
ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్లలో మాయ చేసిన ప్రభుత్వం
తప్పుల తడకగా టెండర్లు వేసిన సంస్థలకు కాంట్రాక్ట్‌లు
రూ. 1,500 కోట్ల కాంట్రాక్టులో ఆ ప్రజాప్రతినిధికి 7 శాతం కమీషన్ ఇచ్చేలా సదరు సంస్థల డీల్
అంటే ముడుపులు రూ. 105 కోట్లు
శానిటేషన్‌కు ఎంపిక చేసిన కంపెనీ కేంద్ర మాజీ మంత్రిది
సాక్షి, అమరావతి: వివిధ పనులకు కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియలో కూటమి ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అస్మదీయుడు, లేదంటే ఎక్కువ మొత్తంలో కమీషన్‌లు ఇచ్చే సంస్థలకు అడ్డగోలుగా పనులు కట్టబెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ విమర్శలను బలపరుస్తూ ఓ ప్రజా ప్రతినిధికి ఏడు శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ చేసుకున్న పలు సంస్థలు.. తప్పుల తడకగా బిడ్‌లు వేసినా ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
వైద్య శాఖలోని డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఏపీఎంఎస్‌ఐడీసీ టెండర్లు పిలిచింది. మూడేళ్ల కాలపరిమితికి దాదాపు రూ.1,500 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లు ఇవి. రాష్ట్రాన్ని మూడు జోన్‌లుగా విభజించి టెండర్లు పిలిచారు. బిడ్‌ల పరిశీలన పూర్తవడంతో ఎల్1 కంపెనీలను ఎంపిక చేయడం కోసం గురువారం వైద్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
తప్పు చేసినా అర్హత
తప్పుల తడకగా బిడ్లు దాఖలు చేసిన సంస్థలకు అర్హత కల్పించి, కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారని టెండర్లలో పాల్గొన్న వారు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకల ఆధారంగా సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు, ఇతర అవసరాల కింద ఎంత ఖర్చు చేయాలనే దానిపై టెండర్ నిబంధనల్లోనే పొందుపరిచారు. సర్వీస్ చార్జీ 3.85 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండాలని సూచించారు. ఇంత స్పష్టమైన నిబంధనలున్నా రెండు సంస్థలు సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల విషయంలో నిర్దేశించిన దాని కంటే తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేశాయి.
ఈ రెండు సంస్థల్లో ఒకటి శానిటేషన్, మరొకటి సెక్యూరిటీ టెండర్లలో పాల్గొన్నాయి. శానిటేషన్‌కు సంబంధించిన సంస్థ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రిది. మరోవైపు ప్రస్తుతం జోన్–2(కోస్తాంధ్ర)లో శానిటేషన్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న సంస్థ తప్పుడు ధ్రువపత్రాలతో బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. ఈ సంస్థ గతంలో బోధనాస్పత్రుల్లో 300 మందికి గానూ 250 మంది సిబ్బందితో పనులు నిర్వహించేలా ఎంవోయూ కుదుర్చుకుని టెండర్ నిబంధనలను అతిక్రమించింది.
తక్కువ మంది ఉద్యోగులతోనే అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం నిర్వహించి రూ.కోట్లలో ప్రభుత్వ నిధులను దండుకుంది. ఈ సంస్థ ఏపీఎంఎస్‌ఐడీసీలో పనిచేసే ఇంజినీర్ల సన్నిహితులది కావడం.. వారే టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించడంతో తిమ్మిని బమ్మిని చేసి బిడ్‌కు అర్హత కల్పించారని వెల్లడైంది. టెండర్ నిబంధనలతో పనిలేకుండా ప్రజాప్రతినిధితో సదరు సంస్థలు డీల్ కుదుర్చుకున్న క్రమంలో ఈ మూడు సంస్థలకు కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారని విశ్వసనీయ సమాచారం.
కూటమి పెద్దలు అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే 108, 104 టెండర్లను ఓ సంస్థకు కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ టెండర్లలో సైతం ఓ సంస్థను ముందే అనేసుకుని.. దానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. కేవలం ఆ సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసినా ఆమోదించేందుకు వీలుగా నిబంధనల్లో వెసులుబాటు పెట్టుకున్నారు.
బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారు?
నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసిన కంపెనీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి.. గత కొద్ది రోజులుగా ఏపీఎంఎస్‌ఐడీసీలో తిష్ట వేశారు. ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలూ ఉన్నాయి. అధికారుల వెంటపడి మరీ తన బిడ్‌కు అర్హత కల్పించుకున్నారని ఎంఎస్‌ఐడీసీలో చర్చించుకుంటున్నారు.
టెండర్ల ప్రక్రియ ముగియకుండానే తనకు కాంట్రాక్ట్ వచ్చేసిందని డీఎంఈ అధికారులను కలిసి.. బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారని ఆరా తీసినట్టు సమాచారం. సిబ్బందికి వేతనాలు ఎగ్గొట్టి, అనుభవం లేకున్నా ఉన్నట్టు కొన్ని సంస్థలు ఆధారాలు చూపించాయని, ఈ నేపథ్యంలో ఆడిట్ చేసి సక్రమంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ రాశారు.