కోనసీమ పొత్తిళ్లలో పంటలను రూగోస్ తెల్లదోమ చావు దెబ్బ తీస్తోంది. అమెరికా నుంచి కేరళ, తమిళనాడు మీదుగా మన రాష్ట్రంలోకి వచ్చిన ఈ కొత్తరకం తెల్లదోమ పూర్తి పేరు వలయాకారపు తెల్లదోమ లేదా సర్పిలాకార తెల్లదోమ (రుగోస్ స్పైరలింగ్ వైట్‌ఫ్లై). గత ఏడాది నుంచి కొబ్బరి రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల కొబ్బరి తోటలు దీని బారిన పడి విలవిల్లాడుతున్నాయి. గాలి ద్వారా, అంటు మొక్కల ద్వారా వ్యాపించే ఈ తెల్లదోమ అంతటితో ఆగలేదు. ఆయిల్ పామ్, అరటి, మామిడి, కరివేపాకు, జామ తోటలనూ చుట్టేస్తోంది. రామాఫలం, పనస మొక్కలను, కడియం నర్సరీల్లో పూల మొక్కలను సైతం ఆశిస్తోంది. దీన్ని అరికట్టడానికి శాస్త్రవేత్తలు నానా తంటాలు పడుతున్నా అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రసాయనిక పురుగుమందులు వాడితే ఫలితం ఉండకపోగా ప్రతికూల ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. తోటల్లో బదనికలు వదలడం ద్వారా జీవనియంత్రణ పద్ధతులను అవలంబించడమే మార్గమని సూచిస్తున్నారు.
అయితే, తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతు అరుసు అనుభవం భిన్నంగా ఉంది. తమ వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న రసాయనిక సేద్యం జరుగుతున్న తోటలన్నీ తెల్లదోమతో 100% దెబ్బతింటే.. తన చెట్లకు 10%కి మించి నష్టం జరగలేదని పచ్చగా అలరారుతున్నాయని ఆయన తెలిపారు. ఇంతకీ ఆయన విజయరహస్యం ఏమిటి? ఆ వివరాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్, అగ్నిహోత్రంతో కూడిన ప్రకృతి సేద్యమే తన తోట పచ్చగా నిలబడటానికి కారణమని తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతు అరుసు సగర్వంగా చెబుతున్నారు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి 20 కిలోమీటర్ల దూరంలో గల తన గురుకృప గ్రీన్ ఫామ్‌లో మూడు, నాలుగేళ్లుగా ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు అనుబంధంగా ఉన్న వ్యవసాయ విభాగం నిపుణులు ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో రైతులకు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తుంటారు. ఆమె అందించిన సమాచారం ప్రకారం.. అరుసు కొబ్బరి తోట పరిసరాల్లోని ఇతర కొబ్బరి తోటలను రూగోస్ తెల్లదోమ తీవ్రంగా దెబ్బతీసింది. మంగు కారణంగా ఆకులు నల్లగా మారి రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెల్లదోమ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే కొందరు రైతులు కొబ్బరి చెట్లు కొట్టేసి వరి సాగు ప్రారంభించారు. అయితే, పక్కనే ఉన్న అరుసుకు చెందిన కొబ్బరి తోట మాత్రం పచ్చగా అలరారుతోంది. ఈ తోటకు కూడా రూగోస్ తెల్లదోమ సోకింది. అయితే, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నందున నష్టం 10 శాతానికే పరిమితమైందని ఉమమహేశ్వరి తెలిపారు.
అరుసు అనుసరిస్తున్న సాగు పద్ధతి
అరుసు కొబ్బరి చెట్లకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడటం లేదు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. కొబ్బరి చెట్ల మొదళ్లకు చుట్టూ ఎండు ఆకులతో ఆచ్ఛాదన కల్పిస్తున్నారు. చెట్ల మొదళ్లకు దూరంగా చుట్టూ గాడి తీసి నీటితో పాటు 15 రోజులకోసారి జీవామృతం ఇస్తున్నారు. పండ్లు, కూరగాయ తొక్కలను మురగబెట్టి తయారు చేసుకున్న గార్బేజ్ ఎంజైమ్‌ను లీటరుకు 100 లీటర్ల నీరు కలిపి వారానికోసారి పిచికారీ చేస్తున్నారు. ఆవు పేడ పిడకలతో రోజూ అగ్నిహోత్రం నిర్వహిస్తున్నారు. తద్వారా హానికారక వాయువులు తోట దరి చేరకుండా ఉంటాయని ఉమామహేశ్వరి(90004 08907) తెలిపారు.]
జీవామృతం, గార్బేజ్ ఎంజైమే కాపాడుతున్నాయి
ప్రకృతి వ్యవసాయంలో బెంగళూరు తదితర చోట్ల శిక్షణ పొందాను. కొబ్బరి, అరటి తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మూడు, నాలుగేళ్లుగా సాగు చేస్తున్నాను. మా ప్రాంతంలో తెల్లదోమ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నేను మాత్రం జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్‌ను మాత్రమే వాడుతున్నాను. మా పొరుగు తోటల్లో తెల్లదోమ తీవ్రత 100% ఉంటే నా తోటలో కేవలం 10%కి పరిమితమైంది. మా కొబ్బరి చెట్లు చాలా ఆరోగ్యంగా, పచ్చగా కనిపిస్తుండటం చూసి ఈ ప్రాంత రైతులు ఆశ్చర్యపోతున్నారు. జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్‌లే నా తోటను రక్షిస్తున్నాయని నేను భావిస్తున్నాను. తెల్లదోమ ఆశించినప్పటికీ తీవ్రత పది శాతానికి మించి లేదు. చెట్లు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. మా కొబ్బరి చెట్ల ఆకులు ఎండాకాలంలో కూడా రాలిపోవు. ప్రకృతి వ్యవసాయం వల్ల కాయల బరువు కూడా 350 గ్రాముల నుంచి 500 గ్రాములకు పెరిగింది.
అరుసు (97509 29185)
(తమిళంలో మాత్రమే మాట్లాడగలరు), కొబ్బరి రైతు,
పొలాచ్చి,కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు
ఇన్‌పుట్స్: ఎన్. సతీష్‌బాబు, సాక్షి, అమలాపురం
జీవ నియంత్రణే మేలు
►మిత్రపురుగులు
►బదనికలు
►గంజి ద్రావణం
►ఫంగస్
►కొబ్బరి, ఆయిల్‌పామ్, అరటి పంటలలో, ఈ దోమ ఆశించిన తోటల్లో పసుపురంగు జిగురు అట్టలను కట్టాలి. పసుపురంగుకు ఆకర్షించే ఈ పురుగు అట్టలకు అంటుకుని చనిపోతోంది. అట్టలు ఏర్పాటు చేయడం వల్ల పురుగు ఉంటే దాని ఆచూకీని కనిపెట్టే అవకాశముంది.
►పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లార్వా (పిల్ల), ప్యూపా (నిద్రావస్థ) దశలకు సంబంధించి ఎన్‌కార్సియా గ్వడలోపే జాతి బదనికలు తోటల్లో వదలాల్సి ఉంది. తమిళనాడు ప్రాంతం నుంచి అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మిత్రపురుగులను తీసుకు వచ్చి దోమ ఉన్న తోటల్లో వదులుతున్నారు.
►తెల్లదోమ వల్ల వచ్చే మసిమంగు నివారణకు ఒక శాతం గంజి ద్రావణాన్ని మసి ఆశించిన మొక్కలపై భాగాలపై పిచికారీ చేయాలి. లేదా ఉధృతంగా మంచినీటిని ఆకుల మీద పడేలా చేయాలి. ఇలా చేస్తే నల్లని మసిమంగు వదిలిపోతుంది.
►వేప నూనెను ప్రతీ పదిహేను రోజులకు మొక్క ఆకు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాల్సి ఉంది. ఒక్క శాతం వేప నూనెకు పది గ్రాముల డిటర్జెంట్ పౌడరు కలిపి పిచికారీ చేయాల్సి ఉంది.
►వేప నూనెకు ప్రత్యామ్నాయంగా అంబాజీపేట ఉద్యాన పరిశో«ధనా స్థానం ఐసోరియా ఫ్యూమోసోరోసే ఫంగస్‌ను ఆకుపై పిచికారీ చేయాలి. ఈ ఫంగస్‌ను తయారు చేసుకోవడం ఎలాగో రైతులకే నేర్పిస్తున్నాం.
►కొత్తగా డైకోక్రై సా ఆస్టర్ మిత్రపురుగులను తోటల్లో విడుదల చేయాల్సి ఉంది. తెల్లదోమ గుడ్డు, పిల్ల పురుగు దశలో తెల్లదోమను ఈ మిత్రపురుగు తింటుంది.
►దోమ ఆశించిన తోటలు, నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకోకూడదు.
డా. ఎన్.బి.వి.చలపతిరావు (98497 69231),
ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగం), కొబ్బరి
పరిశోధనా కేంద్రం, అంబాజీపేట, తూ.గో. జిల్లా
Comments
Please login to add a commentAdd a comment