GAJWEL Area Development Authority
-
ఈ భూమి మనదిరో...
‘ఊరు మనదిరో, ఈ వాడ మనదిరో, పలుగు మనదిరో, ఆ పార మనదిరో, దొర ఏందిరో, వారి పీకుడేందిరో’ అంటూ ప్రభుత్వ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకోడానికి విప్లవ సినిమాల్లో పేదవర్గాలు ఎర్రజెండాలతో దండుగా వెండితెరపై కదుల్తుంటే వారికి మద్దతుగా ప్రేక్షకులు ఈలలు, కరతాళ ధ్వనులతో హోరెత్తించడం చూశాం. కానీ పాలనాపగ్గాలు టీడీపీ చేపట్టిన తరువాత పాట పల్లవిలో అపశ్రుతి చోటుచేసుకున్నట్టుంది. కనిపించిన ప్రభుత్వ భూమంతా మాదేనన్న చందంగా కొంతమంది నేతలు తమ అనుచరులతో దర్జాగా కబ్జా చేస్తూ ‘పోలీసెవడురో, రెవెన్యూ పితలాటమేందిరో’ అంటూ పలుగు, పారా కాదు ఏకంగా పొక్లెయిన్లు, జేసీబీలతో చదును చేసేసుకుంటున్నారు. ఇదేదీ అర్థంకాని సామాన్య జనం మాత్రం ‘ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నవాళ్లదే ప్రభుత్వ భూమా’ అని అమాయకంగా ప్రశ్నిస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డుకోవల్సిన సర్కారు యంత్రాంగం మాత్రం ఈలలు, కరతాళ ధ్వనులతో మద్దతు బహిరంగంగా తెలపకపోయినా అంతర్గతంగా అంతకన్నా ఎక్కువగానే వత్తాసు పలుకుతోందని పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడ్లూరు: ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా అడ్డుకోవల్సిన రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న రెండు గ్రామాల్లో గత పది రోజుల నుంచి జేసీబీలతో చదును చేస్తున్నా చలనం లేదాయే. మండలంలోని జానకంపేట గ్రామంలో సర్వే నెంబర్లు 603-48 వరకు రోడ్డు పక్కనే 200 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఎకరా విలువ సుమారు రూ. 5 లక్షలు వరకూ ఉంటుంది. చనలాటరఫి, జానకంపేట గ్రామాలకు చెందిన రాజకీయ నాయుకుల కన్ను ఆ భూములపై పడింది. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఆ భూములు వైపు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకంటున్నారు. గత పది రోజులు నుంచి రాత్రీపగలనకుండా జేసీబీలను పెట్టి చె ట్లను తొలిగించి ఆక్రమణలకు పాల్పడుతున్నా పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. ఆ భూముల్లో సిమెంటు స్తంభాలు, ఇనుప కంచెలతో ‘హద్దులు’ మీరుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టడానికి అడుగులు వేయకపోవడం వెనుక మతలబేమిటని పరిసర గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వారంతా ఆక్రమిస్తే లేనిది మాకేంటంటూ అప్పటి వరకు కబ్జాకు దూరంగా ఉన్న చిన్నా, చితకా గ్రామస్థాయి నేతలు కూడా పలుగు, పార పట్టుకొని గ్రామ కంఠాలనూ తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. ఓ గ్రామ నాయుకుడు ఏకంగా 40 ఎకరాలను ఆక్రమించుకొని చుట్టూ కంచె కూడా వేయించాడంటే ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిరుపేదలు గూడు కోసం కర్రలు పాతుకుంటే చాలు విరుచుపడే రెవెన్యూ యంత్రాంగం కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమవుతున్నా అడ్డుకోకపోవడం పట్ల పలు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికే 500 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లో ఉండగా తాజాగా మరో 200 ఎకరాలు వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంటోంది. నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని నరసాపురం గ్రామంలో కూడా పెద్దపవని-కావలి ప్రధాన రహదారి పక్కనే ఉన్న సర్వే నెంబరు 104 ఎద్దులబీడులో ఉన్న సుమారు 200 ఎకరాల భూములు కూడా జేసీబీలతో దున్ని ఆక్రమించుకోవాడానికి గ్రామానికి చెందిన నాయుకులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ తంతు రెండు నెలల నుంచి జరుగుతోంది. ఇక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగానిది ఇదే పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోతే జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. చర్యలు తీసుకుంటాం ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములుపై తహశీల్థార్ మెర్సీ కుమారిని వివరణ కోరగా ఆ గ్రామాలకు వెళ్ళి ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆక్రమణదారులపై కూడా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
గజ్వేల్ రోడ్లకు మహర్దశ
రూ.173కోట్లు విడుదల చేసిన సీఎం గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లకు ఇక మహర్దశ పట్టనుంది. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోని రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.173.3 కోట్లను విడుదల చేశారు. గతేడాది నవంబర్ 30న జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించిన సీఎం...ఇచ్చిన మాట ప్రకారం నిధులను విడుదల చేశారు. ఈ విషయాన్ని గురువారం రాత్రి ‘గడా’(గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు ధృవీకరించారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని 65 కొత్త సింగిల్ రోడ్ల నిర్మాణం కోసం రూ.88.20 కోట్లు, 95.94 కిలోమీటర్ల డబుల్ రోడ్ల కోసం రూ.84.83 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కేసీఆర్ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇప్పటివరకు సీఎం చొరవతో నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ. 589 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. -
రీ షెడ్యూల్‌పై అన్నదాతల ఆగ్రహం
గజ్వేల్: రుణాల రీ-షెడ్యూల్‌కు బ్యాంక్ మేనేజర్ సహకరించడం లేదంటూ పలువురు రైతులు ప్రజ్ఞాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మేనేజర్‌ను నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని అక్కారం, కోనాపూర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు రైతులు 2013 ఏప్రిల్ నుంచి అక్టోబర్‌లోపు రుణాలను రెన్యూవల్ చేసి ప్రస్తుతం రీ-షెడ్యూల్‌కు అర్హత సాధించారు. అయినా ప్రజ్ఞాపూర్ బ్యాంక్ మేనేజర్ రీ-షెడ్యూల్ చేయకుండా రెన్యూవల్ మాత్రం చేసి అతితక్కువ రుణం మాత్రమే ఇస్తానని చెప్పడంతో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. రీ-షెడ్యూల్ ఎందుకు చేయవంటూ నిలదీశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏఈఓ కృష్ణవేణి, తహశీల్దార్ బాల్‌రెడ్డి, పోలీసులు బ్యాంక్ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు. ఈ విషయం ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు దృష్టికి వెళ్లడంతో ఆయన గ్రామీణవికాస్ బ్యాంక్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఫలితంగా మేనేజర్‌కు రుణాలు రీ-షెడ్యూల్ చేయాలని ఫోన్లో ఆదేశాలు వచ్చాయి. దీంతో రీ-షెడ్యూల్ ప్రక్రియ చేపడతామని, గత కొన్ని రోజుల క్రితం రీ-షెడ్యూల్‌కు అర్హత వున్నా... రెన్యూవల్ చేయించుకున్నవారికి కూడా న్యాయం చేస్తామని మేనేజర్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
రైతుకు ఊతం
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గాన్ని డెయిరీ, వెజిటబుల్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇందుకోసం తొలిదశలో రూ.50 కోట్లకుపైగా నిధులు వెచ్చించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. రైతుకు ఊతమిచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాగం, అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాలను అమలుచేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నెలాఖరు వరకు డెయిరీకి సంబంధించిన పథకాన్ని గజ్వేల్‌లో ప్రారంభించనున్నారు. నవంబర్ మొదటి వారంలో కూరగాయల అభివృద్ధి పథకానికి అంకురార్పణ జరుగనుంది. ఇందుకు సంబంధించి శనివారం స్థానిక ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, నాబార్డ్ ఏజీఎం రమేశ్‌కుమార్‌తోపాటు బ్యాంకర్లు, హార్టికల్చర్, పశసంవర్థకశాఖతో పాటు వివిధ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాబార్డ్ ఏజీఎం రమేశ్‌కుమార్ మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మూడేళ్లలో నాబార్డు కింద 5 వేల యూనిట్ల డెయిరీ పథకాలను వర్తింపజేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఒక్కో యూనిట్ విలువ (రెండు ఆవులు) రూ.1.2 లక్షలు ఉంటుందని చెప్పారు. ఇందుకోసం బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే సాధారణ రైతులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3 శాతం సబ్సీడీ ఉంటుం దని తెలిపారు. ప్రస్తుతం నియోజవర్గంలో 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తవుతుండగా, దాన్ని లక్ష లీటర్లకు పెంచడమే లక్ష్యమన్నారు. ఈ నెలాఖరున ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలిదశలో రెండువేల యూనిట్లను రైతులకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అంతేకాకుండా పందిరి విధానంలో కూరగాయల సాగుకు రూ.2 లక్షల వరకు రుణం అందించనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల మొదటివారంలో తొలిదశలో 200 మందికి ఒక్కో యూనిట్ చొప్పున వర్తింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి ఉద్యానవనశాఖ 50 శాతం సబ్సీడీ అంటే రూ.1 లక్ష అందిస్తుందని వివరించారు. రైతులకు ఈ రెండు పథకాలను వర్తింపజేయడమే కాకుండా మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. -
‘నగర పాలన’పై ఆరా
గజ్వేల్: నగర పంచాయతీ పాలన తీరుపై ‘బాబోయ్ ఇదేం నగర పాలన’ శీర్షికన శనివారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనం సంచలనం సృష్టించింది. ప్రధానంగా ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో దళారుల ప్రమేయం, జాప్యం, పన్నుల పెరుగుదల తదితర అంశాలను వివరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ పేషీ ఆరాతీయడమే కాకుండా.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు శనివారం పట్టణంలోని తన కార్యాలయంలో నగర పంచాయతీకి చెందిన అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణ అనుమతి కోసం ఎవరు ధరఖాస్తు చేసుకున్నా వారంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఏదేని కారణంతో అనుమతిని ఇవ్వకపోతే...సంబంధిత నిర్మాణాదారులకు కారణాలను వివరిస్తూ నోటీసు అందజేయాలని సూచించారు. అలాకాకుండా అవకతవకలకు పాల్పడితే ఊరుకునేదిలేదన్నారు. ఇదిలావుంటే నగర పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నుంచి ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాక్స్‌ను వారానికోసారి తెరిచి ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, జాప్యం చేసినా నిర్మాణాదారులు నేరుగా తన దృష్టికి తీసుకువస్తే..బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముగ్గురు అధికారులపై ఫిర్యాదులు... నగర పంచాయతీలో కీలకమైన ముగ్గురు అధికారులపై శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావుకు మెజార్టీ కౌన్సిలర్లు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. ఆ ముగ్గురు అవకతవకలకు పాల్పడటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వివరించారని తెలిసింది.