development of rural roads
-
ఈ భూమి మనదిరో...
‘ఊరు మనదిరో, ఈ వాడ మనదిరో, పలుగు మనదిరో, ఆ పార మనదిరో, దొర ఏందిరో, వారి పీకుడేందిరో’ అంటూ ప్రభుత్వ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకోడానికి విప్లవ సినిమాల్లో పేదవర్గాలు ఎర్రజెండాలతో దండుగా వెండితెరపై కదుల్తుంటే వారికి మద్దతుగా ప్రేక్షకులు ఈలలు, కరతాళ ధ్వనులతో హోరెత్తించడం చూశాం. కానీ పాలనాపగ్గాలు టీడీపీ చేపట్టిన తరువాత పాట పల్లవిలో అపశ్రుతి చోటుచేసుకున్నట్టుంది. కనిపించిన ప్రభుత్వ భూమంతా మాదేనన్న చందంగా కొంతమంది నేతలు తమ అనుచరులతో దర్జాగా కబ్జా చేస్తూ ‘పోలీసెవడురో, రెవెన్యూ పితలాటమేందిరో’ అంటూ పలుగు, పారా కాదు ఏకంగా పొక్లెయిన్లు, జేసీబీలతో చదును చేసేసుకుంటున్నారు. ఇదేదీ అర్థంకాని సామాన్య జనం మాత్రం ‘ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నవాళ్లదే ప్రభుత్వ భూమా’ అని అమాయకంగా ప్రశ్నిస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డుకోవల్సిన సర్కారు యంత్రాంగం మాత్రం ఈలలు, కరతాళ ధ్వనులతో మద్దతు బహిరంగంగా తెలపకపోయినా అంతర్గతంగా అంతకన్నా ఎక్కువగానే వత్తాసు పలుకుతోందని పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడ్లూరు: ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా అడ్డుకోవల్సిన రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న రెండు గ్రామాల్లో గత పది రోజుల నుంచి జేసీబీలతో చదును చేస్తున్నా చలనం లేదాయే. మండలంలోని జానకంపేట గ్రామంలో సర్వే నెంబర్లు 603-48 వరకు రోడ్డు పక్కనే 200 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఎకరా విలువ సుమారు రూ. 5 లక్షలు వరకూ ఉంటుంది. చనలాటరఫి, జానకంపేట గ్రామాలకు చెందిన రాజకీయ నాయుకుల కన్ను ఆ భూములపై పడింది. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఆ భూములు వైపు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకంటున్నారు. గత పది రోజులు నుంచి రాత్రీపగలనకుండా జేసీబీలను పెట్టి చె ట్లను తొలిగించి ఆక్రమణలకు పాల్పడుతున్నా పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. ఆ భూముల్లో సిమెంటు స్తంభాలు, ఇనుప కంచెలతో ‘హద్దులు’ మీరుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టడానికి అడుగులు వేయకపోవడం వెనుక మతలబేమిటని పరిసర గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వారంతా ఆక్రమిస్తే లేనిది మాకేంటంటూ అప్పటి వరకు కబ్జాకు దూరంగా ఉన్న చిన్నా, చితకా గ్రామస్థాయి నేతలు కూడా పలుగు, పార పట్టుకొని గ్రామ కంఠాలనూ తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. ఓ గ్రామ నాయుకుడు ఏకంగా 40 ఎకరాలను ఆక్రమించుకొని చుట్టూ కంచె కూడా వేయించాడంటే ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిరుపేదలు గూడు కోసం కర్రలు పాతుకుంటే చాలు విరుచుపడే రెవెన్యూ యంత్రాంగం కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమవుతున్నా అడ్డుకోకపోవడం పట్ల పలు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికే 500 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లో ఉండగా తాజాగా మరో 200 ఎకరాలు వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంటోంది. నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని నరసాపురం గ్రామంలో కూడా పెద్దపవని-కావలి ప్రధాన రహదారి పక్కనే ఉన్న సర్వే నెంబరు 104 ఎద్దులబీడులో ఉన్న సుమారు 200 ఎకరాల భూములు కూడా జేసీబీలతో దున్ని ఆక్రమించుకోవాడానికి గ్రామానికి చెందిన నాయుకులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ తంతు రెండు నెలల నుంచి జరుగుతోంది. ఇక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగానిది ఇదే పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోతే జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. చర్యలు తీసుకుంటాం ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములుపై తహశీల్థార్ మెర్సీ కుమారిని వివరణ కోరగా ఆ గ్రామాలకు వెళ్ళి ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆక్రమణదారులపై కూడా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
గజ్వేల్ రోడ్లకు మహర్దశ
రూ.173కోట్లు విడుదల చేసిన సీఎం గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లకు ఇక మహర్దశ పట్టనుంది. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోని రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.173.3 కోట్లను విడుదల చేశారు. గతేడాది నవంబర్ 30న జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించిన సీఎం...ఇచ్చిన మాట ప్రకారం నిధులను విడుదల చేశారు. ఈ విషయాన్ని గురువారం రాత్రి ‘గడా’(గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు ధృవీకరించారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని 65 కొత్త సింగిల్ రోడ్ల నిర్మాణం కోసం రూ.88.20 కోట్లు, 95.94 కిలోమీటర్ల డబుల్ రోడ్ల కోసం రూ.84.83 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కేసీఆర్ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇప్పటివరకు సీఎం చొరవతో నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ. 589 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. -
నున్నటి రోడ్లు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కంకర తేలి గుంతలమయమైన గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుంది. గ్రామీణ రోడ్లకు మరమ్మతు, కొత్తగా బీటీ, మెటల్ రోడ్లుగా మార్చే పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలోని 143 రోడ్డు పనులకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులిచ్చింది. సుమారు 271 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.153.49 కోట్లు ఖర్చు చేయనుంది. పనుల అంచనాలను బట్టి ఈ-టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఎంపికచేసిన అనంతరం పనులు ప్రారంభించాలని ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. మూడు కేటగిరీల్లో పనులు సమగ్ర అభివృద్ధి నినాదాన్ని వినిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా చేపట్టే పనులను మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో జనరల్ కేటగిరిలో అన్ని వర్గాల కాలనీలు, గ్రామాలను పేర్కొంటూ 78 పనులకు ఓకే చెప్పింది. 141.25 కిలోమీటర్ల రోడ్లు పనులకు రూ.72.85 కోట్లు కేటాయించింది. అదేవిధంగా ఎస్సీ ఉప ప్రణాళికలో భాగంగా కేవలం ఎస్సీల జనాభా అధికంగా ఉన్న గ్రామాలు, కాలనీలకు 30 పనులను మంజూరు చేసింది. ఇందులో 60.08 కిలోమీటర్ల మేర నిర్మించే రోడ్డు పనులకు రూ.43.29 కోట్లు, ఉప ప్రణాళికలో గిరిజనుల వాటా కింద గిరిజన తండాలు, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకుగాను 35 పనులు మంజూరు చేసింది. 69.58 కిలోమీటర్లలో చేపట్టే రోడ్లకు రూ.37.35కోట్లు ఇచ్చింది. మొత్తంగా 143 పనుల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది. తాజాగా మంజూరైన రోడ్ల పనుల్లో తాండూరు నియోజకవర్గం 39 వర్క్స్‌తో అగ్రభాగాన ఉంది. అదేవిధంగా చేవెళ్లకు 24 పనులు, మేడ్చల్‌కు 21 పనులు, వికారాబాద్‌కు 18 పనులు, మహేశ్వరానికి 18, పరిగి నియోజకవర్గానికి ఆరు, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ఏడు, వికారాబాద్‌కు 18, కుత్భుల్లాపూర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఐదు పనుల చొప్పున మంజూరయ్యాయి. అంతా ఆన్లైన్లోనే.. ఐదు లక్షలలోపు ఉన్న నిర్మాణ పనులను గతంలో సాధారణ పద్ధతిలో కాంట్రాక్టర్లకు కట్టబెట్టేవారు. ప్రస్తుతం ఈ పద్ధతికి చెక్ పెట్టిన ప్రభుత్వం.. తాజాగా పనులను ఆన్లైన్ పద్ధతి ద్వారా దరఖాస్తులు స్వీకరించిన తర్వాత తక్కువ కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనుల బాధ్యతలను అప్పగిస్తారు. పనుల ప్రారంభించిన అనంతరం వాటి పురోగతి, పనులు పూర్తయిన తర్వాత రహదారి ఫొటోలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. అదేవిధంగా ఐదేళ్లపాటు కాంట్రాక్టరే రహదారి నిర్వహణ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నాణ్యత ప్రమాణాల విభాగం, విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అవకతవకలు జరిగితే కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. -
గ్రామగ్రామానికీ రోడ్ నెట్వర్క్
ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: గ్రామీణ రోడ్ల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా ప్రభుత్వం భావిస్తోందని, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి సరైన రోడ్ నెట్వర్క్ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణంపై శనివారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామీణ రహదారులను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేకంగా రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాలన్నింటినీ ఒకే వ్యవస్థగా మార్చనున్నామన్నారు. ఇప్పటికే 12,039 కిలోమీటర్ల తారు రోడ్ల రెన్యువల్స్ (తిరిగి వేయడం)కు టెండర్లు పిలిచామని, రోడ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు టెండర్ల సమయం కూడా తగ్గించామని పేర్కొన్నారు. గ్రామాలకు ప్రజాప్రతినిధులు.. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధులందరూ గ్రామాలను సందర్శించి, రోడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాణ్యతాలోపాలు కనిపిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. గతంలో రోడ్లకు సంబంధించి రూ.153 కోట్ల బకాయిలను విడుదల చేశామన్నారు. తారు రోడ్లతో పాటు ప్రతి గ్రామంలోనూ మట్టిరోడ్లు సుమారు 20 వేల కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్టు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా వచ్చిన మట్టిని రోడ్లకు వినియోగిస్తామన్నారు. వచ్చే ఏడాది మే నెలాఖరు కల్లా ఈ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.220 కోట్లు కేటాయించిందన్నారు.