
తగలబడుతున్న చెరుకు తోట (ఫైల్)
‘రాజధాని పొలాల్లో మంటలు’ కేసును ప్రభుత్వం నీరుగార్చింది. మూడు రోజుల క్రితం ఈ కేసును క్లోజ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టగానే రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. రాత్రికి రాత్రే రాజధాని ప్రాంతంలో ఆరు చోట్ల పంట పొలాలు, వ్యవసాయ పనిముట్లు తగలబడటంతో ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులే ఈ పని చేయించారని అసత్య ప్రచారం చేయించింది. ఆ తర్వాత రైతులే చేశారంటూ వందలాది మంది రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేసింది. పంట నష్టపోయి కన్నీరుమున్నీరైనవారికి కూడా వేధింపులు తప్పలేదు. వాస్తవానికి రాజధానికి భూములు ఇవ్వని రైతులపై అక్కసుతో అధికార పార్టీకి చెందిన నాయకులే ఈ ఘటనకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నిందితులెవరో తేల్చకుండానే కేసు మూసివేతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం కేసు మూసివేతపై మౌనం వహిస్తున్నారు.
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో 2014, డిసెంబర్ 29న ఆరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో ఉన్న వ్యవసాయ పనిముట్లను తగలబెట్టారు. రెండు రోజుల అనంతరం తుళ్లూరు మండలంలో చెరుకు తోటలకు నిప్పంటించారు. వీటన్నింటికి వైఎస్సార్‌సీపీనే కారణమంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేశారు. అంతేకాకుండా తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారు. తర్వాత రైతులే చేశారంటూ 400 మందికి పైగా రైతులను అదుపులోకి తీసుకున్నారు. మరో 800 మంది రైతుల సెల్‌ఫోన్ల డేటాను తీసి, వారు ఎవరెవరితో మాట్లాడారో వివరాలు సేకరించారు. అంతటితో ఆగకుండా రైతులు మహిళా కూలీలతో ఫోన్‌లో మాట్లాడితే వారినికూడా విచారణ పేరుతో వేధించారు. ఇంత చేసిన పోలీసులు చివరికి నిజమైన నిందితులను పట్టుకోలేక కేసును నీరుగార్చారు. నిజానికి ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి కేసును మూసేయించిందని పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
దోషులను శిక్షించాలి
రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదన్న కోపంతోనే రైతుల పొలాలను ప్రభుత్వం తగలబెట్టించింది. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై బురదచల్లింది. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే దోషులెవరో తేల్చి శిక్షించాలి.
–ఆళ్ల రామకృష్ణారెడ్డి,వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మంగళగిరి
ప్రతిపక్షం, రైతుల పాత్ర లేకపోవడంతోనే..
రాజధానికి రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలను, రైతులను ప్రభుత్వం దోషులుగా చిత్రీకరించింది. తీరా ప్రతిపక్షం, రైతుల పాత్ర లేకపోవడంతో కేసును మూసివేశారు.
–జొన్నా శివశంకరరావు, రైతు సంఘం జిల్లా నాయకుడు
గొంతు నొక్కారు
ఒకసారి ప్రతిపక్షాలు కుట్ర చేశాయని, మరోసారి రైతులే తమ పొలాలకు నిప్పు పెట్టారని కేసులు మోపి, ఏళ్ల తరబడి విచారణ చేస్తూ కేసును నీరుగార్చారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు.
– కంచర్ల కాశయ్య, సీపీఐ నేత
Comments
Please login to add a commentAdd a comment