vegetable hub
-
మాడి మసై..
♦ ఎండల ధాటికి ‘వెజిటబుల్ హబ్’ విలవిల ♦ గణనీయంగా పడిపోయిన కూరగాయల ఉత్పత్తులు ♦ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రీయ మార్కెట్లకు తప్పని ఇబ్బందులు ♦ జిల్లాలో రూ.200 కోట్లకుపైగా పంట నష్టం భానుడి భగభగలకు కూరగాయ తోటలు మాడి మసైపోతున్నాయి. దిగుబడు లు లేక రైతన్న డీలా పడ్డాడు. ఉత్పత్తులు రాక మార్కెట్లు బోసిపోయాయి. ఎండ దెబ్బకు ‘వెజిటబుల్ హబ్’కు జబ్బు చేసింది. గత వేసవిలో నిత్యం 800 క్వింటాళ్ల కాంటా వేస్తే ఇప్పుడు 300 క్వింటాళ్లు కూడా వేయని పరిస్థితి. 60వేల హెక్టార్ల సాగుతో జంటనగరాలకే కాకుండా ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు వంటి మార్కెట్లకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. సూర్యప్రతాపానికి తీవ్రంగా నష్టపోయిన రైతన్న విలవిల్లాడుతున్నాడు. గజ్వేల్ జిల్లాలో ప్రస్తుతం 60 వేల హెక్టార్లలో కూరగాయలు సాగవుతున్నాయి. ఆరేళ్ల కిందట కేవలం 10 వేల హెక్టార్లకే పరిమితం కాగా ప్రస్తుతం ఐదింతలు పెరిగింది. దీంతో జిల్లా ప్రస్తుతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. గతంలో మార్కెటింగ్ సౌకర్యాలు లేక అతి తక్కువ విస్తీర్ణంలో పండించారు. మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రధాన సాగు ఇక్కడే... ప్రధానంగా గజ్వేల్, ములుగు, వర్గల్, జిన్నారం, పటాన్చెరు, కొండాపూర్, సదాశివపేట, సిద్దిపేట, చిన్నకోడూరు, జహీరాబాద్, నారాయణఖేడ్, రేగోడ్ మండలాల్లో కూరగాయల సాగు అత్యధికంగా కనిపిస్తున్నది. ఆయా మండలాల్లో టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లిగడ్డ, బీన్స్, ఆలుతోపాటు పందిరి రకాలు బీర, కాకర, సొర, చిక్కుడు వంటి రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఎగుమతి ఇలా.. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వందలాది టన్నులు కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, మిర్యాలగూడ, ఖమ్మం, హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర రాష్ట్రీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. నెలకు రూ.200కోట్లకుపైగా టర్నోవర్ జరుగుతున్నట్లు అంచనా. పెరుగుతోన్న జనాభా అవసరాలకు కూరగాయలు అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధాన సంస్థలు.... గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను ఎంచుకొని ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సార్, ఐటీసీ వంటి భారీ సంస్థలు కూరగాయల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాయి. నాణ్యమైన ఉత్పత్తులకు మంచి ధరను అందిస్తూ రైతుల్లో పోటీతత్వాన్ని పెంచాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులను తమ తమ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచీల ద్వారా అమ్మకాలను సాగిస్తున్నాయి. ఎండ దెబ్బతో... మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో కూరగాయల ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. దీంతో ప్రైవేట్ కంపెనీలు కలెక్షన్ సెంటర్లు సైతం వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం కూరగాయల దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో జిల్లావ్యాప్తంగా రైతులకు దాదాపు రూ.200 కోట్లకుపైగా నష్టం వాటిల్లునట్టు ప్రాథమిక అంచనా. నష్టపోయిన తీరు ఇలా... ములుగు మండలం మర్కుక్ గ్రామానికి చెంది న కొత్త రామకృష్ణారెడ్డికి ఐదెకరాల భూమి ఉంది. 3 బోరుబావులున్నాయి. భూగర్భజలా లు గణనీయంగా పడిపోవడంతో బోరుబావు ల్లో నీరు సక్రమంగా రావడం లేదు. వేసవిలో ఆరుతడిగా ఎకరా విస్తీర్ణంలో మిర్చి, అర ఎకరంలో బుడమ, అర ఎకరంలో టమాటా, మరో అర ఎకరంలో స్వీట్‌కార్న్ సాగు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పె ట్టాడు. పరిస్థితులు కలిసొస్తే మిర్చి 50 క్వింటాళ్లకుపైగా దిగుబడి రావాలి. కానీ నీరు అందక కేవలం 15 క్వింటాళ్లే వచ్చింది. బుడమకాయ 10 టన్నుల కు కేవలం 5 క్వింటాళ్లకే పరిమితమైంది. టమాటా 18 క్వింటాళ్లకుపైగా దిగుబడి రావాల్సి రెండు క్వింటాళ్లే వచ్చింది. స్వీట్‌కార్న్ కూడా దెబ్బతింది. నాలుగు పంటలు కలుపుకుని కేవలం ఆ రైతుకు రూ.25 వేలు మాత్రమే చేతికందగా పెట్టుబడి నష్టపోయాడు. ఈ సమస్య ఒక్క రామకృష్ణారెడ్డిదే కాదు... కూరగాయలు పండిస్తున్న ప్రతి రైతుది. ఉత్పత్తులు పడిపోయిన తీరు... ములుగు మండలం వంటిమామిడి కూరగాయ ల మార్కెట్ యార్డుకు గజ్వేల్, ములుగు, వర్గ ల్, జగదేవ్‌పూర్, కొండపాక, తూప్రాన్ మండలాలే కాకుండా రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి నిత్యం టన్నుల కొద్దీ కూరగాయలు వస్తుంటాయి. సీజన్లో 1,500నుంచి రెండు వేల క్వింటాళ్ల వరకు కాంటా జరుగుతుం ది. అన్‌సీజన్‌లో అయితే (వేసవిలో) 800 క్విం టాళ్ల కాంటా వేస్తారు. గతేడాది ఇదే సమయానికి రోజుకు 600 నుంచి 800 క్వింటాళ్ల కాంటా వేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. ఈ సారి 300నుంచి 400 క్వింటాళ్ల కాంటా కూడా కావటం లేదని యార్డు సిబ్బంది తెలిపారు. దీన్నిబట్టి ఉత్పత్తులు ఎలా పడిపోయాయో స్పష్టమవుతోంది. ప్రత్యేకించి జంటనగరాలకే కాకుండా రాష్ట్రీయ మార్కెట్లకూ ఆధారమైన ఈ ప్రాంతంలో ఉత్పత్తులు పడిపోవడం.... ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో ఆయా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఇదే అదనుగా పక్క రాష్ట్రాలను నుంచి కూరగాయలు వస్తుండగా... ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. దయనీయ పరిస్థితి.. ఎండ తీవ్రత కారణంగా జిల్లాలో కూరగాయల ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. జిల్లాపై ఆధారపడిన రాష్ట్రీయ మార్కెట్లకూ ఇబ్బంది తప్పడంలేదు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తాం. - రామలక్ష్మి, ఉద్యానశాఖ డీడీ -
వెజ్ హబ్ కు హ్యాపీ డేస్
♦ కూరగాయల రైతులకు సరికొత్త పథకాలు ♦ నాబార్డు ఆధ్వర్యంలో రూపకల్పన ♦ ‘పందిరి’ సాగుకు ఇతోధిక సాయం ♦ 50 శాతం సబ్సిడీపై యూనిట్ల పంపిణీ ♦ మార్కెటింగ్ సౌకర్యాల కల్పనపై దృష్టి ♦ పెలైట్ ప్రాజెక్ట్‌గా గజ్వేల్, సిద్దిపేట ఎంపిక కూరగాయల రైతులకు మంచిరోజులు రాబో తున్నాయి.. జిల్లాలో సాగు గణనీయంగా పెరుగుతూ ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన తరుణంలో మున్నెన్నడూలేని విధంగా ప్రభుత్వం నాబార్డు ఆధ్వర్యంలో సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు సుమారు 50 శాతం సబ్సిడీపై రుణాలను అందించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. అంతేకాకుండా అగ్రి ప్రొడ్యుసర్స్ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. చిన్న రైతులకూ పాలీహౌస్ పథకాన్ని వర్తింపజేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. -గజ్వేల్ గజ్వేల్: జిల్లాలో ప్రస్తుతం 60 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 20ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సోరకాయ, దొండతోపాటు సాధారణ విధానాల్లో టమాటా, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు ఆకుకూరలు రైతులు సాగు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడే ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకొని ఇక్కడ రిలయన్స్ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సార్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రీయ మార్కెట్లకు కూడా కూరగాయలు ఎగుమతవుతుండటం ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. సరికొత్త పథకాలకు శ్రీకారం... తెలంగాణ ప్రభుత్వం కూరగాయల సాగును విస్తృతంగా పెంచడానికి పాలీహౌస్ పథకాన్ని తీసుకువచ్చింది. కానీ ఈ పథకం పెద్ద రైతులకే లాభసాటిగా ఉంటుందన్న భావ న ఉంది. ఈ అభిప్రాయాన్ని తొలగించడానికి నాబార్డ్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చిన్న రైతులకు సైతం పథకాన్ని వర్తింజేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ జ్వేల్, సిద్దిపేట ప్రాంతాలలో 15కుపైగా దరఖాస్తులను స్వీకరించారు. నాబార్డు ద్వారా చేపట్టే ఈ పథకంలో రైతుకు మార్కెటింగ్ సౌకర్యం సైతం కల్పించనున్నారు. మరోవైపు గజ్వేల్, సి ద్దిపేట నియోజకవర్గాల్లో పందిరి సాగును ప్రో త్సహించాలనుకుంటున్నారు. దీని ఒక్కో యూ నిట్ విలువ రూ. 2.30లక్షలు ఉంది. ఇందులో రైతు రూ. 30వేలు భరించాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 2లక్షలలో లక్ష రూపాయలు సబ్సిడీగా అందజేస్తారు. ఈ పథకం కోసం రెండు నియోజకవర్గాల్లో 400 వరకు దరఖాస్తులను స్వీకరించారు. గజ్వేల్‌కు సంబంధించి 100 దరఖాస్తులను ఫైనల్ చేసి రుణాలు ఇవ్వాలని పట్టణంలోని డీసీసీబీ బ్యాంకుకు పంపించారు. మూడేళ్ల పాటు ఈ పథకం కింద 800 యూ నిట్లు రైతులకు వర్తింపజేయడమే లక్ష్యం. ఇందుకోసం రూ.16 కోట్లు వెచ్చిస్తున్నారు. అగ్రి ప్రొడ్యూసర్స్ కంపెనీల ఏర్పాటుపై దృష్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అగ్రి ప్రొడ్యూసర్స్ కంపెనీల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో 500 నుంచి 1000 మందికి పైగా సభ్యత్వం కల్పించనున్నారు. ఇప్పటికే గజ్వేల్‌లో ఉదయ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకటి ఏర్పాటైంది. అదే తరహాలో జిల్లాలో మరో 18 కంపెనీలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబందించి అనుమతులు కూడా లభించా యి. ఇలా ఏర్పడిన కంపెనీలకు ఎస్‌ఎఫ్‌ఏసీ(స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్ఫీమ్) ఆధ్వర్యంలో ఎలాంటి పూచీకత్తు లేకుండా కోటి రూ పాయల వరకు రుణాలు అందించనున్నారు. ఈ రుణంతో కంపెనీని అభివృద్ధి చేసుకునే అవకాశముంటుంది. ముఖ్యంగా విత్తనాలను స్వయంగా తయారు చేసుకోవడం, తమ ఉత్పత్తులను స్వయంగా అమ్ముకుని గిట్టుబాటు ధర దక్కేలా చూసుకోవడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు. దీంతో పాటు ప్రతి సీజన్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతుల కు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులను నిర్వహి ంచడం తదితర కార్యకలాపాలు చేపడుతారు. ఈ కంపెనీలకు నాబార్డ్ ఆధ్వర్యంలో యేడాది రూ. 3లక్షల చొప్పున మూడేళ్లపాటు గ్రాంట్ కూడా వస్తుంది. కొత్త తరహాలో వెళ్తున్నాం కొత్త తరహాలో పాలీహౌస్, పందిరి పథకాలను అమలు చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే మే ము చేపడుతున్న మిల్క్ గ్రిడ్ పథకానికి మంచి స్పందన ఉంది. అదే తరహాలో ఈ రెండు పథకాలను చేపడుతాం. రైతులకు రుణాలు ఇవ్వడమేగాకుండా నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, మార్కెటింగ్ సౌకర్యాలను అనుసంధానం చేయడం ఈ పథకాల ప్రత్యేకత. అందువల్ల వందశాతం మంచి ఫలితాలు సాధిస్తాం. - రమేశ్‌కుమార్, నాబార్డు ఏజీఎం -
గజ్వేల్.. భిన్నత్వం జిగేల్
గజ్వేల్ అంటే ఓ ఉద్యమం, ఓ కళ, ఓ సంస్కృతి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం. రాజధానికి సమీపంలోని పట్టణం. సర్వజనుల సమ్మేళనంతో సరికొత్త హంగులు సంతరించుకుంటోంది. వెనుకబడిన ప్రాంతమన్న ఒకనాటి మాటను పక్కనపెట్టి అభివృద్ధిలో దూసుకుపోతోంది. కళ, సంస్కృతుల కలబోతగా ప్రజా ఉద్యమాల ఊపిరిగా వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. భిన్న సంస్కృతులకు నెలవై, వైవిధ్యభరిత ప్రాంతంగా గజ్వేల్ వర్ధిల్లుతోంది. ఆది నుంచి ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తోంది. ప్రత్యేకించి కళలకు కోటగా వెలుగొందుతోంది. ఈ రంగంలో ప్రపంచస్థాయి ఖ్యాతి గడించిన వారు ఈ ప్రాంతీయులే కావడం విశేషం. ఈ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్ మండలాలను తన ఒడిలో ఇముడ్చుకోనుంది. ఇప్పటికే ఇక్కడ నగర వాతావరణం విస్తరిస్తోంది. దేశంలో ఉన్న అన్ని రకాల మతాలు, విభిన్న సంస్కృతులు కలిగిన వారు ఇక్కడ నివసించడం మరో విశేషం.ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న గజ్వేల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఇలాకా’గా అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ కొత్త హంగులను సంతరించుకోబోతోంది. ఈ ప్రాంత విశేషాలపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం. - గజ్వేల్ * కళలు, సంస్కృతుల సమ్మేళనం * ప్రజా ఉద్యమాలకు ఊపిరి * వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజవర్గం వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దున ఉంది. అందువల్ల ఈ మూడు జిల్లాల సంస్కృతి ఈ ప్రాంతంలో విస్తరించింది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ కూడా నగర వాతావరణం కనిపిస్తుంది. దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తుంది. ప్రత్యేకించి ప్రత్యేక రాష్ట్ర ప్రజాస్వామిక ఆకాంక్షతో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం పోషించిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. 1969లో జరిగిన కాల్పుల్లో పట్టణానికి చెందిన అయిల నర్సింలు ఆసువులు బాశాడు. ఉద్యమంలో భాగంగా గజ్వేల్‌లోని చౌరస్తా వద్ద విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో కాల్పులు జరిగాయి. ఇందులో పన్నెండేళ్ల వయసున్న ఆ బాలుడు తూటాలకు బలైపోయాడు. ఈ సందర్భంగా మరో విద్యార్థి సైతం గాయపడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘అయిల నర్సింలు’ రక్తంతో తడిసిన ఈ నేల ప్రతి దఫా పోరాటంలోనూ అదే స్ఫూర్తిని కనబరిచింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనచేసిన కేంద్రం వెనక్కి తగ్గిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఉద్యమాలు జరిగాయి. ఇందులో భాగంగానే 2010 జనవరిలో అప్పటి ఎమ్మెల్యే నర్సారెడ్డి కేంద్రం తీరును నిరసిస్తూ ఆమరణ దీక్షను చేపట్టారు. ఈ దీక్ష ముగిసిన తర్వాత టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి సైతం ఆమరణ దీక్షకు పూనుకున్నారు. అంతేకాకుండా ప్రజా, ఉద్యోగ సంఘాలు పోరాటంలో తలమునకలయ్యాయి. ప్రతి నిరసనలోనూ భాగస్వాములై ప్రజాస్వామిక ఆకాంక్షను చాటాయి. తెలంగాణే కాదు ఇతర ప్రజా ఉద్యమాలు సైతం ఇక్కడ ఉవ్వెత్తున సాగాయి. కేసీఆర్ ‘ఇలాకా’గా ఆవిర్భావం అణువణువునా తెలంగాణ స్ఫూర్తిని నింపుకున్న గజ్వేల్ చివరకు కేసీఆర్ సొంత నియోజకవర్గంగా మారటం యాదృశ్చికంగా జరిగిపోయింది. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకున్న కేసీఆర్ ఊహించిన విధంగానే తెలంగాణవాదాన్ని మరింతగా చాటిచెప్పి ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ఈ ప్రాంతాన్ని తన సొంత ‘ఇలాకా’గా మార్చుకున్నారు. నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులో ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే దిశలో టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలకు సంబంధించి ఇక్కడి నుంచే వ్యూహ రచన చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పునర్నిర్మాణం పేరిట చేపట్టబోతున్న కొత్త తరహా అభివృద్ధికి కూడా గజ్వేల్ కేంద్ర బిందువుగా మారడం విశేషం. కేసీఆర్ ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే బంగారు తునకగా మారుస్తానని ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టి ఈ ప్రాంతంపైనే కేంద్రీకృతమై ఉంది. కళలకు నెలవు ప్రజాగాయకునిగా ప్రపంచస్థాయి గుర్తింపును పొందిన గద్దర్‌కు జన్మనిచ్చింది ఈ ప్రాంతమే. నియోజకవర్గంలోని తూప్రాన్‌లో జన్మించిన ఆయన పీడితుల గొంతుకగా మారి ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచారు. తన అసమాన ప్రతిభతో సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన బి. నర్సింగరావుది గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామం. ‘మా భూమి, దాసి, రంగుల కల’ వంటి చిత్రాలతో ఆయన సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. వీరిద్దరే కాకుండా ఈ ప్రాంతానికి చెందిన పలువురు వర్ధమాన కవులు, కళకారులు తమదైన ప్రతిభను చాటుతున్నారు. భిన్న సంస్కృతుల నిలయం గజ్వేల్ నియోజకవర్గం భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. నియోజకవర్గంలోని కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలో దేశంలో ఉన్న వివిధ మతస్తులు, సంప్రదాయాలు కలిగిన వారు నివాసముంటున్నారు. ఇక్కడ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ములుగు మండలంలోని గంగాపూర్‌కు ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో సుమారు 60కిపైగా సిక్కుల కుటుంబాలున్నాయి. వీరి కుటుంబాల్లో ఎక్కువమంది దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరి సేవలందించడం విశేషం. ఇదిలా ఉంటే గజ్వేల్ పట్టణంలో గుజరాతీలు, కేరళవాసులు పెద్ద ఎత్తున స్థిర పడ్డారు. కేరళ వాసులు జరుపుకునే ‘ఓనమ్ ఉత్సవాలు’ ఇక్కడ ప్రతిఏటా ఘనంగా జరుగుతాయి. గుజరాతీలు సైతం తమ సంప్రదాయ పండుగలను జరుపుకుంటారు. వీరంతా ఇక్కడి ప్రజలతో ఆత్మీయుల్లా కలిసిపోయారు. పర్యాటక ప్రదేశంగా గుర్తింపు గజ్వేల్ పర్యాటక ప్రదేశంగానూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. వర్గల్‌లోని విద్యాసరస్వతి ఆలయం తెలంగాణలో బాసర తర్వాత రెండో ఆలయంగా, ఇదే మండలంలోని నాచారంగుట్ట రెండో యాదగిరి గుట్టగా బాసిల్లుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలకు జంటనగరాలే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్లది జంట గ్రామాల బంధం భౌగోళికంగా కలిసిపోయిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ గ్రామాలు ‘హైదరాబాద్-సికింద్రాబాద్’ మాదిరిగా విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాయి. మూడేళ్ల క్రితం ఆవిర్భవించిన గజ్వేల్ నగర పంచాయతీకి గజ్వేల్-ప్రజ్ఞాపూర్గా నామకరణం చేయడం ఈ రెండు గ్రామాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. గజ్వేల్‌ను నగర పంచాయతీగా మార్చిన నేపథ్యంలో చరిత్ర కలిగిన తమ గ్రామం పేరును సైతం నగర పంచాయతీలో చేర్చాలని ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు 2012 ఫిబ్రవరి నెలలో దీక్షలు చేపట్టగా ప్రభుత్వం వారి దీక్షల ఫలితంగా నగర పంచాయతీని గజ్వేల్-ప్రజ్ఞాపూర్గా నామకరణం చేసింది. 19 ఏళ్ల క్రితం బస్సుడిపో విషయంలోనూ ఇదే రకమైనా ఆందోళనలు జరగడంతో డిపోను అప్పట్లో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి రాష్ట్ర మంత్రి గీతారెడ్డి దీనిని గజ్వేల్-ప్రజ్ఞాపూర్గా నామకరణం చేయించారు. అదే ఆనవాయితీ నేడు నగర పంచాయతీ విషయంలో ఉత్పన్నమైంది. ‘వెజిటెబుల్ హబ్’గా అవతరణ గణనీయమైన కూరగాయల సాగుతో గజ్వేల్ నియోజకవర్గం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ఇక్కడి పండించిన కూరగాయలే జంటనగరాలకు ఆధారం. ఇక్కడ పండించిన కూరగాయలు సేకరించడానికి ఇక్కడ వివిధ మల్టినేషనల్ కంపెనీల కలెక్షన్ సెంటర్లు వెలిశాయి. ప్రభుత్వ పరంగా ములుగు మండలం వంటిమామిడిలో కూరగాయాల మార్కెట్ ఏర్పాటైంది. ఇక్కడి నుంచి జంట నగరాలకే కాకుండా ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు మండల కేంద్రంలోని అటవీ పరిశోధనా కేంద్రంలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. దీంతోపాటు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఫారేస్ట్రీ కళాశాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు సంస్థల ఏర్పాటుతో ఈ ప్రాంత స్వరూపమే మారనుంది. -
రైతుకు ఊతం
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గాన్ని డెయిరీ, వెజిటబుల్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇందుకోసం తొలిదశలో రూ.50 కోట్లకుపైగా నిధులు వెచ్చించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. రైతుకు ఊతమిచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాగం, అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాలను అమలుచేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నెలాఖరు వరకు డెయిరీకి సంబంధించిన పథకాన్ని గజ్వేల్‌లో ప్రారంభించనున్నారు. నవంబర్ మొదటి వారంలో కూరగాయల అభివృద్ధి పథకానికి అంకురార్పణ జరుగనుంది. ఇందుకు సంబంధించి శనివారం స్థానిక ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, నాబార్డ్ ఏజీఎం రమేశ్‌కుమార్‌తోపాటు బ్యాంకర్లు, హార్టికల్చర్, పశసంవర్థకశాఖతో పాటు వివిధ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాబార్డ్ ఏజీఎం రమేశ్‌కుమార్ మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మూడేళ్లలో నాబార్డు కింద 5 వేల యూనిట్ల డెయిరీ పథకాలను వర్తింపజేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఒక్కో యూనిట్ విలువ (రెండు ఆవులు) రూ.1.2 లక్షలు ఉంటుందని చెప్పారు. ఇందుకోసం బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే సాధారణ రైతులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3 శాతం సబ్సీడీ ఉంటుం దని తెలిపారు. ప్రస్తుతం నియోజవర్గంలో 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తవుతుండగా, దాన్ని లక్ష లీటర్లకు పెంచడమే లక్ష్యమన్నారు. ఈ నెలాఖరున ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలిదశలో రెండువేల యూనిట్లను రైతులకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అంతేకాకుండా పందిరి విధానంలో కూరగాయల సాగుకు రూ.2 లక్షల వరకు రుణం అందించనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల మొదటివారంలో తొలిదశలో 200 మందికి ఒక్కో యూనిట్ చొప్పున వర్తింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి ఉద్యానవనశాఖ 50 శాతం సబ్సీడీ అంటే రూ.1 లక్ష అందిస్తుందని వివరించారు. రైతులకు ఈ రెండు పథకాలను వర్తింపజేయడమే కాకుండా మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. -
‘వెజిటబుల్ హబ్’కు వర్షం దెబ్బ
గజ్వేల్, న్యూస్‌లైన్: గణనీయమైన కూరగాయల సాగుతో ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన జిల్లాలో తూపాన్ భారీ నష్టాన్ని కలిగించింది. జిల్లాలో సుమారు 4 వేల హెక్టార్లలో కూరగాయల పంటలు దెబ్బతినగా ఇందులో గజ్వేల్ నియోజకవర్గంలోనే వెయ్యి హెక్టార్లలో పంటలు ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తోంది. వర్షం కారణంగా రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. పంటలు భారీగా దెబ్బతినడంతో ఈ ప్రాంతంపై ఆధారపడిన హైదరాబాద్‌తోపాటు రాష్ట్రీయ మార్కెట్లకు భారీగా ఎగుమతులు తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరవాసుల అవసరాలకు జిల్లానే ప్రధాన వనరుగా మారింది. ఇక్కడ ఉత్పత్తులు తగ్గితే నగరంలో జనం అల్లాడే పరిస్థితి నెలకొనడంలో అతిశయోక్తి కాదు. గజ్వేల్, ములుగు, వర్గల్, జిన్నారం, కొండాపూర్, పటాన్చెరు, చిన్నకోడూరు, నంగునూరు తదితర మండలాల్లో ప్రతి ఏటా 20 వేల హెక్టార్లలో కూరగాయలు సాగవుతున్నాయి. కాగా ఇక్కడి నుంచి హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతోపాటు చెన్నై, తదితర ప్రధాన కేంద్రాలకు కూరగాయలను తీసుకెళ్తారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను ఎంచుకొని ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీలాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాయి. నాణ్యమైన ఉత్పత్తులకు మంచి ధరను అందిస్తూ రైతుల్లో పోటీతత్వాన్ని పెంచాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులను తమ తమ కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచీల ద్వారా అమ్మకాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం వంటిమామిడిలో తెలంగాణలోనే అతిపెద్దదైన కూరగాయలు, పండ్ల మార్కెట్ యార్డును ప్రారంభించడం కూరగాయల సాగుకు పరిస్థితి మరింత అనుకూలంగా మారింది. భారీగా నష్టం ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం ధాటికి చేలల్లోనే టమాటా, బీర, ఆలుగడ్డ, బీన్స్, ఉల్లిగడ్డ, గోబీ తదితర కూరగాయలు తోటల్లోనే కుళ్లిపోయాయి. 4 వేల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా హెక్టారుకు 40 వేలకుపైగా నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతుండగా ఈ లెక్కన నష్టం రూ. 16 కోట్ల ఉంటుందని తెలుస్తోంది. ఉద్యానవన శాఖ మాత్రం రూ.3.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ శాఖ జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ శేఖర్ తెలిపారు. రైతులకు నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. పడిపోయిన ఎగుమతులు కూరగాయల పంటలు దెబ్బతినడం వల్ల ఇక్కడి నుంచి ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ యార్డులో, ప్రైవేట్ కలెక్షన్ సెంటర్లలో సేకరణ గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు. ఎగుమతులు పడిపోయిన కారణంగా ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.