Vegetable farmer
-
బతుకు పంట!
ఆ రైతు వయసు 73 ఏళ్లు... చేసేది ముప్పాతిక ఎకరం (75 సెంట్లు)లో వ్యవసాయం. ఏడాదికి ఆదాయం అక్షరాలా రూ.1.50 లక్షలపైనే. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ, పాలేకర్ సూచించిన, అయిదు అంతస్తుల సేద్య విధానానికి రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా ఆ వ్యవసాయ క్షేత్రం కొబ్బరి, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలచెట్లతో అడవిని తలపిస్తుంటుంది. నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదన తో అటు ఆరోగ్యం, ఇటు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. రోజువారీ పండ్లు, కూరగాయలు దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేయటమే కాదు, ఆ వయసులోనూ కొబ్బరి చెట్లను అవలీలగా ఎక్కుతూ, గెలలను దింపుతూ, స్వయంగా బజారులో అమ్ముకుంటూ తానే ఒక సైన్యంలా శ్రమిస్తున్నాడు. ఫలితంగానే నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదనతో అటు ఆనందం, ఇటు ఆరోగ్యంతో శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటుతున్నాడు. ఎందరో రైతులకు ఆదర్శంగా జీవిస్తున్నారు. ఆ నిత్య కృషీవలుడు నామని రోశయ్య ఆదర్శ జీవన సేద్యంపై ‘సాగుబడి’ కథనం.. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం అత్తోట.. రోశయ్య స్వస్థలం. ఊరివెలుపల మాగాణి పొలాల్లో గుబురుచెట్లతో అడవిలా కనిపించేదే ఆయన వ్యవసాయక్షేత్రం. చుట్టూ వరి పండించే మాగాణి భూముల మధ్య ఇదొక్కటే మెట్ట చేను. వాస్తవానికి ఒకప్పుడది మాగాణి భూమే. సేద్యాని కనుగుణంగా మెట్టగా మార్చుకున్నారు రోశయ్య. పెద్దల్నుంచి సంక్రమించిన ఆ భూమికి చుట్టూ గట్లపై కొబ్బరి చెట్లు నాటారాయన. వాటిపై వచ్చే ఆదాయంతో ఏటా 10 సెంట్ల చొప్పున మెరక చేసుకుంటూ ఏడెనిమిదేళ్లలో మొత్తం భూమిని మెట్టగా మార్చేసుకుంటూ ఏటా కొన్ని కొబ్బరి చెట్లు నాటుతూ వచ్చారు. వాటితోపాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, దుంప పంటలు, పూలచెట్లతో సహా 23 రకాల మొక్కలు/ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి సహా 23 రకాల పండ్ల చెట్లు ప్రస్తుతం రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరిచెట్లు–70, నిమ్మచెట్లు–60, జామచెట్లు–8, సీతాఫలం–20, బత్తాయి–4, నారింజ–1, అరటి– 25, దానిమ్మ–2, ఉసిరి–2, నేరేడు–4, మామిడి–4తో సహా సపోటా, బొప్పాయి, మునగ చెట్లతోపాటు 3 నుంచి 5 సెంట్ల విస్తీర్ణం చొప్పున కంద, బెండ, వంగ వంటి కూరగాయల తోటలున్నాయి. ఒక వరుసలో పసుపు విత్తారు. 10 సెంట్లలో పశువుల మేత పెరుగుతోంది. వావిలి, వేప, నల్లేరు, తులసి, ఆముదం, కుంకుడు, రబ్బరు, ఉమ్మెత్త వంటి ఔషధ మొక్కలు, కొన్నిరకాల పూలమొక్కలు ఉన్నాయి. అంతర పంటల సాగులో రోశయ్య మేటి అనిపించుకుంటున్నారు. మినుము, పెసర, పసుపు, కంద పంటలను మూడునాలుగేళ్ల కాలవ్యవధిలో సాగుచేస్తూ వచ్చారు. మినుము పంట చేతికొచ్చాక, బంతి పూల సాగుకెళతారు. ఆ పంట తర్వాత మళ్లీ అపరాలు, మరోసారి పసుపు సేద్యం, ఇంకోసారి మొక్కజొన్న...ఇలా పంటల వైవిధ్యం పాటిస్తూ ఏడాదిలో 365 రోజులు పంట చేతికొచ్చేలా రూపొందించుకొనే ప్రణాళిక లాభసాటి వ్యాపారి వ్యవహారంలా అనిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం వేసిన నిమ్మతోట ఇప్పుడు బ్రహ్మాండంగా కాపునిస్తోంది. కొబ్బరి చెట్లు ఎత్తు తక్కువ ఉన్నపుడు అరటి ఎక్కువగా సాగుచేశారు. గతేడాది వరకు 20 సెంట్లలో పండించిన పసుపుకు మార్కెట్ ధర ఆశాజనకంగా లేదని ఈ సంవత్సరం విరమించుకున్నారు. ఆ విస్తీర్ణంలో అలోనేరేడు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. రోజుకు రూ.500 కనీస ఆదాయం.. రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి చెట్లకు 28 ఏళ్ల వయసు. రోజుకు ఒక్కో చెట్టు నుంచి మూడేసి గెలలను దింపుతారు. కొబ్బరి బోండాలను సైకిలుకు కట్టుకుని, అత్తోట గ్రామ సెంటరులో విక్రయిస్తారు. కొబ్బరి బోండాలను విడిగా, సీసాల్లోనూ కోరినవిధంగా ఇస్తారు. అత్తోట, దగ్గర్లోని గ్రామాల్లో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా కొబ్బరి నీళ్లు అవసరమైన వారు నిశ్చయంగా రోశయ్య ఇంటి తలుపుతడతారు. నిమ్మ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి బోండాలతో రూ.400, నిమ్మకాయలతో రూ.100 చొప్పున రోజుకు రూ.500 ఆదాయాన్ని కళ్లచూస్తున్నట్టు రోశయ్య ఒకింత గర్వంగా చెప్పారు. ఏడాదిలో కనీసం 10 నెలలపాటు ఈ రెండింటిపైనే రూ.1.50 లక్షల ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఇతర పండ్లు, కూరగాయలను సొంతానికి వినియోగించుకుంటూ మిగిలినవి మార్కెట్ చేస్తుంటారు రోశయ్య, ఆవిధంగా తన రెక్కల కష్టానికి తగిన ఆదాయాన్ని పొందుతున్నట్టు చెప్పారు. 5 సెంట్ల స్థలంలో వేసిన గజేంద్ర రకం కంద గతేడాది 400 కిలోల దిగుబyì నీ, రూ.6000 ఆదాయాన్నిచ్చింది. 20 సెంట్ల స్థలంలో పసుపు సాగుతో 300 కిలోల ఎండు పసుపు కొమ్ములు వచ్చాయి. దీనితో క్వింటాలు రూ.6,000 చొప్పున రూ.18 వేలకు అమ్మగలిగారు. ఉసిరికాయలపై ఏటా రూ.1,500 వస్తాయి. పచ్చిగడ్డిని ఆవుకు మేతగా వినియోగిస్తున్నారు. చక చకా కొబ్బరి చెట్లు ఎక్కేస్తున్నారు... కొబ్బరి చెట్టు ఎక్కడం అంత సులువు కాదని తెలిసిందే. కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు దింపేవారు లేక చాలామంది వాటిని చెట్లకే వదిలేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో వున్నా, కూలీ ఖర్చు ఎక్కువ అడుగుతారు. రోశయ్యకు ఈ ఇబ్బందులేం లేవు సుమా! 73 ఏళ్ల వయసులో కొబ్బరి చెట్టును ఇట్టే ఎక్కేస్తున్నారు. మోకాళ్ల నొప్పి వస్తుందనే భావనతో ఇటీవలే చిన్న నిచ్చెన తెచ్చుకున్నారు. నిచ్చెనతో సగం దూరం వెళ్లాక, అక్కడ్నుంచి కాళ్లకు బంధం తాడు, మొలలో కొడవలి, నోట్లో మోకుతో చెట్టు మొదల్లోకి సునాయాసంగా వెళతారు. ఒక్కో గెలను నరికి, మోకుకు తగిలించి, కిందకు జారవిడుస్తాడు. తర్వాత మరో గెల...మొత్తం పది, పదిహేను నిముషాల్లో కొబ్బరి గెలల దింపుడు పూర్తిచేసి దిగొచ్చాడు. పాలేకర్ సూచనలతో సేంద్రియంలోకి.. అనుకోకుండా 2008లో ఒకరోజు పాలేకర్ సమావేశాలకు హాజరైన రోశయ్య, అప్పట్నుంచి సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. ప్రకతి వ్యవసాయానికి కీలకమైన ఆవును కొనుగోలు చేశారు. మూడేళ్ల తర్వాత దూడలతో సహా వేరొకరికి లాభానికి విక్రయించారు. మళ్లీ ఒంగోలు జాతి ఆవును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ‘నంది’ని పోలిన రెండు ఆవులను పోషిస్తున్నారు. ఆవు వ్యర్థాలను సేకరించుకొని వాటితో జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నామాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, ఇంగువ ద్రావణం వంటి కషాయాలను సొంతం తయారుచేసుకుని పంటలకు వినియోగిస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, తరచూ ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ రోశయ్య తగిన సలహాలనిస్తున్నారు. ఐదు అంతస్తుల వ్యవసాయ క్షేత్రం.. పాలేకర్ సూచించిన అయిదు అంతస్తుల సేద్యం లక్ష్యంగా వ్యవసాయం చేస్తున్నట్టు రోశయ్య చెప్పారు. భూమిలోపల దుంప పంటలు, పైన ఎత్తు తక్కువలో కూరగాయలు, తర్వాత నిమ్మ, బొప్పాయి వంటి పంటలు, ఆపైన మామిడి, మునగ వంటివి, చివరగా కొబ్బరి చెట్లతో తన వ్యవసాయక్షేత్రాన్ని ఆ విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. చుట్టూ సరిహద్దులో, మరో వరుసలో కొబ్బరి చెట్లు ఉంటే, మధ్యలో ఒకవైపు కూరగాయలు, దుంప పంటలు, కూరగాయలు పెంచుతున్నారు. మరోవైపు పశుగ్రాసాన్ని సాగుచేస్తున్నారు. మధ్యలో వివిధ రకాల పండ్ల మొక్కలు పెరుగుతూ ఫలాలను అందిస్తున్నాయి. వ్యవసాయశాఖ ఎన్‌పీఎం దుకాణాన్ని రోశయ్యకు మంజూరు చేశారు. వివిధ రకాల కషాయాలను తయారుచేసి రైతులకు అందించటం రోశయ్య విధి. ప్రస్తుతం ఇది ప్రారంభంలోనే ఉంది. లీటరుకు రూ.2 మిగులుతున్నట్టు చెప్పారు. ‘ఇద్దరు పిల్లలూ సెటిలయ్యారు.. నాకూ ఆ ఇంటామెకు ఈ 75 సెంట్ల క్షేత్రం ఉంచుకున్నాం. ఆరోగ్యకరమైన çపండ్లు, కూరగాయలు పండిస్తున్నాం. మేము తింటూ నలుగురికి అందిస్తున్నాం...ఇంతకన్నా కావాల్సిందేముంది’ అంటూ చిరునవ్వు నవ్వారు రోశయ్య. శారీరక శ్రమ గురించి అడిగితే, కష్టపడితేనే కదా! ఫలితం వచ్చేది’ అంటూ ప్రశ్నించి, నేటి తరానికి రోశయ్య (96665 32921) కర్తవ్య నిర్దేశం చేస్తున్నారు!! స్వయంగా చెట్టెక్కికొబ్బరి కాయలు దింపుతున్న 73 ఏళ్ల రైతు రోశయ్య, చెట్లకు నిండుగా నిమ్మకాయలు – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
వెజ్ హబ్ కు హ్యాపీ డేస్
♦ కూరగాయల రైతులకు సరికొత్త పథకాలు ♦ నాబార్డు ఆధ్వర్యంలో రూపకల్పన ♦ ‘పందిరి’ సాగుకు ఇతోధిక సాయం ♦ 50 శాతం సబ్సిడీపై యూనిట్ల పంపిణీ ♦ మార్కెటింగ్ సౌకర్యాల కల్పనపై దృష్టి ♦ పెలైట్ ప్రాజెక్ట్‌గా గజ్వేల్, సిద్దిపేట ఎంపిక కూరగాయల రైతులకు మంచిరోజులు రాబో తున్నాయి.. జిల్లాలో సాగు గణనీయంగా పెరుగుతూ ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన తరుణంలో మున్నెన్నడూలేని విధంగా ప్రభుత్వం నాబార్డు ఆధ్వర్యంలో సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు సుమారు 50 శాతం సబ్సిడీపై రుణాలను అందించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. అంతేకాకుండా అగ్రి ప్రొడ్యుసర్స్ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. చిన్న రైతులకూ పాలీహౌస్ పథకాన్ని వర్తింపజేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. -గజ్వేల్ గజ్వేల్: జిల్లాలో ప్రస్తుతం 60 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 20ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సోరకాయ, దొండతోపాటు సాధారణ విధానాల్లో టమాటా, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు ఆకుకూరలు రైతులు సాగు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడే ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకొని ఇక్కడ రిలయన్స్ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సార్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రీయ మార్కెట్లకు కూడా కూరగాయలు ఎగుమతవుతుండటం ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. సరికొత్త పథకాలకు శ్రీకారం... తెలంగాణ ప్రభుత్వం కూరగాయల సాగును విస్తృతంగా పెంచడానికి పాలీహౌస్ పథకాన్ని తీసుకువచ్చింది. కానీ ఈ పథకం పెద్ద రైతులకే లాభసాటిగా ఉంటుందన్న భావ న ఉంది. ఈ అభిప్రాయాన్ని తొలగించడానికి నాబార్డ్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చిన్న రైతులకు సైతం పథకాన్ని వర్తింజేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ జ్వేల్, సిద్దిపేట ప్రాంతాలలో 15కుపైగా దరఖాస్తులను స్వీకరించారు. నాబార్డు ద్వారా చేపట్టే ఈ పథకంలో రైతుకు మార్కెటింగ్ సౌకర్యం సైతం కల్పించనున్నారు. మరోవైపు గజ్వేల్, సి ద్దిపేట నియోజకవర్గాల్లో పందిరి సాగును ప్రో త్సహించాలనుకుంటున్నారు. దీని ఒక్కో యూ నిట్ విలువ రూ. 2.30లక్షలు ఉంది. ఇందులో రైతు రూ. 30వేలు భరించాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 2లక్షలలో లక్ష రూపాయలు సబ్సిడీగా అందజేస్తారు. ఈ పథకం కోసం రెండు నియోజకవర్గాల్లో 400 వరకు దరఖాస్తులను స్వీకరించారు. గజ్వేల్‌కు సంబంధించి 100 దరఖాస్తులను ఫైనల్ చేసి రుణాలు ఇవ్వాలని పట్టణంలోని డీసీసీబీ బ్యాంకుకు పంపించారు. మూడేళ్ల పాటు ఈ పథకం కింద 800 యూ నిట్లు రైతులకు వర్తింపజేయడమే లక్ష్యం. ఇందుకోసం రూ.16 కోట్లు వెచ్చిస్తున్నారు. అగ్రి ప్రొడ్యూసర్స్ కంపెనీల ఏర్పాటుపై దృష్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అగ్రి ప్రొడ్యూసర్స్ కంపెనీల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో 500 నుంచి 1000 మందికి పైగా సభ్యత్వం కల్పించనున్నారు. ఇప్పటికే గజ్వేల్‌లో ఉదయ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకటి ఏర్పాటైంది. అదే తరహాలో జిల్లాలో మరో 18 కంపెనీలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబందించి అనుమతులు కూడా లభించా యి. ఇలా ఏర్పడిన కంపెనీలకు ఎస్‌ఎఫ్‌ఏసీ(స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్ఫీమ్) ఆధ్వర్యంలో ఎలాంటి పూచీకత్తు లేకుండా కోటి రూ పాయల వరకు రుణాలు అందించనున్నారు. ఈ రుణంతో కంపెనీని అభివృద్ధి చేసుకునే అవకాశముంటుంది. ముఖ్యంగా విత్తనాలను స్వయంగా తయారు చేసుకోవడం, తమ ఉత్పత్తులను స్వయంగా అమ్ముకుని గిట్టుబాటు ధర దక్కేలా చూసుకోవడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు. దీంతో పాటు ప్రతి సీజన్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతుల కు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులను నిర్వహి ంచడం తదితర కార్యకలాపాలు చేపడుతారు. ఈ కంపెనీలకు నాబార్డ్ ఆధ్వర్యంలో యేడాది రూ. 3లక్షల చొప్పున మూడేళ్లపాటు గ్రాంట్ కూడా వస్తుంది. కొత్త తరహాలో వెళ్తున్నాం కొత్త తరహాలో పాలీహౌస్, పందిరి పథకాలను అమలు చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే మే ము చేపడుతున్న మిల్క్ గ్రిడ్ పథకానికి మంచి స్పందన ఉంది. అదే తరహాలో ఈ రెండు పథకాలను చేపడుతాం. రైతులకు రుణాలు ఇవ్వడమేగాకుండా నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, మార్కెటింగ్ సౌకర్యాలను అనుసంధానం చేయడం ఈ పథకాల ప్రత్యేకత. అందువల్ల వందశాతం మంచి ఫలితాలు సాధిస్తాం. - రమేశ్‌కుమార్, నాబార్డు ఏజీఎం -
భవిష్యత్ బంగారమే
గజ్వేల్: ఆరుగాలం కష్టపడే కూరగాయల రైతులకు ఇక మంచిరోజులు రాబోతున్నాయి. జిల్లాను ‘వెజిటబుల్ జోన్’గా మార్చాలని ప్రభుత్వం మూడేళ్ల కిందట నిర్ణయించినా, అమలులో నిర్లక్ష్యం అలుముకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. నాబార్డ్ అధ్వర్యంలో చేపట్టనున్న ఈ పథకానికి ఈనెల 11న జరిగిన జిల్లా కన్సల్టెంట్ కమిటీ (డీసీసీ) సమావేశంలో కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణలోనే పెలైట్ ప్రాజెక్ట్‌గా సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు సుమారు 50 శాతం సబ్సిడీపై రుణాలను అందించడమే కాకుండా మార్కెటింగ్ అవకాశాలు కల్పించనున్నారు. కార్పొరేట్ కంపెనీల రాకతో పెరిగిన సాగు ఒకప్పుడు కూరగాయలు పండించాలంటే రైతులు జంకే పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్తే కనీసం రవాణా చార్జీలు సైతం గిట్టుబాటుకాని దుస్థితి. దీంతో కూరగాయల సాగు తగ్గింది. అయితేఆరేళ్లలో పరిస్థితులు కాస్త మారాయి. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకుని ఇక్కడ రిలయన్స్ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో కూరగాయల సాగు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలో ప్రస్తుతం 35 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 15ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సొరకాయ, దొండతోపాటు సాధారణ విధానాల్లో టమాటా, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు ఆకుకూరలను జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. విన్నవించినా.. పట్టించుకోలేదు గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రీయ మార్కెట్లకు కూడా కూరగాయలు ఎగుమతవుతుండటం ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. అందువల్లే మూడేళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ వెజిటబుల్ జోన్‌గా మార్చి మరింత చేయూతనివ్వాలని, దీని ద్వారా కూరగాయల సాగు అభివృద్ధి చెందుతుందని రైతుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తొగుట, నంగునూరు, సిద్దిపేట, దుబ్బాక, చిన్నకోడూరు, చేగుంట, దౌల్తాబాద్, శివ్వంపేట, నర్సాపూర్, జిన్నారం, సంగారెడ్డితో పాటు మరో నాలుగు మండలాలను వెజిటబుల్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. కొత్తసర్కార్..సరికొత్త పథకం కూరగాయల రైతుల ఇబ్బందులపై దృష్టిసారించిన టీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘నాబార్డ్’ అధ్వర్యంలో ఈ పథకానికి రూప కల్పన చేస్తోంది. ఈ నెల 11న జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షతన జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ కమిటీ(డీసీసీ) సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు. తొలిదశలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. నియోజకవర్గంలోని సుమారు నాలుగు గ్రామాల్లో ప్రప్రథమంగా 200 మంది వరకు కూరగాయల రైతులను ఎంపిక చేసి వారికి ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల బ్యాంకు రుణం అందిస్తారు. సుమారు 50 శాతం వరకు సబ్సీడీ రైతుకు వర్తించేలా చేస్తున్నారు. అంతటితో సరిపెట్టకుండా రైతుకు మార్కెటింగ్ సౌకర్యాలను సైతం కల్పించనున్నారు. గజ్వేల్‌లో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన తర్వాత జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు వర్తింపజేయనున్నారు.