పౌరసరఫరాల సంస్థలో స్టేజ్–1 టెండర్లలో అవినీతి బాగోతం
గతేడాది పిలిచిన టెండర్ల రద్దు
కొత్తగా 22 జిల్లాల నుంచి టెండర్ల ఆహ్వానం
15 శాతం పైనే అధిక ధరలు కోట్ చేసిన కాంట్రాక్టర్లు
వారికే కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దల యత్నం
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో నిత్యావసర సరుకుల తరలింపునకు సంబంధించిన స్టేజ్–1 టెండర్లలో భారీ అవినీతి బాగోతం నడుస్తోంది. గతంలో ఒకసారి టెండర్లు పిలిచి.. ఫైనాన్షియల్ బిడ్లు తెరిచిన తర్వాత.. వాటిని రద్దుచేసి కొత్తగా టెండర్లు(Tenders) పిలవడం చర్చనీయాంశమైంది. తాజాగా 22 జిల్లాలకు స్టేజ్–1 టెండర్లు ఆహ్వానించగా.. గతంలో కోట్ చేసిన ధరలకంటే ఈసారి ఏకంగా 15 శాతం అధికంగా ధరలు ఉండటం గమనార్హం.
కమీషన్ల కోసమే కొత్త టెండర్!
గతేడాది అక్టోబర్–నవంబర్‌లో పౌరసరఫరాల సంస్థ(Civil Supplies Corporation) స్టేజ్–1 టెండర్లు నిర్వహించింది. ఇందులో ఎక్కువగా రాజకీయ సిఫారసులు నడిచాయి. చాలాచోట్ల సింగిల్ టెండర్లు వచ్చాయి. అప్పట్లో కూడా పాత టెండర్లతో పోలిస్తే 10 శాతం వరకు అధిక ధరలు కోట్ చేశారు. కొందరు కాంట్రాక్టర్లు తమను అన్యాయంగా టెండర్ ప్రక్రియ నుంచి తప్పించారంటూ కోర్టుకు వెళ్లి మరీ అనుమతులు తెచ్చుకున్నారు.
అయితే.. దోపిడీయే పరమావధిగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు పాత టెండర్ల రద్దుకు ప్రణాళిక వేశారు. దీంతో మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువ రేట్లు వచ్చాయని సాకుగా చూపించి మొత్తం టెండర్లను రద్దు చేసేశారు. విచిత్రం ఏమంటే.. తాజాగా పిలిచిన టెండర్లలో గతంలో కోట్ చేసిన దానికంటే ఎక్కువ ధరలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కువ టెండర్లనే ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కాంట్రాక్టర్లను చర్చల (నెగోషియేషన్స్) పేరుతో పిలిచి కోట్ చేసిన ధరలో రూపాయి, అర్ధరూపాయి తగ్గించి.. ఏదో భారీగా తగ్గించినట్టు మభ్యపెడు తున్నారు. ఉదాహరణకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో టెండర్ల ధర ఎక్కువ రాగా.. అయినా వీటిని ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లలో ఎక్కువ ధరలు వచ్చినట్టు భావిస్తే వాటికి రీ టెండరింగ్‌కు వెళ్లాల్సిన అంశాన్ని పూర్తిగా విస్మరించారు.
టెండర్ అంతా గోల్‌మాల్
తాజాగా పౌరసరఫరాల సంస్థ స్టేజ్–1 టెండర్ల ప్లాట్‌ఫామ్ ఎంపికమైనా విమర్శలు వెల్లువెత్తు న్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ జమ్ (జీఈఎం) ద్వారా జిల్లాల్లో బఫర్ గోడౌన్ నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరుకు రవాణాకు టెండర్లు పిలిచారు. ఇందులో నాలుగు జిల్లాలకు టెండర్ ఖరారు చేశారు. మిగిలిన జిల్లాల్లో టెండర్లు రద్దు చేయగా.. ఈసారి జమ్ పోర్టల్ నుంచి కాకుండా మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ పోర్టల్ అయిన ఎన్‌ఈఎంఎల్ ద్వారా టెండర్లు పిలవడం వెనక అసలు గుట్టు ఉందని కాంట్రాక్టర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
జమ్ పోర్టల్ తమకు ఎంతో సౌలభ్యంగా ఉందని, ఇందులో ఎటువంటి ప్లాట్‌ఫామ్ కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా టెండర్లు వేయగా.. ఎన్‌ఈఎంఎల్ ద్వారా ఒక్కో కాంట్రాక్టర్ సుమారు రూ.2.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పౌరసరఫరాల సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి చక్రం తిప్పి టెండర్ ప్లాట్‌ఫామ్‌ను మార్చినట్టు సమాచారం.
మరోవైపు ఇక్కడ ఖరారైన టెండర్లకు అగ్రిమెంట్ల కోసం ఒక్కో కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ పంపకాల్లో గొడవలు రావడంతో అసలు విషయం బయటకు పొక్కింది.
Comments
Please login to add a commentAdd a comment