గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గాన్ని డెయిరీ, వెజిటబుల్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇందుకోసం తొలిదశలో రూ.50 కోట్లకుపైగా నిధులు వెచ్చించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. రైతుకు ఊతమిచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాగం, అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాలను అమలుచేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నెలాఖరు వరకు డెయిరీకి సంబంధించిన పథకాన్ని గజ్వేల్‌లో ప్రారంభించనున్నారు. నవంబర్ మొదటి వారంలో కూరగాయల అభివృద్ధి పథకానికి అంకురార్పణ జరుగనుంది.
ఇందుకు సంబంధించి శనివారం స్థానిక ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, నాబార్డ్ ఏజీఎం రమేశ్‌కుమార్‌తోపాటు బ్యాంకర్లు, హార్టికల్చర్, పశసంవర్థకశాఖతో పాటు వివిధ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాబార్డ్ ఏజీఎం రమేశ్‌కుమార్ మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మూడేళ్లలో నాబార్డు కింద 5 వేల యూనిట్ల డెయిరీ పథకాలను వర్తింపజేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ఒక్కో యూనిట్ విలువ (రెండు ఆవులు) రూ.1.2 లక్షలు ఉంటుందని చెప్పారు. ఇందుకోసం బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే సాధారణ రైతులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3 శాతం సబ్సీడీ ఉంటుం దని తెలిపారు. ప్రస్తుతం నియోజవర్గంలో 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తవుతుండగా, దాన్ని లక్ష లీటర్లకు పెంచడమే లక్ష్యమన్నారు. ఈ నెలాఖరున ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలిదశలో రెండువేల యూనిట్లను రైతులకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
అంతేకాకుండా పందిరి విధానంలో కూరగాయల సాగుకు రూ.2 లక్షల వరకు రుణం అందించనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల మొదటివారంలో తొలిదశలో 200 మందికి ఒక్కో యూనిట్ చొప్పున వర్తింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి ఉద్యానవనశాఖ 50 శాతం సబ్సీడీ అంటే రూ.1 లక్ష అందిస్తుందని వివరించారు. రైతులకు ఈ రెండు పథకాలను వర్తింపజేయడమే కాకుండా మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
రైతుకు ఊతం
Published Sat, Oct 18 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement
Advertisement