గజ్వేల్.. భిన్నత్వం జిగేల్
గజ్వేల్ అంటే ఓ ఉద్యమం, ఓ కళ, ఓ సంస్కృతి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం. రాజధానికి సమీపంలోని పట్టణం. సర్వజనుల సమ్మేళనంతో సరికొత్త హంగులు సంతరించుకుంటోంది. వెనుకబడిన ప్రాంతమన్న ఒకనాటి మాటను పక్కనపెట్టి అభివృద్ధిలో దూసుకుపోతోంది. కళ, సంస్కృతుల కలబోతగా ప్రజా ఉద్యమాల ఊపిరిగా వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంటోంది.
భిన్న సంస్కృతులకు నెలవై, వైవిధ్యభరిత ప్రాంతంగా గజ్వేల్ వర్ధిల్లుతోంది. ఆది నుంచి ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తోంది. ప్రత్యేకించి కళలకు కోటగా వెలుగొందుతోంది. ఈ రంగంలో ప్రపంచస్థాయి ఖ్యాతి గడించిన వారు ఈ ప్రాంతీయులే కావడం విశేషం.
ఈ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్ మండలాలను తన ఒడిలో ఇముడ్చుకోనుంది. ఇప్పటికే ఇక్కడ నగర వాతావరణం విస్తరిస్తోంది. దేశంలో ఉన్న అన్ని రకాల మతాలు, విభిన్న సంస్కృతులు కలిగిన వారు ఇక్కడ నివసించడం మరో విశేషం.ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న గజ్వేల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఇలాకా’గా అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ కొత్త హంగులను సంతరించుకోబోతోంది. ఈ ప్రాంత విశేషాలపై
‘సాక్షి’ సండే స్పెషల్ కథనం. - గజ్వేల్
* కళలు, సంస్కృతుల సమ్మేళనం
* ప్రజా ఉద్యమాలకు ఊపిరి
* వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు
గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజవర్గం వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దున ఉంది. అందువల్ల ఈ మూడు జిల్లాల సంస్కృతి ఈ ప్రాంతంలో విస్తరించింది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ కూడా నగర వాతావరణం కనిపిస్తుంది. దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తుంది. ప్రత్యేకించి ప్రత్యేక రాష్ట్ర ప్రజాస్వామిక ఆకాంక్షతో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం పోషించిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది.
1969లో జరిగిన కాల్పుల్లో పట్టణానికి చెందిన అయిల నర్సింలు ఆసువులు బాశాడు. ఉద్యమంలో భాగంగా గజ్వేల్‌లోని చౌరస్తా వద్ద విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో కాల్పులు జరిగాయి. ఇందులో పన్నెండేళ్ల వయసున్న ఆ బాలుడు తూటాలకు బలైపోయాడు. ఈ సందర్భంగా మరో విద్యార్థి సైతం గాయపడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘అయిల నర్సింలు’ రక్తంతో తడిసిన ఈ నేల ప్రతి దఫా పోరాటంలోనూ అదే స్ఫూర్తిని కనబరిచింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనచేసిన కేంద్రం వెనక్కి తగ్గిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఉద్యమాలు జరిగాయి.
ఇందులో భాగంగానే 2010 జనవరిలో అప్పటి ఎమ్మెల్యే నర్సారెడ్డి కేంద్రం తీరును నిరసిస్తూ ఆమరణ దీక్షను చేపట్టారు. ఈ దీక్ష ముగిసిన తర్వాత టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి సైతం ఆమరణ దీక్షకు పూనుకున్నారు. అంతేకాకుండా ప్రజా, ఉద్యోగ సంఘాలు పోరాటంలో తలమునకలయ్యాయి. ప్రతి నిరసనలోనూ భాగస్వాములై ప్రజాస్వామిక ఆకాంక్షను చాటాయి. తెలంగాణే కాదు ఇతర ప్రజా ఉద్యమాలు సైతం ఇక్కడ ఉవ్వెత్తున సాగాయి.
కేసీఆర్ ‘ఇలాకా’గా ఆవిర్భావం
అణువణువునా తెలంగాణ స్ఫూర్తిని నింపుకున్న గజ్వేల్ చివరకు కేసీఆర్ సొంత నియోజకవర్గంగా మారటం యాదృశ్చికంగా జరిగిపోయింది. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకున్న కేసీఆర్ ఊహించిన విధంగానే తెలంగాణవాదాన్ని మరింతగా చాటిచెప్పి ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ఈ ప్రాంతాన్ని తన సొంత ‘ఇలాకా’గా మార్చుకున్నారు. నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులో ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే దిశలో టీఆర్‌ఎస్ చేపట్టిన ఉద్యమాలకు సంబంధించి ఇక్కడి నుంచే వ్యూహ రచన చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పునర్నిర్మాణం పేరిట చేపట్టబోతున్న కొత్త తరహా అభివృద్ధికి కూడా గజ్వేల్ కేంద్ర బిందువుగా మారడం విశేషం. కేసీఆర్ ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే బంగారు తునకగా మారుస్తానని ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టి ఈ ప్రాంతంపైనే కేంద్రీకృతమై ఉంది.
కళలకు నెలవు
ప్రజాగాయకునిగా ప్రపంచస్థాయి గుర్తింపును పొందిన గద్దర్‌కు జన్మనిచ్చింది ఈ ప్రాంతమే. నియోజకవర్గంలోని తూప్రాన్‌లో జన్మించిన ఆయన పీడితుల గొంతుకగా మారి ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచారు. తన అసమాన ప్రతిభతో సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన బి. నర్సింగరావుది గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామం. ‘మా భూమి, దాసి, రంగుల కల’ వంటి చిత్రాలతో ఆయన సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. వీరిద్దరే కాకుండా ఈ ప్రాంతానికి చెందిన పలువురు వర్ధమాన కవులు, కళకారులు తమదైన ప్రతిభను చాటుతున్నారు.
భిన్న సంస్కృతుల నిలయం
గజ్వేల్ నియోజకవర్గం భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. నియోజకవర్గంలోని కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలో దేశంలో ఉన్న వివిధ మతస్తులు, సంప్రదాయాలు కలిగిన వారు నివాసముంటున్నారు. ఇక్కడ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ములుగు మండలంలోని గంగాపూర్‌కు ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో సుమారు 60కిపైగా సిక్కుల కుటుంబాలున్నాయి. వీరి కుటుంబాల్లో ఎక్కువమంది దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరి సేవలందించడం విశేషం. ఇదిలా ఉంటే గజ్వేల్ పట్టణంలో గుజరాతీలు, కేరళవాసులు పెద్ద ఎత్తున స్థిర పడ్డారు. కేరళ వాసులు జరుపుకునే ‘ఓనమ్ ఉత్సవాలు’ ఇక్కడ ప్రతిఏటా ఘనంగా జరుగుతాయి. గుజరాతీలు సైతం తమ సంప్రదాయ పండుగలను జరుపుకుంటారు. వీరంతా ఇక్కడి ప్రజలతో ఆత్మీయుల్లా కలిసిపోయారు.
పర్యాటక ప్రదేశంగా గుర్తింపు
గజ్వేల్ పర్యాటక ప్రదేశంగానూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. వర్గల్‌లోని విద్యాసరస్వతి ఆలయం తెలంగాణలో బాసర తర్వాత రెండో ఆలయంగా, ఇదే మండలంలోని నాచారంగుట్ట రెండో యాదగిరి గుట్టగా బాసిల్లుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలకు జంటనగరాలే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లది జంట గ్రామాల బంధం
భౌగోళికంగా కలిసిపోయిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ గ్రామాలు ‘హైదరాబాద్-సికింద్రాబాద్’ మాదిరిగా విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాయి. మూడేళ్ల క్రితం ఆవిర్భవించిన గజ్వేల్ నగర పంచాయతీకి గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌గా నామకరణం చేయడం ఈ రెండు గ్రామాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. గజ్వేల్‌ను నగర పంచాయతీగా మార్చిన నేపథ్యంలో చరిత్ర కలిగిన తమ గ్రామం పేరును సైతం నగర పంచాయతీలో చేర్చాలని ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు 2012 ఫిబ్రవరి నెలలో దీక్షలు చేపట్టగా ప్రభుత్వం వారి దీక్షల ఫలితంగా నగర పంచాయతీని గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌గా నామకరణం చేసింది. 19 ఏళ్ల క్రితం బస్సుడిపో విషయంలోనూ ఇదే రకమైనా ఆందోళనలు జరగడంతో డిపోను అప్పట్లో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి రాష్ట్ర మంత్రి గీతారెడ్డి దీనిని గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌గా నామకరణం చేయించారు. అదే ఆనవాయితీ నేడు నగర పంచాయతీ విషయంలో ఉత్పన్నమైంది.
‘వెజిటెబుల్ హబ్’గా అవతరణ
గణనీయమైన కూరగాయల సాగుతో గజ్వేల్ నియోజకవర్గం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ఇక్కడి పండించిన కూరగాయలే జంటనగరాలకు ఆధారం. ఇక్కడ పండించిన కూరగాయలు సేకరించడానికి ఇక్కడ వివిధ మల్టినేషనల్ కంపెనీల కలెక్షన్ సెంటర్‌లు వెలిశాయి. ప్రభుత్వ పరంగా ములుగు మండలం వంటిమామిడిలో కూరగాయాల మార్కెట్ ఏర్పాటైంది. ఇక్కడి నుంచి జంట నగరాలకే కాకుండా ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.
ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు మండల కేంద్రంలోని అటవీ పరిశోధనా కేంద్రంలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. దీంతోపాటు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఫారేస్ట్రీ కళాశాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు సంస్థల ఏర్పాటుతో ఈ ప్రాంత స్వరూపమే మారనుంది.