మన పంట భూముల్లో మట్టి ఎంత సజీవంగా, సారవంతంగా ఉంటుందో మనం తినే ఆహారం కూడా అంత ఆరోగ్యదాయకంగా, సకల పోషకాలతో కూడి ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ సాయిల్ మైక్రో బయాలజిస్ట్, ఎకో సైన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ (చెన్నై) అధినేత డా. సుల్తాన్ ఇస్మాయిల్.
రసాయనిక వ్యవసాయంతో భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహజసిద్ధంగా పెంపొందించడానికి.. భూమి కోతను, భూతాపం పెరుగుదలను అరికట్టడానికి పంట పొలాల్లోకి స్థానిక జాతుల వానపాములను తిరిగి ఆహ్వానించటం అత్యుత్తమ పరిష్కారమని ఆయన చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా నిలిపివేసి.. పశువుల పేడ, మూత్రాలను నీటితో కలిపి పొలంలో పారించడం ద్వారా స్థానిక జాతుల వానపాములను తిరిగి సాదరంగా ఆహ్వానించవచ్చని, భూసారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనంలో ఆయన భూసారం పెంచుకునే మార్గాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
► భూగోళం విస్తీర్ణంలో 75% నీరు, 25% భూమి ఉంది. ఈ భూమిలో సగం మనుషులకు పనికిరాదు. పనికొచ్చే భూమిలో.. 75% భూమి మాత్రమే సాగుయోగ్యమైనది. అంగుళం పైమట్టి(టాప్ సాయిల్) ఏర్పడటానికి 250 ఏళ్లు పడుతుంది. కాబట్టి, మట్టి వానకు గాలికి కొట్టుకుపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.
► భూమిలో 45% ఖనిజాలు, 25% గాలి, 25% నీరు ఉంటాయి. భూమి సారవంతంగా ఉండాలంటే కనీసం 5% సేంద్రియ పదార్థం(ఆర్గానిక్ కార్బన్) ఉండాలి (ఇందులో 80% జీవనద్రవ్యం, 10% వేర్లు, 10% సూక్ష్మజీవరాశి ఉండాలి). కానీ, మన దేశ పంట భూముల్లో సేంద్రియ పదార్థం 0.4% మాత్రమే ఉంది.
► మట్టిలో ఏయే పోషకం ఎంత మోతాదులో ఉన్నదో(సాయిల్ ఫెర్టిలిటీని) చూడటం రసాయనిక ఎరువులు వాడే రైతులకు అవసరం.. అయితే, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు మొత్తంగా నేలతల్లి సమగ్ర ఆరోగ్యాన్ని(సాయిల్ హెల్త్‌ని) కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండాలి.
► నేలపైన పడిన ఎండిన గడ్డీ గాదాన్ని, రాలిన కొమ్మా రెమ్మలను సూక్ష్మజీవులు, చెద పురుగుల సాయంతో కుళ్లింపజేయటం.. విత్తనాలను మాత్రం కుళ్లబెట్టకుండా మొలకెత్తించటం నేలతల్లి విజ్ఞతకు, విచక్షణకు నిదర్శనం.
► వర్మీకంపోస్టు తయారు చేసే టబ్/కంటెయినర్‌కు పైన చిన్న బక్కెట్ వేలాడగట్టి చుక్కలు,చుక్కలుగా నీరు పడేలా ఏర్పాటు చేస్తే.. ఆ టబ్/కంటెయినర్ కిందికి వచ్చే పోషక ద్రవమే వర్మీవాష్. దీన్ని పంటలపై చల్లితే మంచి దిగుబడులు వస్తాయి.
► పెద్ద చెట్టు దగ్గర కర్బన నిల్వలు మెండుగా ఉంటాయి. దగ్గర్లో ఉండే మొక్కలు, చిన్న చెట్ల వేరు వ్యవస్థతో పెద్ద చెట్లు తమ వేరు వ్యవస్థలోని మైసీలియా వంటి శిలీంధ్రాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది. చిన్న చెట్లు బలహీనంగా ఉన్నప్పుడు.. పెద్ద చెట్లు కర్బనాన్ని భూమి లోపలి నుంచే శిలీంద్రాల ద్వారా చిన్న చెట్లకు అందిస్తాయి. రాలిన చెట్ల ఆకుల్లో సకల పోషకాలుంటాయి. వీటిని తిరిగి భూమిలో కలిసేలా చేయాలి. తగులబెట్టకూడదు. ఎండిన ఆకుల్లో కర్బనం ఉంటుంది, ఆకుపచ్చని ఆకుల్లో నత్రజని ఉంటుంది.
► మన దేశంలో 500 జాతుల వానపాములు ఉన్నా.. వీటిలో ముఖ్యమైనవి మూడే స్థానిక జాతులు: భూమి పైనే ఉండేవి, భూమి లోపల ఉంటూ రాత్రిపూట బొరియలు చేసుకుంటూ పైకీ కిందకు తిరిగేవి, భూమి అడుగున ఉండేవి. స్థానిక జాతుల వానపాముల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి పంటలకు వాడొచ్చు. కర్బనంతో కూడిన మట్టిని, పేడను తిని.. దాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో నత్రజనిని జోడించి.. పోషకాలతో కూడిన పదార్థాన్ని వానపాములు విసర్జిస్తాయి.
► నేలపైన ఆవు పేడ కల్లు వేసిన తర్వాత ఆ పేడ చెక్కుచెదరకుండా పిడక మాదిరిగా ఎండిపోతే దాని కింద ఉన్న భూమి నిర్జీవమైపోయిందని గ్రహించాలి. అలా కాకుండా.. పేడ కల్లు చివికినట్లు అయిపోయి, దాని అడుగున బొరియలు ఉంటే.. ఆ భూమి సారవంతంగా ఉన్నదని అర్థం.
► దేశీ జాతుల ఆవులు, ఇతర పశువుల కొట్టం(షెడ్)ను నీటితో కడిగి శుభ్రం చేసినప్పుడు పేడ, మూత్రం కలిసిన నీరు బయటకు వెళ్లిపోతుంది. దీన్ని వృథాగా పోనీయకుండా.. ఒక గుంతలోకి పట్టి ఉంచుకోవాలి. ఈ నీటిని 10%, బోరు నీరు 90% కలిపి పొలానికి పారించాలి. మట్టిలో సూక్ష్మజీవరాశి, వానపాముల సంతతి పెరిగి భూమి సారవంతమవుతుంది.
► రాత్రి వేళల్లో వానపాములు భూమికి బొరియలు చేస్తాయి. ఈ బొరియల ద్వారా వాన నీరు, ప్రాణవాయువు వేర్లకు, భూమిలోపలి జీవరాశికి అందుతాయి.
► బరువైన యంత్రాలు పొలంలో తిరిగితే భూమి చట్టుబడిపోతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములు, ఇతర చిరుజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
► వానపాములు మన పంట భూముల్లో మళ్లీ తారాడేలా చేయటం(రీవార్మింగ్) ద్వారా భూమి ఆరోగ్యాన్ని.. తద్వారా సేంద్రియ ఆహారం ద్వారా మనుషుల, పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పనిలో పనిగా భూతాపాన్ని(గ్లోబల్ వార్మింగ్‌ను) నిలువరించవచ్చు! www.erfindia.org.
సేకరణ: పంతంగి రాంబాబు సాగుబడి డెస్క్
మట్టే మన ఆహారం!
Published Mon, Dec 4 2017 11:59 PM | Last Updated on Tue, Dec 5 2017 8:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment