వెజ్ హబ్ కు హ్యాపీ డేస్
♦ కూరగాయల రైతులకు సరికొత్త పథకాలు
♦ నాబార్డు ఆధ్వర్యంలో రూపకల్పన
♦ ‘పందిరి’ సాగుకు ఇతోధిక సాయం
♦ 50 శాతం సబ్సిడీపై యూనిట్ల పంపిణీ
♦ మార్కెటింగ్ సౌకర్యాల కల్పనపై దృష్టి
♦ పెలైట్ ప్రాజెక్ట్‌గా గజ్వేల్, సిద్దిపేట ఎంపిక
కూరగాయల రైతులకు మంచిరోజులు రాబో తున్నాయి.. జిల్లాలో సాగు గణనీయంగా పెరుగుతూ ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన తరుణంలో మున్నెన్నడూలేని విధంగా ప్రభుత్వం నాబార్డు ఆధ్వర్యంలో సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు సుమారు 50 శాతం సబ్సిడీపై రుణాలను అందించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. అంతేకాకుండా అగ్రి ప్రొడ్యుసర్స్ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. చిన్న రైతులకూ పాలీహౌస్ పథకాన్ని వర్తింపజేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. -గజ్వేల్
గజ్వేల్: జిల్లాలో ప్రస్తుతం 60 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 20ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సోరకాయ, దొండతోపాటు సాధారణ విధానాల్లో టమాటా, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు ఆకుకూరలు రైతులు సాగు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడే ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకొని ఇక్కడ రిలయన్స్‌ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సార్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రీయ మార్కెట్‌లకు కూడా కూరగాయలు ఎగుమతవుతుండటం ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది.
సరికొత్త పథకాలకు శ్రీకారం...
తెలంగాణ ప్రభుత్వం కూరగాయల సాగును విస్తృతంగా పెంచడానికి పాలీహౌస్ పథకాన్ని తీసుకువచ్చింది. కానీ ఈ పథకం పెద్ద రైతులకే లాభసాటిగా ఉంటుందన్న భావ న ఉంది. ఈ అభిప్రాయాన్ని తొలగించడానికి నాబార్డ్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చిన్న రైతులకు సైతం పథకాన్ని వర్తింజేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ జ్వేల్, సిద్దిపేట ప్రాంతాలలో 15కుపైగా దరఖాస్తులను స్వీకరించారు. నాబార్డు ద్వారా చేపట్టే ఈ పథకంలో రైతుకు మార్కెటింగ్ సౌకర్యం సైతం కల్పించనున్నారు. మరోవైపు గజ్వేల్, సి ద్దిపేట నియోజకవర్గాల్లో పందిరి సాగును ప్రో త్సహించాలనుకుంటున్నారు. దీని ఒక్కో యూ నిట్ విలువ రూ. 2.30లక్షలు ఉంది. ఇందులో రైతు రూ. 30వేలు భరించాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 2లక్షలలో లక్ష రూపాయలు సబ్సిడీగా అందజేస్తారు. ఈ పథకం కోసం రెండు నియోజకవర్గాల్లో 400 వరకు దరఖాస్తులను స్వీకరించారు. గజ్వేల్‌కు సంబంధించి 100 దరఖాస్తులను ఫైనల్ చేసి రుణాలు ఇవ్వాలని పట్టణంలోని డీసీసీబీ బ్యాంకుకు పంపించారు. మూడేళ్ల పాటు ఈ పథకం కింద 800 యూ నిట్లు రైతులకు వర్తింపజేయడమే లక్ష్యం. ఇందుకోసం రూ.16 కోట్లు వెచ్చిస్తున్నారు.
అగ్రి ప్రొడ్యూసర్స్ కంపెనీల ఏర్పాటుపై దృష్టి
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అగ్రి ప్రొడ్యూసర్స్ కంపెనీల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో 500 నుంచి 1000 మందికి పైగా సభ్యత్వం కల్పించనున్నారు. ఇప్పటికే గజ్వేల్‌లో ఉదయ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకటి ఏర్పాటైంది. అదే తరహాలో జిల్లాలో మరో 18 కంపెనీలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబందించి అనుమతులు కూడా లభించా యి. ఇలా ఏర్పడిన కంపెనీలకు ఎస్‌ఎఫ్‌ఏసీ(స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్ఫీమ్) ఆధ్వర్యంలో ఎలాంటి పూచీకత్తు లేకుండా కోటి రూ పాయల వరకు రుణాలు అందించనున్నారు. ఈ రుణంతో కంపెనీని అభివృద్ధి చేసుకునే అవకాశముంటుంది. ముఖ్యంగా విత్తనాలను స్వయంగా తయారు చేసుకోవడం, తమ ఉత్పత్తులను స్వయంగా అమ్ముకుని గిట్టుబాటు ధర దక్కేలా చూసుకోవడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు. దీంతో పాటు ప్రతి సీజన్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతుల కు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులను నిర్వహి ంచడం తదితర కార్యకలాపాలు చేపడుతారు. ఈ కంపెనీలకు నాబార్డ్ ఆధ్వర్యంలో యేడాది రూ. 3లక్షల చొప్పున మూడేళ్లపాటు గ్రాంట్ కూడా వస్తుంది.
కొత్త తరహాలో వెళ్తున్నాం
కొత్త తరహాలో పాలీహౌస్, పందిరి పథకాలను అమలు చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే మే ము చేపడుతున్న మిల్క్ గ్రిడ్ పథకానికి మంచి స్పందన ఉంది. అదే తరహాలో ఈ రెండు పథకాలను చేపడుతాం. రైతులకు రుణాలు ఇవ్వడమేగాకుండా నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, మార్కెటింగ్ సౌకర్యాలను అనుసంధానం చేయడం ఈ పథకాల ప్రత్యేకత. అందువల్ల వందశాతం మంచి ఫలితాలు సాధిస్తాం. - రమేశ్‌కుమార్, నాబార్డు ఏజీఎం