నిత్య కృషీవలుడు రోశయ్య, ప్రతి రోజూ దిగుబడి.. దిగుల్లేని బతుకు బండి.., పంటలే ఆయన లోకం..
ఆ రైతు వయసు 73 ఏళ్లు... చేసేది ముప్పాతిక ఎకరం (75 సెంట్లు)లో వ్యవసాయం. ఏడాదికి ఆదాయం అక్షరాలా రూ.1.50 లక్షలపైనే. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ, పాలేకర్ సూచించిన, అయిదు అంతస్తుల సేద్య విధానానికి రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా ఆ వ్యవసాయ క్షేత్రం కొబ్బరి, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలచెట్లతో అడవిని తలపిస్తుంటుంది. నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదన తో అటు ఆరోగ్యం, ఇటు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
రోజువారీ పండ్లు, కూరగాయలు దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేయటమే కాదు, ఆ వయసులోనూ కొబ్బరి చెట్లను అవలీలగా ఎక్కుతూ, గెలలను దింపుతూ, స్వయంగా బజారులో అమ్ముకుంటూ తానే ఒక సైన్యంలా శ్రమిస్తున్నాడు. ఫలితంగానే నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదనతో అటు ఆనందం, ఇటు ఆరోగ్యంతో శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటుతున్నాడు. ఎందరో రైతులకు ఆదర్శంగా జీవిస్తున్నారు. ఆ నిత్య కృషీవలుడు నామని రోశయ్య ఆదర్శ జీవన సేద్యంపై ‘సాగుబడి’ కథనం..
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం అత్తోట.. రోశయ్య స్వస్థలం. ఊరివెలుపల మాగాణి పొలాల్లో గుబురుచెట్లతో అడవిలా కనిపించేదే ఆయన వ్యవసాయక్షేత్రం. చుట్టూ వరి పండించే మాగాణి భూముల మధ్య ఇదొక్కటే మెట్ట చేను. వాస్తవానికి ఒకప్పుడది మాగాణి భూమే. సేద్యాని కనుగుణంగా మెట్టగా మార్చుకున్నారు రోశయ్య. పెద్దల్నుంచి సంక్రమించిన ఆ భూమికి చుట్టూ గట్లపై కొబ్బరి చెట్లు నాటారాయన. వాటిపై వచ్చే ఆదాయంతో ఏటా 10 సెంట్ల చొప్పున మెరక చేసుకుంటూ ఏడెనిమిదేళ్లలో మొత్తం భూమిని మెట్టగా మార్చేసుకుంటూ ఏటా కొన్ని కొబ్బరి చెట్లు నాటుతూ వచ్చారు. వాటితోపాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, దుంప పంటలు, పూలచెట్లతో సహా 23 రకాల మొక్కలు/ చెట్లు కాపునిస్తున్నాయి.
కొబ్బరి సహా 23 రకాల పండ్ల చెట్లు
ప్రస్తుతం రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరిచెట్లు–70, నిమ్మచెట్లు–60, జామచెట్లు–8, సీతాఫలం–20, బత్తాయి–4, నారింజ–1, అరటి– 25, దానిమ్మ–2, ఉసిరి–2, నేరేడు–4, మామిడి–4తో సహా సపోటా, బొప్పాయి, మునగ చెట్లతోపాటు 3 నుంచి 5 సెంట్ల విస్తీర్ణం చొప్పున కంద, బెండ, వంగ వంటి కూరగాయల తోటలున్నాయి. ఒక వరుసలో పసుపు విత్తారు. 10 సెంట్లలో పశువుల మేత పెరుగుతోంది. వావిలి, వేప, నల్లేరు, తులసి, ఆముదం, కుంకుడు, రబ్బరు, ఉమ్మెత్త వంటి ఔషధ మొక్కలు, కొన్నిరకాల పూలమొక్కలు ఉన్నాయి. అంతర పంటల సాగులో రోశయ్య మేటి అనిపించుకుంటున్నారు. మినుము, పెసర, పసుపు, కంద పంటలను మూడునాలుగేళ్ల కాలవ్యవధిలో సాగుచేస్తూ వచ్చారు. మినుము పంట చేతికొచ్చాక, బంతి పూల సాగుకెళతారు. ఆ పంట తర్వాత మళ్లీ అపరాలు, మరోసారి పసుపు సేద్యం, ఇంకోసారి మొక్కజొన్న...ఇలా పంటల వైవిధ్యం పాటిస్తూ ఏడాదిలో 365 రోజులు పంట చేతికొచ్చేలా రూపొందించుకొనే ప్రణాళిక లాభసాటి వ్యాపారి వ్యవహారంలా అనిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం వేసిన నిమ్మతోట ఇప్పుడు బ్రహ్మాండంగా కాపునిస్తోంది. కొబ్బరి చెట్లు ఎత్తు తక్కువ ఉన్నపుడు అరటి ఎక్కువగా సాగుచేశారు. గతేడాది వరకు 20 సెంట్లలో పండించిన పసుపుకు మార్కెట్ ధర ఆశాజనకంగా లేదని ఈ సంవత్సరం విరమించుకున్నారు. ఆ విస్తీర్ణంలో అలోనేరేడు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.
రోజుకు రూ.500 కనీస ఆదాయం..
రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి చెట్లకు 28 ఏళ్ల వయసు. రోజుకు ఒక్కో చెట్టు నుంచి మూడేసి గెలలను దింపుతారు. కొబ్బరి బోండాలను సైకిలుకు కట్టుకుని, అత్తోట గ్రామ సెంటరులో విక్రయిస్తారు. కొబ్బరి బోండాలను విడిగా, సీసాల్లోనూ కోరినవిధంగా ఇస్తారు. అత్తోట, దగ్గర్లోని గ్రామాల్లో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా కొబ్బరి నీళ్లు అవసరమైన వారు నిశ్చయంగా రోశయ్య ఇంటి తలుపుతడతారు. నిమ్మ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి బోండాలతో రూ.400, నిమ్మకాయలతో రూ.100 చొప్పున రోజుకు రూ.500 ఆదాయాన్ని కళ్లచూస్తున్నట్టు రోశయ్య ఒకింత గర్వంగా చెప్పారు. ఏడాదిలో కనీసం 10 నెలలపాటు ఈ రెండింటిపైనే రూ.1.50 లక్షల ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఇతర పండ్లు, కూరగాయలను సొంతానికి వినియోగించుకుంటూ మిగిలినవి మార్కెట్ చేస్తుంటారు రోశయ్య, ఆవిధంగా తన రెక్కల కష్టానికి తగిన ఆదాయాన్ని పొందుతున్నట్టు చెప్పారు. 5 సెంట్ల స్థలంలో వేసిన గజేంద్ర రకం కంద గతేడాది 400 కిలోల దిగుబyì నీ, రూ.6000 ఆదాయాన్నిచ్చింది. 20 సెంట్ల స్థలంలో పసుపు సాగుతో 300 కిలోల ఎండు పసుపు కొమ్ములు వచ్చాయి. దీనితో క్వింటాలు రూ.6,000 చొప్పున రూ.18 వేలకు అమ్మగలిగారు. ఉసిరికాయలపై ఏటా రూ.1,500 వస్తాయి. పచ్చిగడ్డిని ఆవుకు మేతగా వినియోగిస్తున్నారు.
చక చకా కొబ్బరి చెట్లు ఎక్కేస్తున్నారు...
కొబ్బరి చెట్టు ఎక్కడం అంత సులువు కాదని తెలిసిందే. కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు దింపేవారు లేక చాలామంది వాటిని చెట్లకే వదిలేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో వున్నా, కూలీ ఖర్చు ఎక్కువ అడుగుతారు. రోశయ్యకు ఈ ఇబ్బందులేం లేవు సుమా! 73 ఏళ్ల వయసులో కొబ్బరి చెట్టును ఇట్టే ఎక్కేస్తున్నారు. మోకాళ్ల నొప్పి వస్తుందనే భావనతో ఇటీవలే చిన్న నిచ్చెన తెచ్చుకున్నారు. నిచ్చెనతో సగం దూరం వెళ్లాక, అక్కడ్నుంచి కాళ్లకు బంధం తాడు, మొలలో కొడవలి, నోట్లో మోకుతో చెట్టు మొదల్లోకి సునాయాసంగా వెళతారు. ఒక్కో గెలను నరికి, మోకుకు తగిలించి, కిందకు జారవిడుస్తాడు. తర్వాత మరో గెల...మొత్తం పది, పదిహేను నిముషాల్లో కొబ్బరి గెలల దింపుడు పూర్తిచేసి దిగొచ్చాడు.
పాలేకర్ సూచనలతో సేంద్రియంలోకి..
అనుకోకుండా 2008లో ఒకరోజు పాలేకర్ సమావేశాలకు హాజరైన రోశయ్య, అప్పట్నుంచి సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. ప్రకతి వ్యవసాయానికి కీలకమైన ఆవును కొనుగోలు చేశారు. మూడేళ్ల తర్వాత దూడలతో సహా వేరొకరికి లాభానికి విక్రయించారు. మళ్లీ ఒంగోలు జాతి ఆవును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ‘నంది’ని పోలిన రెండు ఆవులను పోషిస్తున్నారు. ఆవు వ్యర్థాలను సేకరించుకొని వాటితో జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నామాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, ఇంగువ ద్రావణం వంటి కషాయాలను సొంతం తయారుచేసుకుని పంటలకు వినియోగిస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, తరచూ ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ రోశయ్య తగిన సలహాలనిస్తున్నారు.
ఐదు అంతస్తుల వ్యవసాయ క్షేత్రం..
పాలేకర్ సూచించిన అయిదు అంతస్తుల సేద్యం లక్ష్యంగా వ్యవసాయం చేస్తున్నట్టు రోశయ్య చెప్పారు. భూమిలోపల దుంప పంటలు, పైన ఎత్తు తక్కువలో కూరగాయలు, తర్వాత నిమ్మ, బొప్పాయి వంటి పంటలు, ఆపైన మామిడి, మునగ వంటివి, చివరగా కొబ్బరి చెట్లతో తన వ్యవసాయక్షేత్రాన్ని ఆ విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. చుట్టూ సరిహద్దులో, మరో వరుసలో కొబ్బరి చెట్లు ఉంటే, మధ్యలో ఒకవైపు కూరగాయలు, దుంప పంటలు, కూరగాయలు పెంచుతున్నారు. మరోవైపు పశుగ్రాసాన్ని సాగుచేస్తున్నారు. మధ్యలో వివిధ రకాల పండ్ల మొక్కలు పెరుగుతూ ఫలాలను అందిస్తున్నాయి.
వ్యవసాయశాఖ ఎన్‌పీఎం దుకాణాన్ని రోశయ్యకు మంజూరు చేశారు. వివిధ రకాల కషాయాలను తయారుచేసి రైతులకు అందించటం రోశయ్య విధి. ప్రస్తుతం ఇది ప్రారంభంలోనే ఉంది. లీటరుకు రూ.2 మిగులుతున్నట్టు చెప్పారు. ‘ఇద్దరు పిల్లలూ సెటిలయ్యారు.. నాకూ ఆ ఇంటామెకు ఈ 75 సెంట్ల క్షేత్రం ఉంచుకున్నాం. ఆరోగ్యకరమైన çపండ్లు, కూరగాయలు పండిస్తున్నాం. మేము తింటూ నలుగురికి అందిస్తున్నాం...ఇంతకన్నా కావాల్సిందేముంది’ అంటూ చిరునవ్వు నవ్వారు రోశయ్య. శారీరక శ్రమ గురించి అడిగితే, కష్టపడితేనే కదా! ఫలితం వచ్చేది’ అంటూ ప్రశ్నించి, నేటి తరానికి రోశయ్య (96665 32921) కర్తవ్య నిర్దేశం చేస్తున్నారు!!
స్వయంగా చెట్టెక్కికొబ్బరి కాయలు దింపుతున్న 73 ఏళ్ల రైతు రోశయ్య, చెట్లకు నిండుగా నిమ్మకాయలు
– బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి
Comments
Please login to add a commentAdd a comment