సాక్షి, గజ్వేల్ : తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వందకు పైగా సీట్లు గెలవబోతుందని, ఇది తన సర్వేనని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దొంగ సర్వేలు చాలా వస్తున్నాయని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. గజ్వేల్‌లో గెలిచిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు. బుధవారం గజ్వేల్‌లో జరిగిన ప్రజాశీర్వాద సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను బానిస కానియ్యనన్నారు. సుదీర్ఘ పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని, రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవమానాలు భరించామన్నారు.
దుఃఖం లేని తెలంగాణ నా ఆశ..
‘నాలుగేళ్లుగా తెలంగాణ పాలన ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. దుఃఖం లేని తెలంగాణ నా ఆశ.. ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలి. కృష్టానదిలో నీళ్లు లేవంటే కాంగ్రెస్ నేతలు గొర్రెల్లా తలలు ఊపుతున్నారు. గోదావరి నీళ్లు పంచుకుందామని చంద్రబాబు మాయమాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ దెబ్బకొడితే చంద్రబాబు కరకట్టకు చేరుకున్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు అవినీతి సొమ్మును తెలంగాణకు తరలించారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లను అడ్డుకుంది చంద్రబాబే. మరోసారి అవకాశమివ్వండి.. తెలంగాణను బానిసను కానివ్వను. ఏడు మండలాలను, సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నది చంద్రబాబు కాదా? విభజన చట్టంలో కేటాయించిన విద్యుత్ వాటా కూడా తెలంగాకు ఇవ్వలేదు. కింద సెగపెట్టి.. తలపై చేయి పెట్టే రకం చంద్రబాబు. తెలంగాణలో తన చేతిలో ఉండే కీలుబొమ్మ ప్రభుత్వం రావాలిని ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ గెలిస్తే కాలేశ్వరం.. కోటి ఎకరాలకు సాగునీరు వస్తుంది. కూటమి గెలిస్తే చంద్రబాబు శనేశ్వరం వస్తుంది. కాలేశ్వరం కావాలా.? శనేశ్వరం.. కావాలా.?’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment