‘ఊరు మనదిరో, ఈ వాడ మనదిరో, పలుగు మనదిరో, ఆ పార మనదిరో, దొర ఏందిరో, వారి పీకుడేందిరో’ అంటూ ప్రభుత్వ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకోడానికి విప్లవ సినిమాల్లో పేదవర్గాలు ఎర్రజెండాలతో దండుగా వెండితెరపై కదుల్తుంటే వారికి మద్దతుగా ప్రేక్షకులు ఈలలు, కరతాళ ధ్వనులతో హోరెత్తించడం చూశాం. కానీ పాలనాపగ్గాలు టీడీపీ చేపట్టిన తరువాత పాట పల్లవిలో అపశ్రుతి చోటుచేసుకున్నట్టుంది.
కనిపించిన ప్రభుత్వ భూమంతా మాదేనన్న చందంగా కొంతమంది నేతలు తమ అనుచరులతో దర్జాగా కబ్జా చేస్తూ ‘పోలీసెవడురో, రెవెన్యూ పితలాటమేందిరో’ అంటూ పలుగు, పారా కాదు ఏకంగా పొక్లెయిన్లు, జేసీబీలతో చదును చేసేసుకుంటున్నారు. ఇదేదీ అర్థంకాని సామాన్య జనం మాత్రం ‘ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నవాళ్లదే ప్రభుత్వ భూమా’ అని అమాయకంగా ప్రశ్నిస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డుకోవల్సిన సర్కారు యంత్రాంగం మాత్రం ఈలలు, కరతాళ ధ్వనులతో మద్దతు బహిరంగంగా తెలపకపోయినా అంతర్గతంగా అంతకన్నా ఎక్కువగానే వత్తాసు పలుకుతోందని పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుడ్లూరు: ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా అడ్డుకోవల్సిన రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న రెండు గ్రామాల్లో గత పది రోజుల నుంచి జేసీబీలతో చదును చేస్తున్నా చలనం లేదాయే. మండలంలోని జానకంపేట గ్రామంలో సర్వే నెంబర్లు 603-48 వరకు రోడ్డు పక్కనే 200 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఎకరా విలువ సుమారు రూ. 5 లక్షలు వరకూ ఉంటుంది. చనలాటరఫి, జానకంపేట గ్రామాలకు చెందిన రాజకీయ నాయుకుల కన్ను ఆ భూములపై పడింది. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఆ భూములు వైపు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకంటున్నారు.
గత పది రోజులు నుంచి రాత్రీపగలనకుండా జేసీబీలను పెట్టి చె ట్లను తొలిగించి ఆక్రమణలకు పాల్పడుతున్నా పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. ఆ భూముల్లో సిమెంటు స్తంభాలు, ఇనుప కంచెలతో ‘హద్దులు’ మీరుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టడానికి అడుగులు వేయకపోవడం వెనుక మతలబేమిటని పరిసర గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వారంతా ఆక్రమిస్తే లేనిది మాకేంటంటూ అప్పటి వరకు కబ్జాకు దూరంగా ఉన్న చిన్నా, చితకా గ్రామస్థాయి నేతలు కూడా పలుగు, పార పట్టుకొని గ్రామ కంఠాలనూ తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు.
ఓ గ్రామ నాయుకుడు ఏకంగా 40 ఎకరాలను ఆక్రమించుకొని చుట్టూ కంచె కూడా వేయించాడంటే ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిరుపేదలు గూడు కోసం కర్రలు పాతుకుంటే చాలు విరుచుపడే రెవెన్యూ యంత్రాంగం కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమవుతున్నా అడ్డుకోకపోవడం పట్ల పలు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికే 500 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లో ఉండగా తాజాగా మరో 200 ఎకరాలు వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంటోంది.
నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని నరసాపురం గ్రామంలో కూడా పెద్దపవని-కావలి ప్రధాన రహదారి పక్కనే ఉన్న సర్వే నెంబరు 104 ఎద్దులబీడులో ఉన్న సుమారు 200 ఎకరాల భూములు కూడా జేసీబీలతో దున్ని ఆక్రమించుకోవాడానికి గ్రామానికి చెందిన నాయుకులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ తంతు రెండు నెలల నుంచి జరుగుతోంది. ఇక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగానిది ఇదే పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోతే జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామంటున్నారు.
చర్యలు తీసుకుంటాం
ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములుపై తహశీల్థార్ మెర్సీ కుమారిని వివరణ కోరగా ఆ గ్రామాలకు వెళ్ళి ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆక్రమణదారులపై కూడా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ భూమి మనదిరో...
Published Fri, Jan 2 2015 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement
Advertisement