మిచాంగ్ తుపాను నాటి వరి రకాలను పరీక్షిస్తున్న డా. ఫిల్ లీ
సాగుబడి
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం.
అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు.
అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు.
రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్)
"మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం"
"ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు"
"ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు
‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు.
ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం)
బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉన్నాయి.
తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా..
తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్‌పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్‌పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326.
ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు!
Comments
Please login to add a commentAdd a comment