బ్యాంకుల్లో బారులు తీరిన బాధితులు
కేవైసీ చేయించుకున్నా ఎన్‌పీసీఐ లింక్ కానందున పరిహారం పడలేదంటున్న అధికారులు
సచివాలయాల వద్ద బాధితుల ధర్నాలు
సర్కారు తీరుపై ఆగ్రహావేశాలు
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుడమేరు వరద నష్టపరిహారంపై గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమచేస్తామని ప్రకటించినప్పటికీ అలా కాకపోవడంతో వారు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. ఇస్తామన్న కొద్దిపాటి పరిహారంలోనూ కోతలు, దానికితోడు సాంకేతిక కారణాలను చూపి నిలిపివేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కేవైసీ కాలేదని.. నీ ఖాతా వాడుకలో లేదనే బ్యాంకు సిబ్బంది సమాధానాలతో వరద బాధితులకు దిక్కుతోచడంలేదు.
ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఎగ్గొట్టడానికే ఈ విధమైన ఎత్తుగడలను అనుసరిస్తోందంటున్నారు. తమకు జరిగిన అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ నగరంలోని పలు సచివాలయాల వద్ద వరద బాధితులు సోమవారం ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయానికి కూడా అనేకమంది తరలివెళ్లారు.
బ్యాంకుల్లో బారులుతీరిన బాధితులు.. నిజానికి.. వరద నష్టపరిహారాన్ని ఈనెల 30 నాటికి బాధితుల ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బాధితులు బ్యాంకులకు పోటెత్తారు. అయితే, మీ ఖాతా వాడుకలో లేదని.. కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించటంతో ఇళ్లకు వెళ్లి ఆధార్, పాన్‌కార్డుల జిరాక్స్‌లను తీసుకుని మళ్లీ వచ్చారు. ఆ తర్వాత క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ మళ్లీ ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ అంటూ మెలికపెట్టారు. ప్రభుత్వ పథకాల నగదు బ్యాంకు ఖాతాల్లో పడాలంటే ఎన్‌పీసీఐతో ఖాతాలు లింక్ అయి ఉండాలని అధికారులు చెప్పడంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. చాలా కుటుంబాల్లో నాలుగైదు ఏళ్ల క్రితం చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమకావడంతో వారేమి చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment