఇల్లపర్రు చివరకు ప్రవహించే బుడమేరు వెంకటలక్ష్మీ నరసింహపురం సమీపంలో కొల్లేరులో కలిసే వరకు పలు గ్రామాలను కలవరపెడుతోంది.
ఊరి చుట్టూ నీళ్లు..
పదకొండు రోజులుగా బుడమేరు మా గ్రామాన్ని జల దిగ్బంధం చేసింది. ఊరి చుట్టూ వరద నీటి ఉధృతితో రోడ్లు మునిగిపోయాయి. దాదాపు 1,500 మందికిపైగా ఊరిలోనే ఉండిపోయాం. రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకులేకుండా గడిపాం. ఇప్పుడిప్పుడే వరద దిగువకు వెళ్తుండటంతో గ్రామంలో నీళ్లు తగ్గుతున్నాయి. –జంజన వెంకటేశ్వరరావు, కొయ్యగూరపాడు గ్రామస్తుడు
ఎప్పుడూ చూడలేదు..
నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇంత వరద ఎప్పుడూ చూడలేదు. వరద చుట్టుముట్టడంతో పిల్లలు, పెద్దలు అంతా గ్రామంలోనే ఉండిపోయాం. పదకొండు రోజులుగా యువకులు వరద ప్రాంతాల్లో గస్తీ కాశారు. దాతల సహకారంతో రోజూ భోజనం సమకూర్చారు. –జుజ్జువరపు వెంకట్రావు, కొయ్యగూరపాడు
Comments
Please login to add a commentAdd a comment