సాక్షి, రంగారెడ్డి జిల్లా: కంకర తేలి గుంతలమయమైన గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుంది. గ్రామీణ రోడ్లకు మరమ్మతు, కొత్తగా బీటీ, మెటల్ రోడ్లుగా మార్చే పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలోని 143 రోడ్డు పనులకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులిచ్చింది. సుమారు 271 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.153.49 కోట్లు ఖర్చు చేయనుంది. పనుల అంచనాలను బట్టి ఈ-టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఎంపికచేసిన అనంతరం పనులు ప్రారంభించాలని ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించింది.
మూడు కేటగిరీల్లో పనులు
సమగ్ర అభివృద్ధి నినాదాన్ని వినిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా చేపట్టే పనులను మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో జనరల్ కేటగిరిలో అన్ని వర్గాల కాలనీలు, గ్రామాలను పేర్కొంటూ 78 పనులకు ఓకే చెప్పింది. 141.25 కిలోమీటర్ల రోడ్లు పనులకు రూ.72.85 కోట్లు కేటాయించింది. అదేవిధంగా ఎస్సీ ఉప ప్రణాళికలో భాగంగా కేవలం ఎస్సీల జనాభా అధికంగా ఉన్న గ్రామాలు, కాలనీలకు 30 పనులను మంజూరు చేసింది.
ఇందులో 60.08 కిలోమీటర్ల మేర నిర్మించే రోడ్డు పనులకు రూ.43.29 కోట్లు, ఉప ప్రణాళికలో గిరిజనుల వాటా కింద గిరిజన తండాలు, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకుగాను 35 పనులు మంజూరు చేసింది. 69.58 కిలోమీటర్లలో చేపట్టే రోడ్లకు రూ.37.35కోట్లు ఇచ్చింది. మొత్తంగా 143 పనుల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది.
తాజాగా మంజూరైన రోడ్ల పనుల్లో తాండూరు నియోజకవర్గం 39 వర్క్స్‌తో అగ్రభాగాన ఉంది. అదేవిధంగా చేవెళ్లకు 24 పనులు, మేడ్చల్‌కు 21 పనులు, వికారాబాద్‌కు 18 పనులు, మహేశ్వరానికి 18, పరిగి నియోజకవర్గానికి ఆరు, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ఏడు, వికారాబాద్‌కు 18, కుత్భుల్లాపూర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఐదు పనుల చొప్పున మంజూరయ్యాయి.
అంతా ఆన్‌లైన్‌లోనే..
ఐదు లక్షలలోపు ఉన్న నిర్మాణ పనులను గతంలో సాధారణ పద్ధతిలో కాంట్రాక్టర్లకు కట్టబెట్టేవారు. ప్రస్తుతం ఈ పద్ధతికి చెక్ పెట్టిన ప్రభుత్వం.. తాజాగా పనులను ఆన్‌లైన్ పద్ధతి ద్వారా దరఖాస్తులు స్వీకరించిన తర్వాత తక్కువ కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనుల బాధ్యతలను అప్పగిస్తారు.
పనుల ప్రారంభించిన అనంతరం వాటి పురోగతి, పనులు పూర్తయిన తర్వాత రహదారి ఫొటోలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. అదేవిధంగా ఐదేళ్లపాటు కాంట్రాక్టరే రహదారి నిర్వహణ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నాణ్యత ప్రమాణాల విభాగం, విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అవకతవకలు జరిగితే కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
నున్నటి రోడ్లు!
Published Fri, Jan 2 2015 1:17 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement