crop fields
-
ఎండ ముదిరి.. చేను ఎండి
సాక్షి,యాదాద్రి: వేసవి రాకముందే ఎండలు ముదిరిపోయా యి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నాన్‌ఆయకట్టు ప్రాంతంలో ఎక్కువ శాతం బోర్లు, బావుల కింద వరి సాగు చేశారు. దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. సరిగ్గా నీరందక వరి చేలు ఎండుముఖం పడుతున్నాయి. పొట్టదశలో ఉన్న పైరు ఎండిపోతుండగా రైతులు పశువులను మేపుతున్నారు. ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట ఎండిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే...వేలాది ఎకరాలకు పంటనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. దిగుబడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. జనవరి నాటికి జిల్లాలో భూగర్భ జలాలు రెండున్నర మీటర్ల లోతుకు పడిపోయాయి. యాసంగి ఆశలపై దెబ్బ వానాకాలం సీజన్లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లాయి. జలకళ సంతరించుకోగా, రైతులు యాసంగి వరిసాగుపై ఆశలు పెంచుకున్నారు. ఫిబ్రవరి మొదటివారం నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, వలిగొండ మండలాల్లోని ఎగువ ప్రాంతాల్లో నీటిగండం వచ్చిపడింది. పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు బోరు బావుల్లో పూడికతీత పనులు చేపట్టారు. మరికొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు ఎకరాల వరి బీటలు వారింది నాకున్న ఐదెకరాల్లో వరిసాగు చేశాను. బావి నీటిమట్టం తగ్గడంతో రెండు ఎకరాల వరిపొలం బీటలు వారింది. ఉన్న మూడు ఎకరాలకు రెండు రోజులకో తడి ఇస్తున్నాను. దానిపై కూడా ఆశ లేదు. – వడకాల రాజు, వరి రైతు, మోత్కూర్.నీరు లేక పంట ఎండిపోయింది 3 ఎకరాల్లో వరి వేశా. నాట్ల సమయంలో బావి లో నీరు బాగానే ఉంది. వరి పొట్టకు వచ్చే దశలో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. వారం క్రితం రెండు బోర్లు వేశాను. రెండూ ఫెయిల్ అయ్యాయి. నీరులేక పంట ఎండిపోయింది –చౌడబోయిన కనకయ్య, శ్రీనివాసపురం గ్రామం -
పెద్దపులి కనిపిం‘చేను’!
నల్లబెల్లి/మన్ననూర్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్, మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం, కొండాయిల్‌పల్లి గ్రామాల శివారులో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతాలను వదిలి గ్రామాల సమీపంలోని పంటచేలల్లో పెద్దపులి సంచరించడంతో.. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. కొండాపూర్ అటవీ ప్రాంతం నుంచి ఆడపులి, పిల్ల పులి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కోనాపురం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కొండాపూర్ అటవీ ప్రాంతం నుంచి మగ పెద్దపులి మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి గ్రామాల మీదుగా రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామాల మధ్యలోని పలుగుఏనె (గుబురు చెట్లతో కూడుకున్న అటవీ ప్రాంతం) వరకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం గ్రామాల్లో శనివారం తిరుగు ప్రయాణంలో పెద్దపులి సంచరించినట్లు పలువురు చెబుతున్నారు. కాగా పోలీసులు, అటవీ శాఖ, స్ట్రైక్‌ఫోర్స్ అధికారులు పంట చేలలో పులి కదలికలను పరిశీలించి పాదముద్రలను సేకరించారు. మొక్కజొన్న చేనులో సేదదీరిన ప్రాంతాన్ని గుర్తించారు. అవన్నీ పెద్దపులి పాదముద్రలేనని, తిరిగి వెళ్లలేదని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సఫారీలో పెద్దపులి సందడి అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం సఫారీ వాహన సందర్శకులకు శనివారం ఉదయం పెద్ద పులి కనిపించింది. ఫర్హాబాద్ సఫారీ పాయింట్ నుంచి వ్యూ పాయింట్‌కు సందర్శకులు వాహనంలో వెళ్తుండగా.. మార్గమధ్యలో పెద్దపులి అటవీశాఖ ఇంటర్నల్ రోడ్డు దాటుతూ కనిపించింది. అకస్మాత్తుగా చెట్ల మధ్యనుంచి వాహనం సమీపంలోకి పెద్దపులి రావడంతో సందర్శకులు కొంత భయపడినా.. దగ్గరి నుంచి చూశామని సంతోషపడ్డారు. -
ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతకు అపర నష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు పోటెత్తాయి. ప్రభుత్వ నిర్వాకంతో బుడమేరు, ఏలేరు, కొల్లేరు సైతం విరుచుకు పడ్డాయి. పంట పొలాలను ముంచెత్తాయి. ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో మరో 15 రోజుల్లో చేతికందాల్సిన పంట వరదపాలైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 19 జిల్లాల్లో 5.93లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 18 రకాల ఆహార, వాణిజ్య పంటలు 5.42లక్షల ఎకరాల్లో, మరో 51వేల ఎకరాల్లో 21 రకాల ఉద్యాన పంటలు పాడైపోయాయి. మొత్తం 3.08 లక్షల మంది రైతులు నష్టపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం జరిగింది.వరి రైతుల పరిస్థితి దారుణం» వరి పంట 4.29లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నది. మరో 15 నుంచి 20 రోజుల్లో కోతకు వచ్చే దశలో ఉన్న పంట పది రోజులకు పైగా వరద నీటిలో నానడంతో పూర్తిగా కుళ్లిపోయింది. » ప్రాథమికంగా 6 లక్షల టన్నుల ఆహార, వాణిజ్య, ఉద్యాన ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అత్యధికంగా 5,07,807 టన్నుల ధాన్యం ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.» వరి రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30 వేలు వరకు పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన ఒక్క వరి రైతులే రూ.1,200 కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోగా, ఉత్పత్తి రూపంలో మరో రూ.1,168 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేశారు.» ఆ తర్వాత 58వేల ఎకరాల్లో పత్తి, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.» ఉద్యాన పంటల్లో అత్యధికంగా 15వేల ఎకరాల్లో మిరప, 10వేల ఎకరాల్లో అరటి, మరో 10వేల ఎకరాల్లో పసుపు, 6వేల ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మరో 150 ఎకరాల్లో మల్బరీ తోటలు, మరికొన్ని ఇతర పంటలు పాడైపోయాయి.» ఇప్పటికే ఎకరా మిరపకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు, కందకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు, పసుపునకు రూ.లక్ష, అరటికి రూ.75వేలు, తమలపాకులకు రూ.2లక్షలు, మొక్కజొన్నకు రూ.30వేలు, అరటికి 50వేలు, ఉల్లికి రూ.40వేలు, పత్తికి రూ.25వేలు, అపరాలకు రూ.15వేలు చొప్పున పెట్టుబడులు పెట్టారు. » ఆహార, వాణిజ్య పంటలకు రూ.358.91 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.42.34 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.2.68 కోట్లు కలిపి మొత్తం 3.08లక్షల మంది రైతులకు రూ.403.93 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని ప్రాథమికంగా అధికారులు లెక్కతేల్చారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఇది మరింత కోత పెట్టే అవకాశాలు ఉన్నాయి.కౌలురైతులకు తీవ్ర నష్టంపంట నష్టం అంచనాలకు నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండటం... సాగుదారుల పేర్ల నమోదుకు భూ యజమానులు అభ్యంతరం వ్యక్తంచేస్తుండటంతో ఎన్యుమరేషన్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. చాలా జిల్లాల్లో వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా భూ యజమానుల పేరిట పంట నష్టం వివరాలు నమోదు చేస్తున్నారు. ఫలితంగా కౌలుదారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.20వేలు ఇస్తానని..వరి రైతులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల పరిహారంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని భారీగా పెంచి ఇచ్చినప్పటికీ ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు లేనిపోని విమర్శలు చేశారని, తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.20వేలు పరిహారం ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.10వేలకు సరిపెట్టడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బృందానికి మస్కా..ఆగస్టు 30, 31 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని 28న ఐఎండీ హెచ్చరికకానీ ఆగస్టు 30న ఐఎండీ, సీడబ్ల్యూసీ హెచ్చరించినట్లు అబద్ధం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి ప్రభుత్వం మస్కా కొట్టింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏపీలో ఆగస్టు 30, 31 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు 28వ తేదీన ఐఎండీ హెచ్చరించింది. కానీ, ఆ హెచ్చరికలు ఆగస్టు 30న వచ్చినట్లు కేంద్ర బృందానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.అదే రోజున అన్ని జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ శాఖ అప్రమత్తం చేసి, వరదల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని దిశానిర్దేశం చేసిందని పేర్కొంది. ఈ మేరకు వరద సహాయక చర్యలను సమర్థంగా చేపట్టడానికి ఆగస్టు 31న అధికారులతో ఓ కమిటీ వేశామని వివరించింది. కాగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చరిస్తే... ఇందుకు విరుద్ధంగా 30న హెచ్చరించిందంటూ కేంద్ర బృందాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందనే చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది.ఇంకా 34వేల ఎకరాల్లోనే పంట నష్టం నమోదుతొలుత ఈ నెల 10వ తేదీలోపు పంట నష్టం అంచనాలు పూర్తిచేసి 11 నుంచి 16 వరకు సామాజిక తనిఖీల్లో భాగంగా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని, అభ్యంతరాల పరిష్కారం అనంతరం 20న తుది జాబితాలను ప్రదర్శించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ, ఎక్కడా సరిగా పంట నష్టం నమోదు జరగలేదు. దీంతో నష్టం అంచనాల నమోదుకు 18వ తేదీ వరకు గడువు పొడిగించారు. ప్రాథమికంగా 5.93 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. ఇప్పటి వరకు 34వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగలిగారు. తొలుత ఈ–క్రాప్ నమోదును ప్రామాణికంగా పేర్కొన్నారు. వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో 50 శాతం కూడా ఈ–పంట నమోదు పూర్తి కాలేదు. దీంతో ఈ నిబంధనను మినహాయించారు. ఎన్యుమరేషన్లో వాస్తవ సాగుదారుల వివరాలను నమోదు చేసినప్పటికీ సమాంతరంగా ఈ–క్రాప్‌లో కూడా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ–క్రాప్ నమోదు, ఎన్యుమరేషన్ ఒకేసారి చేపట్టాల్సి రావడంతో అంతా గందరగోళంగా మారింది. నష్టం వివరాల్లో సాగుదారుల పేర్లను నమోదు చేస్తుంటే భూ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.గాడిలో పడని ఈ–క్రాప్.. ఆందోళనలో రైతులువైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ నమోదు ఏటా ఖరీఫ్‌లో జూలై మొదటి వారంలో శ్రీకారం చుట్టి సెప్టెంబర్ 15 కల్లా పూర్తిచేసేవారు. సోషల్ ఆడిట్ అనంతరం అక్టోబర్ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్‌కు సంబంధించి నవంబర్ మొదటి వారంలో మొదలు పెట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. కానీ ఈసారి సీజన్ ప్రారంభమై 45 రోజులైనా పూర్తి స్థాయిలో ఈ–క్రాప్ గాడిలో పడలేదు. ఫలితంగా ప్రభుత్వ పథకాలకు అందకుండా పోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. గత∙ఐదేళ్లలో గత సీజన్లో నమోదైన ఈ–క్రాప్ డేటా ప్రామాణికంగానే రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ చేసేవారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, గడువులోగా పంట నష్ట పరిహారం, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రాయితీ అందించేవారు. ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఈ–క్రాప్ ప్రామాణికంగానే కొనుగోలు చేసేవారు. ఇలా సగటున ఏటా 1.65 కోట్ల ఎకరాలు చొప్పున ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్లు అందించారు. ఐదేళ్లలో 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, ఐదేళ్లలో 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. ఐదేళ్లలో 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. -
బెజవాడలో శాంతించి పల్లెలపై ప్రతాపం
(బుడమేరు పరీవాహక ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) : ‘బుడమేరు వరద ఉధృతి దిగువ ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చింది. గ్రామాలకు ఆనుకుని ఉన్న పొలాలన్నీ మునిగిపోయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. మన పక్క ఊరిలో మెయిన్ రోడ్డుపైకి నీరు వచ్చేసింది. మన ఊరికి అటూ ఇటూ కూడా రోడ్డు మునిగిపోయింది. చుట్టూ నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏ క్షణమైనా మన గ్రామాన్ని వరద నీరు ముంచెత్తవచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండాలి..! ’’ బుడమేరు పరీవాహక గ్రామాల్లో పదకొండు రోజులుగా ఇలా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడు వరద విరుచుకుపడుతుందోననే భయంతో నిరంతరం కాపలా కాస్తున్నారు. బుడమేరు వరద ఉధృతితో గ్రామాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. వరదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో బెజవాడను ముంచెత్తిన బుడమేరు క్రమంగా శాంతిస్తున్నప్పటికీ పరీవాహక గ్రామాలను మాత్రం బేజారెత్తిస్తోంది. ఖమ్మం–కృష్ణా జిల్లాల నడుమ కొండల్లో మొదలయ్యే బుడమేరు వరద నీరంతా విజయవాడ నుంచి దిగువకు ప్రవహించి కొల్లేరులో కలిసే వరకు అనేక గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో పలు గ్రామాలు పదకొండు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రధాన రహదారులపైకి బుడమేరు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. పదుల సంఖ్యలో గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.ఉంగుటూరు మండలం తేలప్రోలు నుంచి గుడివాడ మండలం నందమూరు వెళ్లే ప్రధాన రహదారిపై బుడమేరు వరద నీటి ఉధృతి పదకొండు రోజులుగా తగ్గకపోవడంతో అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంచె వేసి పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం రాత్రి పగలు గస్తీ కాస్తున్నారు. దీనివల్ల 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అటువైపు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి వచ్చేందుకు అవస్థ పడుతున్నారు. గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారిపై కొయ్యగూరపాడు రోడ్డు ఇరువైపులా మునిగిపోయింది. దీంతో గన్నవరం, నందివాడ మండలాల్లోని పది గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ శివారు ఎనికేపాడు నుంచి దోనేటుకూరు, నిడమానూరు సరిహద్దుల మీదుగా గూడవల్లి, ఉప్పులూరు, మంతెన, తరిగొప్పుల, ఉంగుటూరు, ఆముదాలపల్లి, కొయ్యగూరపాడు, పుట్టగుంట, అరిపిరాల, రామాపురం, కుదరవల్లి, ఇల్లపర్రు చివరకు ప్రవహించే బుడమేరు వెంకటలక్ష్మీ నరసింహపురం సమీపంలో కొల్లేరులో కలిసే వరకు పలు గ్రామాలను కలవరపెడుతోంది. ఊరి చుట్టూ నీళ్లు.. పదకొండు రోజులుగా బుడమేరు మా గ్రామాన్ని జల దిగ్బంధం చేసింది. ఊరి చుట్టూ వరద నీటి ఉధృతితో రోడ్లు మునిగిపోయాయి. దాదాపు 1,500 మందికిపైగా ఊరిలోనే ఉండిపోయాం. రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకులేకుండా గడిపాం. ఇప్పుడిప్పుడే వరద దిగువకు వెళ్తుండటంతో గ్రామంలో నీళ్లు తగ్గుతున్నాయి. –జంజన వెంకటేశ్వరరావు, కొయ్యగూరపాడు గ్రామస్తుడుఎప్పుడూ చూడలేదు.. నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇంత వరద ఎప్పుడూ చూడలేదు. వరద చుట్టుముట్టడంతో పిల్లలు, పెద్దలు అంతా గ్రామంలోనే ఉండిపోయాం. పదకొండు రోజులుగా యువకులు వరద ప్రాంతాల్లో గస్తీ కాశారు. దాతల సహకారంతో రోజూ భోజనం సమకూర్చారు. –జుజ్జువరపు వెంకట్రావు, కొయ్యగూరపాడు -
భూమి రాళ్లపాలు బతుకు రోడ్డుపాలు!
తిరుమలాయపాలెం: అకస్మాత్తు వరదలతో ఇళ్లు నీట మునిగి, సామగ్రి అంతా కోల్పోవడమే కాదు.. జీవనాధారమైన పంట పొలాలనూ కోల్పోయిన దుస్థితి నెలకొంది. పచ్చని పంటలతో కళకళలాడే భూములను ఆకేరు వరద రాత్రికి రాత్రే బీడు భూములుగా మార్చేసింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదను చూసి కట్టుబట్టలతో పరుగెత్తిన గిరిజనులు.. వరద తగ్గాక వచ్చి చూసేసరికి ఇళ్లు, సామగ్రి అంతా నాశనమయ్యాయి. దాన్ని ఏదోలా దిగమింగుకుని పొలాల వద్దకు వెళ్లి చూసిన రైతులు.. అక్కడంతా రాళ్లురప్పలు, ఇసుక మేటలే కనిపించడంతో ఆవేదనతో కన్నీట మునిగిపోయారు. అసలు ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియనంతగా మారిపోవడాన్ని తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. రాకాసి తండాను తుడిచిపెట్టిన ఆకేరు 70 కుటుంబాలు ఉన్న రాకాసితండాకు పక్కనే ఆకేరు ప్రవహిస్తుంది. సాగునీరు అందుబాటులో ఉండటంతో.. ఇక్కడి గిరిజన రైతులు మిర్చి, పత్తి, వరి పండిస్తారు. కానీ మునుపెన్నడూ లేనంతగా ఆకేరు పోటెత్తడంతో వరద గ్రామాన్ని చుట్టుముట్టింది. గిరిజనులంతా ఎక్కడికక్కడ వదిలేసి సమీపంలోని గుట్టలపైకి చేరుకున్నారు. ఆ వరద కొద్ది గంటల్లోనే చాలా ఇళ్లను నేలమట్టం చేసింది. ధాన్యం, బియ్యం, నిత్యావసరాలు, ఇతర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. పొలాలన్నీ మాయం.. సారవంతమైన ఆకేరు పరీవాహక గ్రామాల్లోని వ్యవసాయ భూములు వరదతో ఆనవాళ్లు కోల్పోయాయి. తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేట, రావిచెట్టుతండా, తూర్పుతండా, అజీ్మరాతండా, రాకాసితండా, బీసురాజుపల్లితండా, రమణా తండాల పరిధిలో వెయ్యి ఎకరాలకుపైగా భూములు నామరూపాల్లేకుండా రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయి. సాగునీటి బోర్లు, మోటార్లు, పైపులు కూడా జాడ లేకుండా పోయాయి. మరోవైపు బీరోలు, బంధంపల్లి చెరువులకు గండ్లు పడి.. దిగువన ఉన్న పంట భూముల్లో ఇసుక మేటలు వేసింది. ఈ భూములను తిరిగి సాగుయోగ్యంగా మార్చాలంటే.. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తామంటున్న అరకొర సాయం ఎలా కాపాడుతుందని ప్రశి్నస్తున్నారు.పచ్చని పొలంలో.. ఇసుక, రాళ్ల మేటలుఇయన పేరు పోతుగంటి సహదేవ్. తిరుమలాయపాలెం మండలం రాకాసితండాకు చెందిన ఈయన నాలుగున్నర ఎకరాల్లో వరిసాగు చేశారు. నెల రోజుల క్రితమే నాట్లు వేయగా.. ఇటీవలే కలుపు తీసి ఎరువులు వేశాడు. కానీ ఆకేరు వరదతో కళ్లముందే పొలం నామరూపాలు లేకుండా పోయింది. అంతా ఇసుక, రాళ్ల మేటలు వేసింది. అదంతా తొలగించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని సహదేవ్ వాపోతున్నారు. భార్య పుస్తెలతాడు కుదువ పెట్టిన డబ్బులతో పంటకు పెట్టుబడి పెట్టానని.. ఆ పంటా పోయి, ఇప్పట్లో పంటలు పండించే పరిస్థితీ లేక.. ఎలా బతకాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇకపై బతికేదెట్లా? అజ్మీరా తండాకు చెందిన బోడ దాసు ఐదెకరాల్లో వరిసాగు చేశాడు. సాగు నీటికి ఇబ్బంది లేకపోవడంతో ముందుగానే నాట్లు వేశాడు. పచ్చగా కళకళలాడుతున్న వరి పంట ఒక్కరోజులోనే తుడిచి పెట్టుకుపోయింది. పొలంలో ఇసుక మేటలు వేసింది. ఆయన భార్య మరణించగా.. కుమారుడు శోభన్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు, దివ్యాంగురాలైన కుమార్తెకు వివాహం చేశాడు. ఇప్పుడు పొలం దెబ్బతినడంతో ఇకపై బతికేదెట్లాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.రాళ్ల కుప్పలు కాదు.. వరి పొలమే! ఈ చిత్రంలో కుప్పలుకుప్పలుగా రాళ్లతో నిండి కనిపిస్తున్నది వ్యవసాయ భూమే! ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వద్ద ఆకేరు వాగు వరద ఉధృతికి.. పొలంలో సారమంతా కొట్టుకుపోయి ఇలా రాళ్లు, రప్పలు మిగిలాయి. ఇకపై ఎలాంటి పంటలూ పండించలేకుండా తయారైంది. -
పంట పొలాల్లో కూలిన భారీ బెలూన్.. 1,050 కిలోల బరువు
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఆకాశం నుంచి ఓ భారీ బెలూన్‌కు సంబంధించిన యంత్రం కూలడం కలకలం సృష్టించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బెలూన్ యంత్రాన్ని పరిశీలించారు. దానిని హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)కు చెందిన బెలూన్‌గా గుర్తించారు. బెలూన్ యంత్రం తర్నికల్ సమీపంలోని పొలాల్లో పడిపోగా.. జిల్లాలోని ఊర్కొండ మండలం శివారులోని బండారు బాలయ్యకు చెందిన మామిడితోటలో తెలుపు రంగు భారీ బెలూన్ పడిపోయింది. దీని మొత్తం బరువు సుమారు 1,050 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ఆకాశం నుంచి యంత్రం తమ దగ్గరలో వచ్చి పడిపోవడంతో భయం వేసిందని, కాసేపటి వరకు ఏమీ అర్థం కాలేదని రాజిరెడ్డి అనే రైతు చెప్పారు. టీఐఎఫ్‌ఆర్‌కు చెందిన హరినాయక్ నేతృత్వంలోని బృందం బెలూన్, యంత్ర పరికరాలను హైదరాబాద్‌కు తరలించింది. ఖగోళ, వాతావరణ పరిశోధన కోసమే.. అంతరిక్ష పరిశోధనలతోపాటు భూ ఉపరితలంపై వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని తమ బెలూన్ ఫెసిలిటీ సెంటర్ నుంచి ఈ నెల 17న ప్లాస్టిక్ రీసెర్చ్ బెలూన్ను ఆకాశంలోకి పంపించామని టీఐఎఫ్‌ఆర్‌కు చెందిన సైంటిఫిక్ ఆఫీసర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. 176 మీటర్ల పొడవు ఉండే ఈ బెలూన్ పేలిపోయే ప్రమాదం లేదని, జనసమ్మర్ధం లేనిచోట నెమ్మదిగా ల్యాండ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. చదవండి: తలసరి ‘విద్యుత్’లో 5వ స్థానం -
పంటపొలం.. ఎరువులమయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటపొలం ఎరువులమయంగా మారింది. మితిమీరిన ఎరువుల వాడకం వల్ల నేల భూసారం కోల్పోతోంది. పంటలకు పనికి రాకుండాపోయే ప్రమాదకరస్థితి ఏర్పడుతోంది. పంటపొలంలో సాధారణంగా ఉండాల్సిన గాఢత గాడితప్పింది. చీడపీడల నివారణ, పంట దిగుబడులను పెంచే క్రమంలో ప్రారంభమైన ఎరువుల వినియోగం ఇప్పుడు ప్రతిపంట సాగులోనూ తప్పనిసరైపోయింది. దీనికితోడు రసాయన మందులు సైతం వినియోగిస్తుండటంతో ఒకవైపు రైతుకు సాగుభారం తడిసి మోపెడవుతుండగా, మరోవైపు పోషకవిలువలతో ఉండాల్సిన దిగుబడులు రసాయనాలతో కలుషితమవుతున్నాయి. ఫలితంగా మానవాళి ఆరోగ్యంపై అనేక రకాల దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. 2021–22 వార్షిక వ్యవసాయ నివేదిక ప్రకారం దేశంలో సగటున హెక్టారు పంటకు 127.87 కిలోగ్రాముల ఎరువులను వినియోగిస్తున్నారు. ఇందులో 83.42 కిలోల నత్రజని, 33.6 కిలోల ఫాస్ఫరస్, 10.85 కిలోల పొటాషియాన్ని వినియోగిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పలు రాష్ట్రాలు జాతీయ సగటును మించి ఎరువులను వినియోగిస్తున్నాయి. అత్యధికంగా ఎరువులు వాడుతున్న రాష్ట్రాల జాబితాలో వరుసగా పుదుచ్చేరి, పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. తెలంగాణలో ఒక హెక్టారుకు సగటున 206.69 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు 199.67 కిలోల ఎరువులను వాడుతున్నారు. సారమంతా ఎరువులమయం... ఎరువుల వినియోగం పెరగడంతో భూసారం ఆందోళనకరంగా మారుతోంది. పంటమార్పిడి విధానంతో సహజసిద్ధమైన సాగువిధానాలను అనుసరించాల్సిన రైతులు ఎరువులు, పురుగుమందులపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో దిగుబడుల సంగతి అటుంచితే నేల సహజస్థితిని కోల్పోయి చివరకు ఉప్పు నేలగా మారిపోతోందంటూ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలవారీగా ఎరువుల వినియోగాన్ని ఉటంకిస్తూ వినియోగాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలంటూ పలు సూచనలు చేశారు. అధిక వినియోగంతో అనర్థాలే... సాధారణంగా ఎరువుల వినియోగం 4:2:1 నిష్పత్రితలో ఉంటే పరవాలేదు. దేశంలో ఎరువుల వినియోగం 7:2.3:1.5 నిష్పత్తికి చేరింది. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఈ నిష్పత్తిలో వత్యాసాలు కనిపిస్తున్నాయి. మితిమీరిన ఎరువుల వినియోగంతో భవిష్యత్తులో సాగువిధానం తీవ్ర సంకటస్థితిని ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఎరువుల వినియోగం మితిమీరితే భూసారం దెబ్బతింటుంది. భూమిలోని వాస్తవ పోషకాలు గల్లంతై ఉప్పునేలగా మారుతుంది. దీంతో సేంద్రియ పదార్థం, హ్యూమస్, ప్రయోజనకరమైన జాతులు, మొక్కల పెరుగుదల కుంటుపడతాయి. తెగుళ్ల పెరుగుదలతోపాటు గ్రీన్హౌస్ వాయువుల విడుదలకు దారితీస్తుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. -
Bapatla: వరి నాట్లు వేసిన కలెక్టర్లు
బాపట్ల: అది బాపట్ల జిల్లాలోని మురుకొండపాడు గ్రామం. శివారున జలయజ్ఞంలో తడిసిన పంట పొలం. మరో వైపు ఆకాశాన భగభగ మండుతున్న భానుడు.. ఇంతలో ఓ కూలీల బృందం ఆ పంట చేలో వడివడిగా అడుగులు వేసింది. అప్పటికే పరిచి ఉన్న వరి మొక్కలను చేత పట్టారు ఆ కూలీలు. ఎరట్రి ఎండలో నేలమ్మ ఒడిలో మట్టి గంధంలో తడిసిన ఆ కూలీలే కలెక్టర్ దంపతులు. ఒకరు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మరొకరు బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ఆదివారం మురుకొండపాడు వరి చేలోకి వీరు తమ కుటుంబంతో సహా వచ్చి వరినాట్లు వేశారు. గంటకు పైగా వరి మొక్కలు నాటారు. అక్కడికే క్యారేజీలు తెప్పించుకొని గట్టుపై కూర్చుని భోజనం చేశారు. -
పంట పొలాల్లో సంక్రాంతి వేడుక
బిచ్కుంద (జుక్కల్): సంక్రాంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలోని 4 మండలాల్లోని రైతులు శుక్రవారం పంట చేలలో ధాన్యలక్ష్మిని ప్రతిష్టించి మొక్కులు తీర్చుకున్నారు. మహారాష్ట్రలో ఉన్న ఈ సంప్రదాయాన్ని ఆ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలాల్లో రైతులు పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం సంక్రాంతి రోజున రైతులు ఉదయాన్నే కుటుంబ సమేతంగా ఎడ్లబండి, వాహనాల్లో పంట చేలకు వెళ్తారు. దేవత ముందు వెలిగించిన దీపాన్ని ఇంటికి తీసుకెళ్తున్న మహిళలు పంటచేలలో లక్ష్మీ దేవతను ప్రతిష్టించి పూజిస్తారు. వ్యవసాయరంగంతో ముడిపడి ఉన్న పశువులనూ కొలుస్తారు. 5 రకాల కూరగాయలతో వంటలు, భక్షాలు చేసి నైవేద్యంగా పెట్టి దీపం వెలిగిస్తారు. బంధుమిత్రులతో పంట చేలలో వనభోజనాలు చేస్తారు. దేవత ముందు వెలిగించిన దీపం ఆరిపోకుండా సాయంత్రం గంపలో పెట్టి ఇంటికి తీసుకొచ్చి ఆ దీపంతో ఇంట్లో దీపాలు వెలిగించి పాడిపంటలు పుష్కలంగా పండాలని వేడుకుంటారు. -
మార్గం సుగమం: పంట పొలాల్లో సోలార్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రైతులు సొంతంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని, విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)కు అమ్ముకునేందుకు మార్గం సుగమమైంది. ‘ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్తన్ మహాభియాన్ (పీఎంకుసుమ్)’పథకం కింద రైతులు ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్ల నుంచి డిస్కంలు కొనుగోలు చేయాల్సిన విద్యుత్ ధర యూనిట్‌కు రూ.3.13గా ఖరారైంది. దీనిపై గతంలోనే జారీ చేసిన టారిఫ్ ఆర్డర్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) మళ్లీ ఫైనల్ చేసింది. ఈ పథకం కింద పంజాబ్‌లో యూనిట్‌కు రూ.2.74, మధ్యప్రదేశ్‌లో రూ.3.07, జార్ఖండ్‌లో రూ.3.05 టారిఫ్ నిర్ధారించారని.. మన రాష్ట్రంలో ఎక్కువగా నిర్ణయించినందున తగ్గించాలని డిస్కంలు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిం ది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల ఆధ్వర్యంలో.. పీఎం కుసుమ్ పథకం కింద రైతులు, రైతుల గ్రూపులు, సహకార సంఘాలు, పంచాయతీలు, రైతుల ఉత్పాదక సంస్థ (ఎఫ్‌పీఓ)లు, నీటి వినియోగ సంఘాలవారు ఎవరైనా 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం ఉండే సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్లాంట్ల నిర్మాణానికి సగటున ఒక్కో మెగావాట్‌కు రూ.3.60 కోట్ల వ్యయం అవుతుంది. కనీసం 30శాతం పెట్టుబడి పెట్టగలిగితే.. బ్యాంకుల నుంచి మిగతా 70% వరకు రుణం లభించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పంపుసెట్లన్నింటినీ సౌర విద్యుత్‌తో నడపాలన్న లక్ష్యంతో.. పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు, సోలార్ వాటర్ పంపుల ఏర్పాటు దిశగా కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ 2019లో పీఎం కుసుమ్ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణకు లక్ష్యం 500 మెగావాట్లు పీఎం కుసుమ్ కింద 2020–21లో దక్షిణ డిస్కం (టీఎస్ఎస్పీడీసీఎల్) 300 మెగావాట్లు, ఉత్తర డిస్కం (టీఎస్ఎన్పీడీసీఎల్) 200 మెగావాట్లు కలిపి మొత్తం 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను రైతులతో ఏర్పాటు చేయించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. ట్రాన్స్మిషన్ నష్టాలు, సబ్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా.. 33/11 కేవీ సబ్స్టేషన్లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో వీటిని నిర్మించాలి. ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ను తీసుకుని గ్రిడ్‌కు సరఫరా చేయడానికి అవకాశమున్న సబ్స్టేషన్లు, అక్కడ అందుబాటులో ఉన్న సర్ప్లస్ సామర్థ్యం వివరాలను డిస్కంలు తమ వెబ్సైట్లో ప్రకటించాలి. ఆయా చోట్ల రైతుల నుంచి సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వా నించాలి. రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటు కోసం రివర్స్ బిడ్డింగ్ లేదా క్లోజ్డ్ బిడ్డింగ్ విధానంలో బిడ్లను డిస్కంలు ఆహ్వానించే అవకాశం ఉంది. తక్కువ ధరను సూచించిన బిడ్లను ఎంపిక చేసి విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకుంటారు. ఈ పీపీఏ కాల వ్యవధి 25 ఏళ్లుగా ఉంటుంది. డిస్కంలకు ప్రోత్సాహకాలు పీఎం కుసుమ్ కింద ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల నుంచి కొనే ప్రతి యూనిట్ (కేడబ్ల్యూహెచ్) విద్యుత్‌కు 40 పైసల చొప్పునగానీ.. లేదా మెగావాట్‌కు ఏడాదికి రూ.6.6 లక్షల చొప్పునగానీ.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని ప్రోత్సాహకంగా డిస్కంలకు చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. ప్లాంట్ నుంచి వాణిజ్యపర ఉత్పత్తి (సీఓడీ) ప్రారంభమైన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఈ ప్రోత్సాహకం అందుతుంది. మొత్తంగా ఐదేళ్లలో ఒక్కో మెగావాట్‌కు రూ.33 లక్షల చొప్పున డిస్కంలకు ప్రోత్సాహకాలు రానున్నాయి. కాలుష్య నివారణలో భాగంగా డిస్కంలు తప్పనిసరిగా నిర్దేశిత పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని, లేకుంటే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. పీఎం కుసుమ్ కింద కొనే విద్యుత్‌ను ఈ కేటగిరీ కింద పరిగణించనుంది. డెవలపర్లతో ఏర్పాటు చేయించుకోవచ్చు.. రైతులు, ఇతర లబ్ధిదారులు స్వయంగా పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉంటే.. వారు డెవలపర్లతో ప్లాంట్లను ఏర్పాటు చేయించుకోవచ్చు. అయితే ప్లాంట్ల ఏర్పాటు కోసం డెవలపర్లకు తమ స్థలాలను అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. ►భూమికి ఏడాది లెక్కన అద్దెను గానీ.. లేదా ఏడాదిలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో యూనిట్‌కు కొంత మొత్తం చొప్పున డబ్బులనుగానీ అద్దెగా తీసుకోవచ్చు. ►ఈ అద్దె డబ్బులను నేరుగా ►డిస్కంల నుంచే తమ బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా కోరవచ్చు. ►ఇలా తమ భూములను అద్దెకు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతుల జాబితాను డిస్కంలు తమ వెబ్సైట్లో పొందుపర్చనున్నాయి. ►ప్లాంట్ ఏర్పాటు చేసే లబ్ధిదారులు/ ►డెవలపర్లే ప్లాంట్ నుంచి సబ్‌స్టేషన్ వరకు 11 కేవీ లైన్ వేయాల్సి ఉండనుంది. ►సాగులో లేని బీడు భూముల్లోనే ►ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. -
పంట చేలకు కోతుల బెడదా? ఇలా చేయండి
సాక్షి, గంభీరావుపేట(సిరిసిల్ల): పొట్టదశకొచ్చిన వరి చేలను కోతులు పీల్చి పడేస్తున్నాయి. పొలం గట్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ వరి కంకులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా మళ్లీ మళ్లీ వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన రాజబోయిన ఆంజనేయులు అనే యువ రైతు తన పొలంలో కొండెంగ బొమ్మను కాపలా పెట్టాడు. కొండెంగగా భావిస్తున్న కోతులు భయంతో అటు వైపు రావడం మానేశాయి. ఆంజనేయులు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. తమ పొలంలోనూ అలాగే ఏర్పాటు చేసుకుంటామంటున్నారు. చదవండి: ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్వేర్ యువ జంట -
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొన్నిచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకలు, చెక్ డ్యాంలు పొంగిప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ► బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. పి.గన్నవరం మండలంలో అత్యధికంగా 17.42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. ► అనంతపురం జిల్లాలో కురిసిన వర్షానికి 61 మండలాల పరిధిలో 2.82 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. ► వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో 3.72 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలోని 57 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో అక్కడక్కడా వర్షం పడింది. గుంటూరు జిల్లాలో చిరు జల్లులు కురిశాయి. నీటమునిగిన పంట పొలాలు విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో సుమారు 100 ఎకరాల్లో వరి పూర్తిగా నీటమునిగింది. వైఎస్సార్ జిల్లాలో 412 హెక్టార్లలో వరి, వేరుశనగ, పత్తి, సజ్జ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. అనంతలో వందల హెక్టార్లలో దెబ్బతిన్నట్లు నివేదిక తయారు చేశారు. కర్నూలు జిల్లాలో పలుచోట్ల మొక్కజొన్న, వరి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పు గోదావరిలోనూ వాగు వెంబడి ఉన్న పంట పొలాలన్నీ నీట మునిగాయి. పిడుగు పడి ఇద్దరు కూలీల దుర్మరణం.. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో పిడుగు పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ప్రహరీ కూలి 75 గొర్రెలు, 3 మేకలు, 20 గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. -
ఆయకట్టంతా తడిచేలా
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపి రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు ప్రాజెక్టు ఇప్పటికే నిండింది. బ్రహ్మం సాగర్‌తోపాటు ఎస్సార్1, ఎస్సార్2, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గాలేరునగరిలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. అవుకు, గండికోట, మైలవరం, పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయ సాగర్, సీబీఆర్(చిత్రావతిబ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లలోకి వరద ప్రవాహం చేరుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ నిండాలంటే మరో 130 టీఎంసీలు అవసరం. ►సాధారణంగా సెప్టెంబరులో కృష్ణా, పెన్నా, కుందూ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. గతేడాదిమాదిరిగా ఈసారి కూడా వీటికి వరద వస్తుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులన్నీనిండే అవకాశాలుండటం రైతుల్లో ఆనందాలను నింపుతోంది. ►కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఇప్పటికే నిండిపోయాయి. పులిచింతలలో వరుసగా రెండో ఏడాదీ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ►శ్రీశైలంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, గాలేరునగరి, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ)లకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేస్తున్నారు. ►తెలుగగంగలో భాగమైన వెలిగోడు ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేశారు. ఎస్సార్–1లో 2.13 టీఎంసీలకుగానూ 1.41, ఎస్సార్–2లో 2.44 టీఎంసీలకుగానూ 1.65 టీఎంసీలు చేరాయి. బ్రహ్మంసాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.36 టీఎంసీలకు చేరుకుంది. ►గోరకల్లు పూర్తి నిల్వ సామర్థ్యం 12.44 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 9.96 టీఎంసీలకు చేరుకుంది. అవుకు జలాశయంలో 4.14 టీఎంసీలకుగానూ 3.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. గండికోట రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.516 టీఎంసీలు ఉన్నాయి. సీబీఆర్, వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లు నిండటానికి ఇంకా 15 టీఎంసీలు అవసరం. ►నెల్లూరు జిల్లా సోమశిల రిజర్వాయర్‌లో 78 టీఎంసీలకుగానూ 42.89 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కండలేరులో 68.03 టీఎంసీలకుగానూ 22.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద కొనసాగుతోంది. ►శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా నీటిని తరలిస్తున్నారు. పత్తికొండ, కృష్ణగిరి, జీడిపల్లి రిజర్వాయర్లలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, అడవిపల్లి తదితర రిజర్వాయర్లు నిండాల్సి ఉంది. -
కరువు తీవ్రం బతుకు భారం
ఏళ్ల తరబడి కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల తోటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.. కోతకొచ్చిన కాయలతో పచ్చగా కళకళలాడాల్సిన మామిడి, బత్తాయి, సన్న నిమ్మ తోటలు కాయలతో సహా మలమలా మాడిపోతున్నాయి.. పొట్టేళ్లను వేలాడదీసినట్లు గెలలున్న అరటి చెట్లు వాడిపోతున్నాయి.. బొప్పాయిదీ అదే పరిస్థితి.. చెరకు ఎండిపోయిన గడ్డిలా మారింది.. కోతకు రావాల్సిన నువ్వు భూమికి అతుక్కుని వత్తుల్లా మారింది.. టమోటా, ఇతర కూరగాయల తోటలూ ఇందుకు భిన్నమేమీ కాదు. తినడానికి గడ్డి, తాగడానికి నీరులేక పశువులు బక్కచిక్కిపోతున్నాయి. ఇది తట్టుకోలేక అన్నదాతలు మనసు చంపుకుని వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. మరోవైపు.. వేలాది పల్లెలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. పనుల్లేక ఉపాధి కోసం కూలీలతోపాటు సన్నకారు రైతులు వలసబాట పట్టారు. గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు మాత్రమే ఉన్నారు. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. సిరిధాన్యాలతో కళకళలాడాల్సిన పల్లె సీమలు కళావిహీనంగా, దయనీయంగా మారాయి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు కరాళ నృత్యం సృష్టించిన బతుకు చిత్రం ఇది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని పుదూరు పొలాల్లో ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న మహిళ సాక్షి, అమరావతి : ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఉష్ణతాపం, వేడిగాలులతో నీటి తడిపెట్టిన రెండో రోజే పంటపొలాలు తడారి ఎండిపోతున్నాయి. మరోవైపు ఐదేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలమట్టం పాతాళానికి చేరింది. బోర్లకు నీరు అందడంలేదు. ఎలాగైనా పైర్లు, పండ్ల తోటలను కాపాడుకోవాలనే ఆశతో అప్పుచేసి బోర్లు వేసినా నీరు పడటంలేదు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వెయ్యి అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా నీటి జాడేలేదు. దీంతో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. పంటల సాగుకు చేసిన అప్పులకు బోర్ల కోసం చేసిన అప్పులు తోడుకావడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటి నుంచి బయటపడే మార్గం కానరాక సతమతమవుతున్నారు. వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో గెలలతో ఉన్న అరటి తోటలు, బత్తాయి, మామిడి, దానిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఏతావాతా పెరిగిన అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు పడుతున్న మానసిక వేదన మాటలకందనిది. తాగునీరు.. కన్నీరు.. గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లకు అద్దం పడుతున్నాయి ఈ దృశ్యాలు. ఊరుదాటి కిలోమీటర్ల కొద్దీ వెళ్లినా చుక్క నీరు దొరకని దుస్థితిలో గ్రామీణులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడో దూరాన చెలమల్లో అరకొర నీరు ఊరుతోందని తెలుసుకొని బిందెలు పట్టుకొని గంటల తరబడి తోడుకుంటూ గుక్కెడు నీళ్లు చేతికందగానే ఇంటి ముఖం పడుతున్నారు. మండు వేసవిలో మహిళలు చిన్న పిల్లలను కూడా వెంట నడిపించుకొస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీరు అందించాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇకనైనా తమకు కనీసం గుక్కెడు మంచినీళ్లు అందించాలని సర్కారును వేడుకుంటున్నారు. కందిపోతున్న కాయలు రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతతో నీటి తడులు అందక పండ్ల తోటల్లోని కాయలు నల్లగా కందిపోతున్నాయి. అరటి గెలలు వాడిపోతున్నాయి. బత్తాయి, బొప్పాయితోపాటు మామిడి కాయలు రంగు మారిపోతున్నాయి. టమోటాలు ఎండకు తెల్లగా రంగుమారి పిప్పితేలుతున్నాయి. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో టమోటా తోటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల టమోటా దిగుబడి భారీగా పడిపోయింది. అనంతపురం జిల్లాలో ఎండల నుంచి దానిమ్మ చెట్లను కాపాడుకోడానికి పాత చీరలను కప్పుతున్నారు. టమోటా రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘తోటకు పందిరి ఎటూ వేయలేం. భారీగా ఖర్చుపెట్టి గ్రీన్ హౌస్ లాంటివి పెట్టుకునే స్తోమతలేదు. అందువల్ల పాత చీరలు కొని పండ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీటిని చెట్లకు రక్షణగా కట్టడంవల్ల పండ్లకు, మొగ్గలకు కొంతవరకు రక్షణగా ఉంటున్నాయి’ అని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన వెంకటప్ప గౌడ్ అన్నారు. పడిపోయిన భూగర్భ నీటిమట్టం గత ఏడాది మే 16వ తేదీతో పోల్చితే ప్రస్తుతం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో తప్ప మిగిలిన 11 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. చిత్తూరు జిల్లాలో గత ఏడాదికీ, ఈ ఏడాదికీ భారీ వ్యత్యాసం నెలకొంది. ఏకంగా 36.90 అడుగుల కిందకు జలమట్టం పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదే కాలంలో వైఎస్సార్ జిల్లాల్లో 19.65 అడుగుల కిందకు పడిపోయింది. రాయలసీమలో సగటున భూగర్భ జలమట్టం 20.86 అడుగులకు కిందకు పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడానికి నిదర్శనమని భూగర్భ జల శాఖ నిపుణులు చెబుతున్నారు. వరుసగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. ఈ కారణంతోనే బోర్లు సైతం ఎండిపోతున్నాయి. ‘భూగర్భ జలమట్టం బాగా పెరగాలంటే మంచి వర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి ప్రవహించాలి. ఇలా అయితేనే నీటి మట్టం పైకి వస్తుంది’ అని భూగర్భ జల రంగానికి చెందిన నిపుణుడు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని, వర్షపాతం కూడా సాధారణం (93 శాతం మాత్రమే )గానే ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇలాగైతే కష్టమే’ అని ఒక ఉన్నతాధికారి నిరాశను వ్యక్తం చేశారు. తాగునీటికీ కటకట రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ చాలాచోట్ల తాగునీటికి కటకట ఏర్పడింది. గ్రామాల్లో తాగునీరు అందించే బోర్లు ఇంకిపోయి నీరు రావడంలేదు. దీంతో చాలా గ్రామాల వారు సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల నుంచి బిందెల్లో నీరు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా డ్రమ్ములతో నీరు తెచ్చుకుంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో దారుణమైన కరువు పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకుపైగా గ్రామాల్లో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నట్లు అంచనా. జాడలేని పశు సంరక్షణ కేంద్రాలు మూగ జీవాలు మేత, నీరులేక అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశు సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వంఏర్పాటుచేసి మేత, నీరు అందించే చర్యలు తీసుకోవాలి. అయితే, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతులు వరిగడ్డి కొనుక్కోవాలంటే ట్రాక్టరు రూ.15 వేలకు పైగా అవుతోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయినందున దానిని కొనే స్థితిలో చాలామంది రైతులు లేరు. ప్రభుత్వం చొరవ తీసుకుని గడ్డి, దాణా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయాల్సి ఉన్నా దానిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో రైతులు దిక్కుతోచక పశువులను కబేళాలకు ఇచ్చేస్తున్నారు. నిత్యం సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి బెంగళూరు, చెన్నై నగరాల కబేళాలకు వేలాది పశువులు తరలిపోతున్నాయి. ప్రకాశంలో 56 శాతం లోటు వర్షపాతం గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో సగటున 34.1 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో సాధారణంతో పోల్చితే 56.7 శాతం, నెల్లూరులో 54.6 శాతం, వైఎస్సార్ జిల్లాలో 55.9 శాతం, చిత్తూరులో 46.2, కర్నూలులో 48.1, అనంతపురంలో 43.1 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. వరుసగా ఐదేళ్లపాటు ఇలా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంవల్ల భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. చాలా నదులు ఎండిపోయాయి. డ్యామ్‌లలో నీరు డెడ్ స్టోరేజికి చేరింది. -
పంట పొలాలకు నిప్పంటించిన..కేసు క్లోజ్
-
కేసును ‘తగలబెట్టారు’
‘రాజధాని పొలాల్లో మంటలు’ కేసును ప్రభుత్వం నీరుగార్చింది. మూడు రోజుల క్రితం ఈ కేసును క్లోజ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టగానే రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. రాత్రికి రాత్రే రాజధాని ప్రాంతంలో ఆరు చోట్ల పంట పొలాలు, వ్యవసాయ పనిముట్లు తగలబడటంతో ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులే ఈ పని చేయించారని అసత్య ప్రచారం చేయించింది. ఆ తర్వాత రైతులే చేశారంటూ వందలాది మంది రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేసింది. పంట నష్టపోయి కన్నీరుమున్నీరైనవారికి కూడా వేధింపులు తప్పలేదు. వాస్తవానికి రాజధానికి భూములు ఇవ్వని రైతులపై అక్కసుతో అధికార పార్టీకి చెందిన నాయకులే ఈ ఘటనకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నిందితులెవరో తేల్చకుండానే కేసు మూసివేతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం కేసు మూసివేతపై మౌనం వహిస్తున్నారు. తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో 2014, డిసెంబర్ 29న ఆరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో ఉన్న వ్యవసాయ పనిముట్లను తగలబెట్టారు. రెండు రోజుల అనంతరం తుళ్లూరు మండలంలో చెరుకు తోటలకు నిప్పంటించారు. వీటన్నింటికి వైఎస్సార్సీపీనే కారణమంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేశారు. అంతేకాకుండా తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారు. తర్వాత రైతులే చేశారంటూ 400 మందికి పైగా రైతులను అదుపులోకి తీసుకున్నారు. మరో 800 మంది రైతుల సెల్ఫోన్ల డేటాను తీసి, వారు ఎవరెవరితో మాట్లాడారో వివరాలు సేకరించారు. అంతటితో ఆగకుండా రైతులు మహిళా కూలీలతో ఫోన్లో మాట్లాడితే వారినికూడా విచారణ పేరుతో వేధించారు. ఇంత చేసిన పోలీసులు చివరికి నిజమైన నిందితులను పట్టుకోలేక కేసును నీరుగార్చారు. నిజానికి ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి కేసును మూసేయించిందని పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దోషులను శిక్షించాలి రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదన్న కోపంతోనే రైతుల పొలాలను ప్రభుత్వం తగలబెట్టించింది. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై బురదచల్లింది. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే దోషులెవరో తేల్చి శిక్షించాలి. –ఆళ్ల రామకృష్ణారెడ్డి,వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మంగళగిరి ప్రతిపక్షం, రైతుల పాత్ర లేకపోవడంతోనే.. రాజధానికి రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలను, రైతులను ప్రభుత్వం దోషులుగా చిత్రీకరించింది. తీరా ప్రతిపక్షం, రైతుల పాత్ర లేకపోవడంతో కేసును మూసివేశారు. –జొన్నా శివశంకరరావు, రైతు సంఘం జిల్లా నాయకుడు గొంతు నొక్కారు ఒకసారి ప్రతిపక్షాలు కుట్ర చేశాయని, మరోసారి రైతులే తమ పొలాలకు నిప్పు పెట్టారని కేసులు మోపి, ఏళ్ల తరబడి విచారణ చేస్తూ కేసును నీరుగార్చారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు. – కంచర్ల కాశయ్య, సీపీఐ నేత -
అమరావతిలో పంటపోలాలను తెగలబెట్టిన కేసు క్లోజ్
-
పంటపొలాలను తగలబెట్టిన కేసు క్లోజ్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజధాని పంటపొలాలను తగలబెట్టిన కేసును పోలీసులు సోమవారం మూసేశారు. గుర్తు తెలియని దుండగులు 2014 డిసెంబర్ 29 రాత్రి తుళ్లురు, తాడేపల్లి మండలాల్లోని 13 చోట్ల పంట పొలాలను తగలబెట్టారు. ఆ సమయంలో పొలాల్లో మంటలు ఆరకముందే ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టే చేసిన పనేనంటూ అధికార పార్టీ నేతలు విష ప్రచారం చేశారు. ఈ కేసుతో రాజధానికి భూములు ఇవ్వని రైతులను టార్గెట్ చేసి పోలీసులతో వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేని రైతులు రాజధానికి పొలాలు ఇచ్చేశారు. నాలుగేళ్లుగా విచారించిన పోలీసులు తీరా ఇప్పుడు నిందితులను కనిపెట్టలేకపోయామంటూ కేసును క్లోజ్ చేశారు. ఈ కేసు మూసివేయడంపై అభ్యంతరాలుంటే వారం రోజుల్లోపు కోర్టుకు చెప్పుకోవచ్చని రైతులకు నోటీసులిచ్చారు. మరోవైపు ఇలా కేసు మూసేయడంపై రైతులు మండిపడుతున్నారు. విచారణ పేరుతో తమను చిత్రహింసలు పెట్టిన పోలీసులు.. నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మట్టే మన ఆహారం!
మన పంట భూముల్లో మట్టి ఎంత సజీవంగా, సారవంతంగా ఉంటుందో మనం తినే ఆహారం కూడా అంత ఆరోగ్యదాయకంగా, సకల పోషకాలతో కూడి ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ సాయిల్ మైక్రో బయాలజిస్ట్, ఎకో సైన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ (చెన్నై) అధినేత డా. సుల్తాన్ ఇస్మాయిల్. రసాయనిక వ్యవసాయంతో భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహజసిద్ధంగా పెంపొందించడానికి.. భూమి కోతను, భూతాపం పెరుగుదలను అరికట్టడానికి పంట పొలాల్లోకి స్థానిక జాతుల వానపాములను తిరిగి ఆహ్వానించటం అత్యుత్తమ పరిష్కారమని ఆయన చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా నిలిపివేసి.. పశువుల పేడ, మూత్రాలను నీటితో కలిపి పొలంలో పారించడం ద్వారా స్థానిక జాతుల వానపాములను తిరిగి సాదరంగా ఆహ్వానించవచ్చని, భూసారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనంలో ఆయన భూసారం పెంచుకునే మార్గాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► భూగోళం విస్తీర్ణంలో 75% నీరు, 25% భూమి ఉంది. ఈ భూమిలో సగం మనుషులకు పనికిరాదు. పనికొచ్చే భూమిలో.. 75% భూమి మాత్రమే సాగుయోగ్యమైనది. అంగుళం పైమట్టి(టాప్ సాయిల్) ఏర్పడటానికి 250 ఏళ్లు పడుతుంది. కాబట్టి, మట్టి వానకు గాలికి కొట్టుకుపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ► భూమిలో 45% ఖనిజాలు, 25% గాలి, 25% నీరు ఉంటాయి. భూమి సారవంతంగా ఉండాలంటే కనీసం 5% సేంద్రియ పదార్థం(ఆర్గానిక్ కార్బన్) ఉండాలి (ఇందులో 80% జీవనద్రవ్యం, 10% వేర్లు, 10% సూక్ష్మజీవరాశి ఉండాలి). కానీ, మన దేశ పంట భూముల్లో సేంద్రియ పదార్థం 0.4% మాత్రమే ఉంది. ► మట్టిలో ఏయే పోషకం ఎంత మోతాదులో ఉన్నదో(సాయిల్ ఫెర్టిలిటీని) చూడటం రసాయనిక ఎరువులు వాడే రైతులకు అవసరం.. అయితే, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు మొత్తంగా నేలతల్లి సమగ్ర ఆరోగ్యాన్ని(సాయిల్ హెల్త్‌ని) కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండాలి. ► నేలపైన పడిన ఎండిన గడ్డీ గాదాన్ని, రాలిన కొమ్మా రెమ్మలను సూక్ష్మజీవులు, చెద పురుగుల సాయంతో కుళ్లింపజేయటం.. విత్తనాలను మాత్రం కుళ్లబెట్టకుండా మొలకెత్తించటం నేలతల్లి విజ్ఞతకు, విచక్షణకు నిదర్శనం. ► వర్మీకంపోస్టు తయారు చేసే టబ్/కంటెయినర్‌కు పైన చిన్న బక్కెట్ వేలాడగట్టి చుక్కలు,చుక్కలుగా నీరు పడేలా ఏర్పాటు చేస్తే.. ఆ టబ్/కంటెయినర్ కిందికి వచ్చే పోషక ద్రవమే వర్మీవాష్. దీన్ని పంటలపై చల్లితే మంచి దిగుబడులు వస్తాయి. ► పెద్ద చెట్టు దగ్గర కర్బన నిల్వలు మెండుగా ఉంటాయి. దగ్గర్లో ఉండే మొక్కలు, చిన్న చెట్ల వేరు వ్యవస్థతో పెద్ద చెట్లు తమ వేరు వ్యవస్థలోని మైసీలియా వంటి శిలీంధ్రాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది. చిన్న చెట్లు బలహీనంగా ఉన్నప్పుడు.. పెద్ద చెట్లు కర్బనాన్ని భూమి లోపలి నుంచే శిలీంద్రాల ద్వారా చిన్న చెట్లకు అందిస్తాయి. రాలిన చెట్ల ఆకుల్లో సకల పోషకాలుంటాయి. వీటిని తిరిగి భూమిలో కలిసేలా చేయాలి. తగులబెట్టకూడదు. ఎండిన ఆకుల్లో కర్బనం ఉంటుంది, ఆకుపచ్చని ఆకుల్లో నత్రజని ఉంటుంది. ► మన దేశంలో 500 జాతుల వానపాములు ఉన్నా.. వీటిలో ముఖ్యమైనవి మూడే స్థానిక జాతులు: భూమి పైనే ఉండేవి, భూమి లోపల ఉంటూ రాత్రిపూట బొరియలు చేసుకుంటూ పైకీ కిందకు తిరిగేవి, భూమి అడుగున ఉండేవి. స్థానిక జాతుల వానపాముల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి పంటలకు వాడొచ్చు. కర్బనంతో కూడిన మట్టిని, పేడను తిని.. దాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో నత్రజనిని జోడించి.. పోషకాలతో కూడిన పదార్థాన్ని వానపాములు విసర్జిస్తాయి. ► నేలపైన ఆవు పేడ కల్లు వేసిన తర్వాత ఆ పేడ చెక్కుచెదరకుండా పిడక మాదిరిగా ఎండిపోతే దాని కింద ఉన్న భూమి నిర్జీవమైపోయిందని గ్రహించాలి. అలా కాకుండా.. పేడ కల్లు చివికినట్లు అయిపోయి, దాని అడుగున బొరియలు ఉంటే.. ఆ భూమి సారవంతంగా ఉన్నదని అర్థం. ► దేశీ జాతుల ఆవులు, ఇతర పశువుల కొట్టం(షెడ్)ను నీటితో కడిగి శుభ్రం చేసినప్పుడు పేడ, మూత్రం కలిసిన నీరు బయటకు వెళ్లిపోతుంది. దీన్ని వృథాగా పోనీయకుండా.. ఒక గుంతలోకి పట్టి ఉంచుకోవాలి. ఈ నీటిని 10%, బోరు నీరు 90% కలిపి పొలానికి పారించాలి. మట్టిలో సూక్ష్మజీవరాశి, వానపాముల సంతతి పెరిగి భూమి సారవంతమవుతుంది. ► రాత్రి వేళల్లో వానపాములు భూమికి బొరియలు చేస్తాయి. ఈ బొరియల ద్వారా వాన నీరు, ప్రాణవాయువు వేర్లకు, భూమిలోపలి జీవరాశికి అందుతాయి. ► బరువైన యంత్రాలు పొలంలో తిరిగితే భూమి చట్టుబడిపోతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములు, ఇతర చిరుజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ► వానపాములు మన పంట భూముల్లో మళ్లీ తారాడేలా చేయటం(రీవార్మింగ్) ద్వారా భూమి ఆరోగ్యాన్ని.. తద్వారా సేంద్రియ ఆహారం ద్వారా మనుషుల, పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పనిలో పనిగా భూతాపాన్ని(గ్లోబల్ వార్మింగ్‌ను) నిలువరించవచ్చు! www.erfindia.org. సేకరణ: పంతంగి రాంబాబు సాగుబడి డెస్క్ -
రైతుల కొత్త ఐడియా అదిరింది
-
ఇసుక జోరుగా ‘ఫిల్టర్’
♦ విజృంభిస్తున్న ఇసుక మాఫియా ఉచిత విద్యుత్‌తో ♦ కుంటలు, చెరువుల నుంచి నీళ్ల వినియోగం ♦ పంట పొలాలు, ప్రభుత్వ భూముల్లోనూ ఫిల్టర్ల ఏర్పాటు ♦ పరిగి, దోమ, గండేడ్ మండలాల పరిధిలో ఇసుక తయారీ ♦ చేష్టలుడిగి చూస్తున్న యంత్రాంగం పరిగి: ఇసుక మాఫియా విజృంభిస్తోంది. పంట పొలాలు, బీడు భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు, చెరువులు, కుంటలు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటు రాజకీయ నాయకులను అటు అధికార యంత్రాంగాన్ని ఇసుక మాఫియా శాసిస్తోందనే అరోపణలు వినిపిస్తున్నాయి. వాగులు, నదులనుంచి ఇసుక తరలించేం దుకు ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆటంకాలు ఎదురవుతుండడంతో అక్రమార్కులు ఎవరికివారు స్థానికంగా ఇష్టారాజ్యంగా ఇసుక ఫిల్టర్లను ఏర్పాటు చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. అయితే, ఆయా గ్రామాల్లోని కీలక నేతల కనుసన్నల్లోనే ఈ ఇసుక మాఫియా కొనసాగుతోంది. మారుమూల ప్రాంతాల్లో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తూ ఇసుకను తయారుచేస్తూ ట్రాక్టర్ల ద్వారా రోడ్లు ఉన్న ప్రాంతాలకు తరలిస్తూ నిల్వ చేసుకుంటున్నారు. అనంతరం సదరు ఇసుకను లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్ తదితర ప్రాంతా ల నుంచి ఒక లారీ ఇసుకను తీసుకొస్తూ అవే బిల్లులపై మరో రెండు లారీల లోకల్ ఇసుకను తరలిస్తున్నారు. ఇదంతా అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం కనుసన్నల్లోనే జరుగు తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలన్నీ వారికి చుట్టాలే..! సహజ వనరుల దుర్వినియోగ నియంత్రణ చట్టం(వాల్టా), నాన్ అగ్రికల్చర్ ల్యాండ్( నాలా), ఫారెస్టు పరిరక్షణ చట్టం ఇలా ఒకటేమిటి.. చట్టాలన్నింటిని ఇసుక అక్రమార్కులు తమ చుట్టాలుగా మార్చుకుంటున్నారు. కొందరు గండేడ్ మండలంలోని వాగుల్లో ఇసుకను తవ్వి రవాణా చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తుండగా, పరిగి, దోమ మండలాల్లో యథేచ్ఛగా పంట పొలాలు, బీడు భూములు అని తేడా లేకుండా మట్టిని తవ్వుతూ ఫిల్టర్లకు తరలిస్తూ ఇసుక తయారు చేస్తున్నారు. అటవీ భూముల్లో ఎలాంటి తవ్వకాలు జరుపొద్దనే నిబంధనలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మంది ఇసుక ఫిల్టర్ల నిర్వాహకులు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇసుక ఫిల్టర్లకోసం ప్రత్యేకంగా బావులు, కుంటలు నిర్మిస్తున్నారు. ఇలా అక్రమార్కులు ఇన్ని శాఖలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పరిగి, గండేడ్, దోమ మండలాల్లో అత్యధికం.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడో ఓ చోట ఇసుక లభించినా అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. గండేడ్ మండల పరిధిలోని ధర్మాపూర్, శేఖపల్లి, గాధిర్యాల్, చిన్నవార్వాల్, పెద్దవార్వాల్, రంగారెడ్డిపల్లి, పగిడ్యాల్ గ్రామాల్లో అత్యధికంగా ఇసుక నిల్వ ఉంది. దీంతోపాటు దోమ మండల పరిధిలోని పలు గ్రామాలు, పరిగి మండల పరిధిలోని రంగంపల్లి, గడిసింగాపూర్ తదితర గ్రామాల శివార్లలో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసిన అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను వ్యాపారం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి పగలు, రాత్రి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పొలాలకు తరలించి.. అనంతరం అక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అధికారులు, పోలీసులు తరచూ నామమాత్రంగా దాడులు నిర్వహించి స్వల్ప జరిమానాలతో సరిపెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఫిల్టర్ ఇసుక దందాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
చిత్తూరులో ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లాలో వరసగా రెండో రోజు.. ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బెరైడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లె గ్రామం శివారులోని పంట పొలల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు పంటలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇప్పటికే ఏనుగుల దాడిలో గ్రామస్థులు వరి, రాగి, బీన్స్ పంటలను నష్టపోయారు. కాగా ఈ రోజు ఉదయం వాటిని తర మివేయడానికి ప్రయత్నించిన కొందరు గ్రామస్థులపై ఏనుగులు దాడికి దిగాయి. దీంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. తమ గ్రామాల్లో తరచూ ఏనుగులు పంటలను నాశనం చేయడంతో పాటు.. గ్రామస్తులపై దాడికి దిగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అటవీ అధికారులకు ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా.. ఫలితం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
నిండని చెరువులు..రైతన్న గుండె గుబేలు
వరుణుడి కరుణ కోసం రైతన్న ఆకాశం వైపు ఎదురు చూడడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. రెండు నెలలుగా వర్షాలు సాధారణ స్థాయి కన్నా తక్కువగా నమోదు కావడంతో భూములన్నీ బీళ్లుగా మారాయి. దీంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చెరువులు నిండకపోవడంతో ఆయకట్టు కూడా ప్రశ్నార్థకంగా మారింది. - సకాలంలో కురవని వర్షాలు - అడుగంటిన భూగర్భజలాలు - నెర్రెలువారిన పంట పొలాలు - ఆందోళన చెందుతున్న అన్నదాతలు మహేశ్వరం: వర్షాలు సకాలంలో కురవకపోవడంతో మండల పరిధిలోని పలు చెరువుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఆయకట్టు కింద సాగయ్యే పంట పొలాలు బీళ్లుగా మారుతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో ఉన్న పెద్ద చెరువు, తుక్కుగూడ, మంఖాల్, తుమ్మలూరు, మహేశ్వరం, మన్సాన్పల్లి, అమీర్‌పేట్, కల్వకోల్, గొల్లూరు, కోళ్లపడకల్, దుబ్బచర్ల, నాగారం తదిర గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలల్లో చుక్కనీరు లేవు. గతేడాదితో పోల్చుకుంటే.. ఈసారి తొలకరి ముందుగా పలకరించడంలో రైతులు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. దీంతో దుక్కులు దున్ని ఎరువులు, విత్తనాలు చల్లుకున్నారు. అయితే మొలకెత్తిన మొక్కజొన్న, పత్తి, వరి, కూరగాయ పంటలు వర్షాలు కురవక ఎండుముఖం పడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు సైతం ఎండిపోయాయి. దీంతో వీటిని నమ్ముకున్న రైతులు వరి సాగుకు దూరమయ్యారు. వర్షాలు అదును దాటి పోతుండడంతో చెరువు ఆయకట్టు కింద వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. నాట్లు వేసుకునే సమయంలో చెరువుల్లో సాగు నీరు లేక పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. చెరువుల్లో నీరు లేక ఆయకట్టు కింద వరి సాగు చేద్దామంటే చెరువుల్లో చుక్క నీరు లేదు. బోర్లు అన్నీ ఎండు ముఖం పట్టాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన వర్షాధార పంటలు ఎండు ముఖం పట్టాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. - శేఖర్, రైతు, కోళ్లపడకల్ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి రైతులు కంది, పెసర, బెబ్బర , ఆము దం, నువ్వులు ఆరుతడి పంటలు వేసుకోవాలి. వాడు ముఖం పడుతున్న పంటలకు యూరియాను నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. -రుద్రమూర్తి, ఏడీఏ, మహేశ్వరం చెరువులు నిండుతేనే.. చెరువులు నిండుతేనే బోర్లలో పుష్కలంగా నీరు ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తే భూగర్భజలాలు పెరిగి బోర్లు పుష్కలంగా నీరు పెరుగుతాయి. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి అన్నదాతకు నష్టపరిహారం చెల్లించాలి. - పుంటికూర శేఖర్‌రెడ్డి, రావిర్యాల -
భూసేకరణకు చెక్!
ఆర్డినెన్స్ ఉపసంహరణ యోచనలో కేంద్రం ♦ అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ చెల్లుబాటు కాదు ♦ అమల్లోకి 2013 భూసేకరణ చట్టం ♦ దీని ప్రకారం బహుళ వార్షిక పంటలు పండే భూములను సేకరించరాదు ♦ 80% ప్రజల మద్దతు అనివార్యం ♦ సామాజిక ప్రభావం మదింపు చేయాలి ♦ అయినా సేకరించాలంటే ఎకరాకు రూ. 5 కోట్లు చెల్లించాలి ♦ 11 వేల ఎకరాలను సేకరించాలంటే దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయం సాక్షి, హైదరాబాద్: భూ సేకరణ, నష్టపరిహారం, పునరావాస, పునరుపాధి కల్పన చట్టానికి (2013) సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటే రాష్ట్ర రాజధానికి భూ సేకరణకు బ్రేక్ పడుతుందంటున్నారు న్యాయవాద, హక్కుల సంఘాలు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లు ఆర్డినెన్స్‌ను జారీ చేసినా పార్లమెంటులో చట్టం కాకపోవడంతో ప్రభుత్వం దాదాపు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. పూర్తిగా ఉపసంహరించుకోకుండా వివాదాస్పదమైన కీలకాంశాలను సడలించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 14న- కేంద్రం ఆర్డినెన్స్ ఆధారంగా భూ సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు విలువ లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఆర్డినెన్స్ ఉపసంహరించుకుంటే అమల్లోకి వచ్చే 2013నాటి భూసేకరణ చట్టప్రకారం రాజధానికి 11 వేల ఎకరాలను సేకరించాలంటే ప్రభుత్వం కనీసం రూ.60 వేల కోట్లు రైతులకు చెల్లించాలని, సహాయ పునరావాస పథకానికి మరో 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. 80 శాతం మంది రైతులు ఆమోదిస్తేనే... 2013 నాటి భూ సేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావ మదింపు అనివార్యం. ప్రైవేటు వ్యవహారమైతే 80 శాతం మంది, పబ్లిక్ వ్యవహారమైతే 70 శాతం మంది భూ యజమానుల అనుమతివ్వాలి. సర్వే, నిపుణుల కమిటీ పరిశీలన జరగాలి. దీనికి11 నెలల గడువు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భూ సేకరణ మొదలు పెడితే 2016 ఆగస్టునాటికి కానీ పూర్తికాదు. పంట పొలాలు తీసుకునే వీలు లేదు... చట్టంలోని మూడో అధ్యాయం సెక్షన్ 10-ఎ ప్రకారం బహుళ పంటలు పండే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. గత్యంతరం లేక తీసుకుంటే దానికి సమానమైన భూమిని అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం రాజధానికి గుర్తించిన 29 గ్రామాల్లో (మరో నాలుగు గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది) లక్షా 40 వేల మంది జీవనోపాధి కోల్పోతారు. 90 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. దీన్ని మదింపు చేయాలి. సహాయ పునరావాస ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్)ని అమలు చేయాలి. నిర్వాసితులకు పూర్తి ప్రత్యామ్నాయం కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలి. బాబు ప్రభుత్వం ఈ ప్యాకేజీ ఊసెత్తకుండా భూసమీకరణ చేస్తోంది. కేంద్రం ఆర్డినెన్స్ రద్దయితే రూ.వేల కోట్లు అవసరమవుతాయి. పరిహారానికే రూ.70 వేల కోట్లు కావాలి... రాజధాని ప్రాంతంలో 44 వేల ఎకరాల భూ సమీకరణకు రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి 22 వేల ఎకరాలు సమీకరించినట్టు ప్రకటించింది. మిగతాదాన్ని భూ సేకరణ చట్టం కింద తీసుకుంటామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఒకే ప్రయోజనం (రాజధాని నిర్మాణం) కోసం రెండు నోటిఫికేషన్లు, వేర్వేరు చట్టాలను ప్రయోగిస్తోంది. భూ సమీకరణ పథకం కింద భూమి ఇచ్చిన జరీ భూముల రైతులకు ఒక ఎకరానికి 1450 గజాలు, మెట్టరైతులకు 1200 గజాల అభివృద్ధి చేసిన భూమిని, ఏటా రూ. 50 వేలుచొప్పున కౌలు ఇస్తామని ప్రకటించింది. 2013 చట్టం ప్రకారం భూమిని సేకరిస్తే మార్కెట్ విలువ ్ఠ1.25 ఫార్ములా (ఏపీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్) (తెలంగాణ అయితే 2, మహారాష్ట్ర అయితే 5) ప్రకారం పరిహారం చెల్లించాలి. దీంతోపాటు భూమి ఇచ్చిన వారికి సాంత్వన (సొలాషియమ్) కింద వంద శాతం ఇవ్వాలి. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో వేసేంతవరకు 19 శాతం వడ్డీ కలపాలి. తుళ్లూరులో ఎకరం భూమి విలువ రూ.రెండు కోట్లుగా నమోదైంది. తాడికొండ, మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈమేరకు ఆధారాలున్నాయి. దీన్ని బట్టి 2013 భూ సేకరణ చట్టం కింద ఎకరం ఉన్న రైతుకు మార్కెట్ విలువ కింద రెండు కోట్లు, మల్టిప్లికేషన్ ఫార్ములా కింద 50 లక్షలు (మొత్తం 2.5 కోట్లు), సోలాషియమ్ కింద రెండున్నర కోట్లు... ఇలా ఎకరానికి రూ. ఐదు కోట్లు చెల్లించాలి. డబ్బు పూర్తిగా చెల్లించేవరకు 19 శాతం వడ్డీని కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలా ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి పోను మిగతా 11 వేల ఎకరాలను సేకరించాలంటే కనీసం రూ.60 వేల కోట్లు చెల్లించాలి. పునరావాస పథకానికి మరో రూ. 20 నుంచి 30 వేల కోట్లు కావాల్సి ఉంది. భూ సమీకరణ కింద ఇచ్చిన రైతులకే కౌలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తాన్ని ఎలా తీసుకువస్తుందో అంతుబట్టని విషయమని రైతు సమాఖ్య కన్వీనర్, హక్కుల సంఘం నాయకుడు మల్లెల శేషగిరిరావు వ్యాఖ్యానించారు. -
గుండ్లమోటుకు నిర్లక్ష్యం గండ్లు
- రూ.కోట్లు వెచ్చించినా ప్రయోజనం శూన్యం - అధికారుల నిర్లక్ష్యానికి బీడువారుతున్న పంట పొలాలు - భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి తంటా గిద్దలూరు: గుండ్లమోటు ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం ఆవహించింది. దీంతో పశ్చిమ ప్రకాశంలో ఇటు సాగు నీరుకు, అటు తాగునీరుకు కటకట ప్రారంభమయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టాక మార్కాపురం డివిజన్లోని కొన్ని ప్రాంతాలకైనా తాగు, సాగు నీరు వస్తుందని రైతులు, ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. 1980లో కొట్టుకుపోయిన గుండ్లమోటు ప్రాజెక్టుకు వై.ఎస్. హయాంలో నిధుల మంజూరయ్యాయి. కంభం చెరువు అభివృద్ధికి జపాన్ నిధుల మంజూరుకు కృషి చేశారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యానికి పరుగులు తీయాల్సిన ప్రగతి పడకేసింది. దీంతో గత ఆరు సంవత్సరాలుగా నిర్మాణ పనులు సాగుతూ...నే ఉన్నాయి. కంభం చెరువు అభివృద్ధి, గుండ్లమోటు ప్రాజెక్టు పూర్తయితే వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. దీంతోపాటు భూగర్భ జలాలు అభివృద్ధి చెంది తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. 2009లో శ్రీకారం... గిద్దలూరు మండలంలోని వెంకటాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎనుమలేరు వాగుపై 1975వ సంవత్సరంలో పనుల చేస్తున్న సమయంలోనే అధిక వర్షాలకు కట్ట తెగిపోయింది. దీంతో తాత్కాలిక పనులు చేపట్టారు. తిరిగి 1980 నుంచి 2000 సంవత్సరం వరకు కురిసిన భారీ వర్షాలకు వచ్చిన నీటి ఉధృతిలో అలుగు, తూముతోపాటు, అప్రాన్, పికప్ ఆనకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నిధులూ విడుదల చేయలేదు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మొదట రూ.7 కోట్లు నిధులు విడుదల చేసింది. అనంతరం రిజర్వాయర్ డిజైన్ మార్పుల కోసం అదనంగా మరో రూ.4.63 కోట్లను విడుదల చేసింది. పనులు దక్కించుకున్న ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు వెంటనే పనులు ప్రారంభించినా అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనులు అర్థ్ధంతరంగా ఏడాదిన్నరపాటు నిలిచిపోయాయి. అటవీశాఖ అనుమతులు తీసుకుని తిరిగి పనులు ప్రారంభించారు. ఐదు సంవత్సరాలపాటు కేవలం 140 మీటర్ల పొడవున్న అలుగు మాత్రమే పూర్తిచేశారు. చెరువు కట్టను ఆనుకుని కరకట్ట నిర్మించేందుకు 8 అడుగుల లోతు వరకు గుంత తీసినా గట్టితనం రాలేదు. దీంతో పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన జియాలజిస్టులు గట్టితనం వచ్చే వరకు గుంత తీయాలని చెప్పడంతో లోతుగా గుంత తీస్తే కట్ట తూలిపడుతుందని పనులను నిలిపేశారు. ఇలా గత రెండేళ్లుగా పనులు ఆగిపోయాయి. గడువులు పెంచుకోవడంతోనే సరిపెడుతున్నారు... ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టరు గడువు మీద గడువు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు పెంచారు. గతేడాది డిసెంబరులో తీసుకున్న గడువు ముగియడంతో ఇటీవల చీఫ్ ఇంజినీర్లు పనుల పురోగతిని పరిశీలించి అనుమతులిచ్చారు. అయినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. వర్షాలు కురవక ముందే ప్రారంభించి ఉంటే వర్షపు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని రైతులు భావించారు. పనులు చేయించడంలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పూర్తయితే... ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 15 వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు గిద్దలూరు నగర పంచాయతీతో పాటు 14 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే భైరేనిగుండాల ప్రాజెక్టుకు నీరు పుష్కలంగా చేరే అవకాశం ఉంది. చుట్టు పక్కలున్న చెరువులు, కుంటల్లోనూ నీరు చేరుతుంది గడువులోగా పనులు పూర్తి చేస్తాం: నాగార్జునరావు, డీఈ, కంభం గుండ్లమోటు ప్రాజెక్టు పనులు గడువులోగా పూర్తి చేయడానికి తనవంతు కృషి చేస్తాను. సాంకేతిక కారణాలతో పనులు ఆపేశారు. కాంట్రాక్టరు పనులు నిలిపారని నోటీసులు జారీ చేశా. ఇటీవల చీఫ్ ఇంజినీరు, ఎస్ఈ వచ్చి పనులను పరిశీలించారు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా అనుమతులొచ్చాయి. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. -
ఆగని ఆత్మహత్యలు
- మైసూరులో మరో రైతన్న బలవన్మరణం - పంట పొలాల్లోనే నేలకొరుగుతున్న అన్నదాతలు సాక్షి, బెంగళూరు: నేల తల్లినే నమ్ముకున్న అన్నదాతలు చివరకు ఆ తల్లి ఒడిలోనే కుప్పకూలిపోతున్నారు. ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటూ వచ్చిన పంటపొలాల్లోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అప్పుల బాధలను తాళలేక పంటకు అంటించిన నిప్పుల్లోనే మండ్యకు చెందిన రైతు నింగేగౌడ గురువారం సజీవదహనం కాగా, మైసూరుకు చెందిన మరో రైతు శివలింగేగౌడ సైతం అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం మధ్యాహ్న సమయంలో తన పంటపొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు జిల్లా నంజనగూడులోని సిద్దగుండినహుండి గ్రామానికి చెందిన రైతు శివలింగేగౌడ చెరకు, వరి పంటలను పండిస్తున్నారు. వ్యవసాయం కోసం దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. చెరకు పంటకు చెల్లించాల్సిన బకాయిలు చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెల్లించకపోవడంతోపాటు, ప్రస్తుతం పండిం చిన చెరకును సరైన ధరకు అమ్ముకునే పరిస్థితులు కనిపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శివలింగేగౌడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం తన పంట పొలానికి చేరుకున్న శివలింగేగౌడ పంట కోసం వినియోగించే పురుగులమందును తా గి ప్రాణాలు వి డిచారు. పొలానికి వెళ్లిన శివలింగేగౌడ ఎంతకూ రాకపోవడంతో కంగారు పడ్డ అతని కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా అక్కడ అచేతన స్థితిలో పడి ఉన్న శివలింగేగౌడను గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. నెలకు ఇద్దరు అన్నదాతలు ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో మొత్తం 58 మంది అన్నదాతలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే సగటున నెలకు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడినట్లు లెక్క. ఈ గణాంకాలు ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబేరేగౌడ వెల్లడించినవే. ఇక రెండేళ్లలో 58 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. గత నెల రోజుల్లోనే మొత్తం 19 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ చెబుతున్నారు. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని అందువల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నింగేగౌడ కుటుంబానికి నేతల ఓదార్పు అప్పుల బాధతో చెరుకు పంటకు నిప్పుపెట్టి అదే పంటలోకి దూకిన రైతు నింగేగౌడ నివాసానికి అనేక మంది నేతలు తరలివచ్చారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడతో పాటు మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప తదితరులు శుక్రవారం ఉదయం నింగే గౌడ నివాసానికి చేరుకొని నింగేగౌడ కుటుంబసభ్యులను ఓదర్చారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ మాట్లాడుతూ, ‘చెరకు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడతాం. ఇక ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అంతేకాక రైతులు కూడా తమ కుటుంబ సభ్యుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఇదే సందర్భంలో నింగేగౌడ కుటుంబానికి రూ.1లక్ష సహాయాన్ని దేవేగౌడ ప్రకటించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ, నింగేగౌడ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.5లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు. -
పంట పొలాలు తగులబెట్టడం అమానుషం
అనంతపురం అగ్రికల్చర్ : రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. భూములు ఇవ్వని రైతులపై కన్నెర చేస్తూ వారి పంట పొలాలను తగులబెట్టి భయాందోళనకు గురిచేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి పంట పొలాలకు నిప్పుపెట్టడమే కాకుండా ఆ అపవాదును తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ సోమవారం రాత్రి నగరంలోని సప్తగిరి సర్కిల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మిద్దిభాస్కర్‌రెడ్డి, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోభిలేసు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సోమశేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ... పంట పొలాలను తగులబెట్టి రైతులకు తీరని నష్టం కలగజేయడంతో పాటు భయభ్రాంతులు సృష్టించడం దారుణమన్నారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందకుండా వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్పచారం చేయడం ప్రభుత్వ నీచరాజకీయాలకు పరాకాష్టగా అభివర్ణించారు. రాజధాని ముసుగులో రైతుల పొలాలను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం అమానుష చర్య అన్నారు. దారికి రాని రైతులను ఇలాంటి సంఘటనలతో బెదరించేందుకు దిగడం అన్యాయమన్నారు. ఆదివారం రాత్రి ఒకేసారి 8 గ్రామాల్లో రైతుల పంట పొలాలను తగులబెట్టడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని రైతులు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. దగ్ధమైన పంటకు నష్టపరిహారం అందించడమే కాకుండా రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీపై బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.విద్యాసాగర్‌రెడ్డి, కేవీ మారుతీప్రకాష్, మహబూబ్‌పీరా, సురేష్‌రెడ్డి, గోవిందరెడ్డి, జయపాల్, కనేకల్లు లింగారెడ్డి, వాయలశ్రీనివాసులు, మర్రి రాజారెడ్డి, మోసెస్, ఫకృద్ధీన్, ముక్తియార్, నూర్‌మహమ్మద్, రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఉమా.. ఏమి డ్రామా!..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెట్ట పొలాలు లాక్కుని రైతుల పొట్టకొట్టొద్దని రోడ్డెక్కారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకుని పశ్చిమ కృష్ణాలో ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. నాడు పొలాలు ఇవ్వొద్దని ధైర్యం చెప్పిన నాలుకతోనే నేడు పచ్చని పొలాలు ఇవ్వాల్సిందేనని రాజధాని జోన్ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆయనే నాటి నందిగామ ఎమ్మెల్యే.. నేటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఆయనలో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ⇒ నాడు మెట్ట భూములు కూడా తీసుకోవద్దని రైతుల తరఫున ఆందోళనలు ⇒ సొంత నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనను సైతం అడ్డుకున్న వైనం ⇒ కంచికచర్ల మండలంలో ఉపాధి అవకాశాలపై ప్రభావం ⇒ నేడు పచ్చని పంటపొలాలు ఇవ్వాలని రైతన్నలపై ఒత్తిడి ⇒ ఎనిమిదేళ్లలో దేవినేని ఉమాలో ఎంత మార్పు ! సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘కంచికచర్ల మండలంలో పరిశ్రమల స్థాపన కోసం రైతుల భూములను తీసుకుంటే ఊరుకోం. బాధిత రైతులకు అండగా ఉంటాం. ఆందోళనలు చేస్తాం...’ అంటూ 2006 అక్టోబర్‌లో అప్పటి నందిగామ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. రైతులతో ఆమరణ దీక్షలు చేయించారు. దీంతో పరిశ్రమలు ఇతర జిల్లాలకు వెళ్లిపోయాయి. ఇప్పుడు దేవినేని ఉమా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పదవిలోనే కాదు తీరులోనూ మార్పు వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చినా అడ్డుకున్న ఉమా... ఇప్పుడు అధికార పక్షంలో ఉండటంతో రాజధాని కోసం పచ్చని పొలాలను ఇవ్వాలని పొరుగు జిల్లాకు సైతం వెళ్లి రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఉమాలో ఎంత మార్పు వచ్చిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. రాస్తారోకో చేశారు... పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా కంచికచర్ల మండలంలోని బత్తినపాడు, పరిటాల, నక్కలంపేట గ్రామాల పరిధిలో రైతుల నుంచి 1,632 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూముల్లో టెక్స్టైల్ పార్క్, అపెరల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో నందిగామ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని ఉమా ఈ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల భూములను ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులతో ఆమరణ దీక్షలు చేయించారు. గుంటూరు జిల్లాకు చెందిన అప్పటి తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రైతుల పక్షాన కంచికచర్లలో రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆయనపై 2006, అక్టోబరు 15న పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ గొడవల నేపథ్యంలో ఏపీఐఐసీ వారు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటును విరమించుకున్నారు. ఆ పార్క్‌ను నెల్లూరు జిల్లాకు తరలించారు. నాడు ముంపు భూములపై రాద్ధాంతం! కంచికచర్ల మండలంలో ఏపీఐఐసీ సేకరించాలనుకున్న 1,632 ఎకరాలు ఆహార పంటలు పండేవి కాదు. సుబాబుల్ మాత్రమే సాగుచేసేవారు. కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగితే ఈ భూములు ముంపునకు గురవుతాయి. అటువంటి భూముల్లో పరిశ్రమల ఏర్పాటును అప్పట్లో ఉమా తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు పచ్చని పంట పొలాలు ఇవ్వాలని ఒత్తిడి ప్రస్తుతం ఉమా తీరులో పెనుమార్పు వచ్చింది. రాజధాని నిర్మించనున్న తుళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆరుగాలం పంటలు పండించే భూములను రాజధానికి ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. నెలరోజుల నుంచి ఖాళీ దొరికితే ఆయా గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడుతున్నారు. సభల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కొందరు రైతులను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి హైదరాబాద్‌కు తీసుకెళ్లి తమ భూములు తప్పకుండా ఇస్తామని చెప్పించారు. కొందరు తమ ఇష్టానుసారమే భూములు ఇస్తామని చెప్పినప్పటికీ, మరికొందరు మాత్రం మంత్రి బలవంతం కారణంగానే భూములిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 70శాతం మంది రైతులు తమ భూములు రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు వ్యతిరేకంగా ఉన్నారు. రాయపూడి గ్రామంలో రైతులంతా తమ భూములు ఇచ్చేంది లేదంటూ అధికారులను సైతం నిలదీస్తున్నారు. మంత్రులను అడ్డుకుంటున్నారు. అయినా, వారి భూములు తీసుకునేందుకు సామ దాన భేద దండోపాయాలు రైతులపై మంత్రి ఉపయోగిస్తున్నారు. ఉపాధి అవకాశాలపై దెబ్బ అప్పట్లో కంచికచర్ల మండలంలో టైక్స్‌టైల్ పార్క్‌ను నిర్మించి ఉంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించేవి. ఇప్పుడు ఆ పార్క్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది. ఉపాధి అవకాశాలు కూడా పెరిగేవి. అప్పట్లో ఉమా ప్రతిపక్షంలో ఉన్నందున తాను రైతుల పక్షాన ఉన్నానని చెప్పేందుకు ఆ విధంగా చేశారు. అయితే నేడు ఆ నీతి ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
ఇసుక దందా ఆపేవారెవరు?
పరిగి: ఇసుక మాఫియా రోజురోజుకు విజృంభిస్తోంది. పంట పొలాలు, బీడు భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అని తేడాలేకుండా యథేచ్ఛగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ నాయకులను, అధికార యంత్రాంగాన్ని ఇసుక మాఫియా శాసిస్తోంది. వాగులు, నదుల నుంచి ఇసుక తీసుకు రావటానికి అడ్డంకులు ఎదురవుతుండటంతో స్థానికంగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసుకుని ఇసుక దందా కొనసాగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఫిల్టర్లు ఏర్పాటు చేసి ఫిల్టర్ చేసిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి నిల్వ చేస్తున్నారు. ఆ ఇసుకను లారీల ద్వారా రవాణా చేస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. చట్టాలన్నీ చుట్టాలే... సహజ వనరుల దుర్వినియోగ నియంత్రణ చట్టం(వాల్టా), నాన్ అగ్రికల్చర్ ల్యాండ్(నాలా), ఫారెస్టు పరిరక్షణ చట్టాలన్నింటినీ ఇసుక మాఫియా చుట్టాలుగా మార్చుకుంటోంది. గండేడ్, కుల్కచర్ల మండలాల్లో వాగు ల్లో ఇసుకను తవ్వి రవాణా చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తుండగా, పరిగి, దోమ మండలాల్లో పొలాలు, బీడు భూములు అని తేడా లేకుండా మట్టిని తవ్వుతూ ఫిల్టర్లకు వినియోగిస్తూ నాలాకు తూట్లు పొడుస్తున్నారు. ఇసుక తయారీకి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. కుంటులు, చెరువుల్లోని నీటిని ఇసుక తయారీకి వినియోగిస్తున్నారు. అరుునా ఏ ఒక్క శాఖ అధికారులు కూడా ఇసుక మాఫియాను నియంత్రించలేకపోతున్నారు. అటవీ భూముల్లోనూ ఇసుక ఫిల్టర్లు... పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్, రూప్‌ఖాన్‌పేట్, రంగంపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న అటవీ భూములు ఇసుక ఫిల్టర్లకు అడ్డాలుగా మారాయి. వీరు అటవీ భూముల్లో సైతం తవ్వకాలు జరుపుతూ ఇసుకను కొల్లగొడుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూలేకుండా పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానాలకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. గండేడ్ మండల పరిధిలోని ధర్మాపూర్, శేఖపల్లి, గాధిర్యాల్, చిన్నవార్వాల్, పెద్దవార్వాల్, రంగారెడ్డిపల్లి, పగిడ్యాల్ ప్రాంతాల్లో ఇసుక నిల్వ ఉంది. దోమ మండల పరిధిలోని పలుగ్రామాల్లో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు, పోలీసులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి స్వల్పంగా జరిమానాలు విధించి మామూళ్లు తీసుకొని వదిలి పెట్టడంతో వ్యాపారులకు ఇసుక తరలింపు మంచి వ్యాపారంగా మారింది. -
రాజకీయ గండం
►పూడ్చివేతకు నోచుకోని చెరువుల గండ్లు ►గత ఏడాది భారీ వర్షాలకు పంటలను, ఊళ్లను ముంచేసిన వరద ►23 చెరువులకు గండ్లు.. 7 వేల ఎకరాల్లో పంట నాశనం ►తక్షణమే స్పందించిన అధికారులు.. రూ.85 లక్షలు మంజూరు ►అయినా ఇప్పటికీ ప్రారంభం కాని పనులు ►మొదట ఎన్నికల కోడ్‌తో ఆటంకం ►ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో అవాంతరం ►ఈ ఏడాదీ కడగండ్లు తప్పవేమోనని రైతుల ఆందోళన పొందూరు : పొందూరు మండల చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఉత్పాతం.. భారీ వర్షాలకు చెరువులు కట్టలు తెంచుకున్నాయి. వరద నీరు పంట పొలాలు, ఊళ్లు, రోడ్లను ముంచెత్తింది. 23 చెరువులకు గండ్లు పడగా.. 7వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. మండల కేంద్రమైన పొందూరు పట్టణం పూర్తిగా జలదగ్బంధంలో చిక్కుకుంది. ఇదంతా గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది. అప్పటి కలెక్టర్, జిల్లా ప్రత్యేకాధికారి మండలంలో పర్యటించి, పరిస్థితిని పరిశీలించాలరు. గండ్ల పూడ్చివేతకు ఉపాధి హామీ పథకం కింద రూ.85 లక్షలు మంజూరు చేశారు. పొందూరు, బాణాం, తానెం, దళ్లిపేట, గారపేట, లోలుగు, రాపాక, తోలాపి, నర్సాపురం, వి.ఆర్. గూడెం గ్రామాలకు చెందిన చెరువులకు గండ్లు పడ్డాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటంతో ఒక చెరువు నుంచి మరో చెరువులోకి పొంగి ప్రవహించి.. సుమారు 7 వేల ఎకరాల్లో పంటలను ముంచేసింది. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయడంతో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు మొదలెట్టారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ఎన్నికలు పూర్తి అయ్యి, కోడ్ ఉపసంహరించేవరకు పనులు చేపట్టే అవకాశం లేకుండాపోయింది. ఊహించని అవాంతరం ఎట్టకేలకు జూన్‌లో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. నిధులు అందుబాటులో ఉన్నందున ఉపాధి పనుల్లో భాగంగా గండ్ల పూడ్చివేత పనులు ప్రారంభించేందుకు ఆయా గ్రామాల సర్పంచులు ప్రయత్నించగా నీటిపారుదల శాఖ అధికారులు సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. కారణమేమిటని ఆరా తీస్తే.. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పను లు చేయించలేమని చెప్పారు. దాంతో రైతులు బిత్తరపోయారు. తాము చెప్పేవరకు పనులు చేపట్టవద్దని నియోజకవర్గ ప్రజాప్రతినిధి అధికారులను ఆదేశించినట్లు తెలిసి వారంతా అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, చెరువులకు గండ్లు పడి గత ఏడాది పూర్తిగా నష్టపోయాం. గండ్లు పూడుస్తారనే ఆశతో చెరువుల కింద ఆయకట్టులో వరి నాట్లు వేశాం. కానీ ఆ పనులు జరిగే పరిస్థితి కనిపించ క పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. గండ్లు పూడ్చకపోవడంతో వరద నీరు చెరువుల్లో నిలిచే పరిస్థితి లేదు. పైగా భారీవర్షాలు కురిస్తే గండ్ల ద్వారా నీరు మళ్లీ పంటపొలాలను ముంచెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్‌కు మొర పంటలు సాగు చేసే పరిస్థితి లేకపోగా వరద ముప్పు పొంచి ఉండటంతో చెరువుల ఆయకట్టు రైతులు ఇటీవల కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను కలిశారు. గండ్ల పూడ్చివేతకు నిధులు మంజూరైనా రాజకీయ ఒత్తిళ్లతో నీటిపారుదల శాఖ అధికారులు పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదని ఫిర్యాదు చేశారు. వెంటనే పనులు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఆయన స్పందించి నీటిపారుదల శాఖ డీఈతో మాట్లాడారు. వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
పురుగుల మందు పిచికారీపై జాగ్రత్త సుమా..
నవాబుపేట: పంట పొలాలు, తోటల్లో పురుగుల మందు పిచికారీ రైతుల పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంది. ఖరీప్ సీజన్లోనే ఎక్కువగా పురుగుల మందు పిచికారీ ప్రభావంతో రైతులు ఆస్పత్రుల పాలవుతున్నారు. పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. యేటా చాలా మంది రైతులు విష ప్రభావానికి గురవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇటీవల పులుమామిడి, కొజ్జవనంపల్లి, మాదారం గ్రామాల్లో పలువురు రైతులు పురుగు మందు పిచికారీ అనంతరం విష ప్రభావానికి గురై వైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. అందుకని మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. విష ప్రభావం ఇలా.. మందుల పిచికారీ చేసేటప్పుడు చర్మం, నోరు, శ్వాసకోశం, కనుగుడ్ల ద్వారా విషం శరీరంలోకి ప్రవేశించి ప్రమాదం వాటిల్లవచ్చు. విష ప్రభావానికి గురైన వ్యక్తులు తలనొప్పి, అలసట, బలహీనత, తలతిరగడం, చర్మం, కండ్లు మంట కల్గించడం, కనుచూపు మందగించడం, కనుగుడ్డు చిన్నగవడం, స్పృహ తప్పడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. పిచికారీ సమయంలో శరీరంపై మందుపడకుండా నిండా దుస్తులు ధరించకపోవడం, నోటికి అడ్డంగా గుడ్డ కట్టుకోకపోవడం వల్ల, అధిక వేడిలో పిచికారీ చేయడంతో శరీరంపై తెరుచుకున్న స్వేద రంధ్రాల వల్ల విషం శరీరంలోకి చేరుతుంది. శరీరంపై గాయాలుంటే అక్కడ పడిన విషం నేరుగా శరీరంలోకి చేరుతుంది. తద్వారారైతులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రాణాలు సైతం పోయే ప్రమాదాలను తెచ్చుకుంటున్నారు. మందుల పిచికారీపై రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. -
పంట పొలాలు మునుగుతున్నా పట్టించుకోరా?
తాళ్లపాలెం డ్రెయిన్‌పై క్రాస్బండ్కు గండి ఇప్పటికే నిండా మునిగిన రైతులు పాలకులకు చెప్పినా పట్టించుకోని వైనం రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని మచిలీపట్నం : మురుగునీటి పారుదలకు అడ్డంకిగా మారిన తాళ్లపాలెం డ్రెయిన్‌పై ఉన్న క్రాస్బండ్కు సోమవారం రైతులు గండి కొట్టారు. బందరు మండలంలోని బోట్లవానిపాలెం, పల్లెతాళ్లపాలెం మధ్య ఏడు నెలల క్రితం తాళ్లపాలెం డ్రెయిన్‌పై వంతెన నిర్మాణం ప్రారంభించారు. అప్పట్లోనే ఈ వంతెన నిర్మాణం కోసం డ్రెయిన్‌కు క్రాస్‌బండ్ నిర్మించారు. ఏడు నెలలుగా కేవలం పునాదుల పనులు మాత్రమే పూర్తిచేశారు. నెల రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో పొట్లపాలెం, చిరివెళ్లపాలెం, గోకవరం, బొర్రపోతుపాలెం, పిళ్లారిశెట్టిపాలెం, పిల్లనగొల్లపాలెం, తాళ్లపాలెం గ్రామాల్లోని రైతులు వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. వర్షపునీరు దిగువకు చేరడానికి వీలు లేకుండా ఉండటంతో వరినాట్లు పూర్తి చేసిన పొలాలు నీటమునిగి చనిపోయాయి. మంత్రికి చెప్పినా ఫలితం లేదు.. పల్లెతాళ్లపాలెం, తాళ్లపాలెం, చిరివెళ్లపాలెం, బొర్రపోతుపాలెం గ్రామాలకు చెందిన రైతులు ఒకటికి రెండుసార్లు మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు వెళ్లి తాళ్లపాలెం డ్రెయిన్‌పై క్రాస్‌బండ్ అడ్డుగా ఉండటంతో తమ పొలాల్లోని పైర్లు నీటమునిగి చనిపోతున్నాయని విన్నవించారు. ఆదివారం జెడ్పీ సమావేశానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావును కలిసి మరోసారి తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. క్రాస్‌బండ్ తొలగిస్తామని చెప్పటమే తప్ప ఎలాంటి పనులు చేయలేదు. దీంతో రైతులు విషయాన్ని వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) దృష్టికి తీసుకువెళ్లారు. కాంట్రాక్టర్‌కు సర్దిచెప్పినా ససేమీరా.. సోమవారం ఉదయం తాళ్లపాలెం డ్రెయిన్‌పై వంతెన నిర్మిస్తున్న ప్రాంతం వద్దకు నాని, రైతులు వెళ్లారు. క్రాస్‌బండ్ తొలగించాలని కాంట్రాక్టర్‌తో సంప్రదింపులు జరిపారు. అయితే 15 రోజుల వరకు క్రాస్‌బండ్ తొలగించే ప్రసక్తే లేదని కాంట్రాక్టర్ చెప్పటంతో రైతులకు, కాంట్రాక్టర్లకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వేలాది ఎకరాల్లో మురుగునీరు నిలిచిపోయి పైరు చనిపోతోందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న క్రాస్‌బండ్‌ను తొలగించాలని పేర్ని నాని కాంట్రాక్టర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాంట్రాక్టర్ తాను క్రాస్‌బండ్‌ను తొలగించేది లేదని చెప్పటంతో పొక్లెయిన్‌ను తీసుకువచ్చి క్రాస్బండ్కు మధ్యలో గండికొట్టారు. పొక్లెయిన్‌కు మట్టి తవ్వటం సాధ్యపడకపోవటంతో పేర్ని నానితో పాటు రైతులు స్వయంగా గండిలోకి దిగి పారలతో మట్టిని తొలగించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తాళ్లపాలెం డ్రెయిన్ ఆయకట్టు పరిధిలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశామని తెలిపారు. నీరు ఎక్కువ రోజులు పొలాల్లో నిల్వ ఉండిపోవటంతో మొదటి సారి వేసిన పైరు దెబ్బతిందని, మళ్లీ నాట్లు పూర్తి చేశామని, రెండోసారి కూడా పొలాల్లోని పైరు చనిపోయేందుకు సిద్ధంగా ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు పొలాలను ముంచెత్తటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పరిహారం ఇప్పించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. వెఎస్సార్ సీపీ నేత బొర్రా విఠల్, తాళ్లపాలెం సర్పంచి రవిశంకర్, సిరివెళ్లపాలెం మాజీ సర్పంచి బలరాం పాల్గొన్నారు.