![Tenders for operation of 108 and 104 vehicles and emergency response center](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/104.jpg.webp?itok=K-Mx0wN2)
104, 108 నిర్వహణ కాంట్రాక్టును అస్మదీయ సంస్థకు కట్టబెట్టేలా ప్రభుత్వం స్కెచ్
నిర్వహణా టెండరు నిబంధనల్లో మతలబు
రూ.రెండు వేల కోట్ల కాంట్రాక్టుకు వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లుంటే చాలట.. అంచనా వ్యయంలో కనీసం 30 శాతం టర్నోవర్ ఉండాలని సీవీసీ మార్గదర్శకాలు
తామనుకున్న సంస్థ బిడ్ మాత్రమే అర్హత సాధించేలా నిబంధనలు
ఒకే బిడ్ దాఖలైనా ఆమోదించేలా వెసులుబాటు
సాక్షి, అమరావతి : వడ్డించేవాడు మనోడైతే బంతి చివర్లో కూర్చున్నా అన్నీ సమకూరుతాయన్నది సామెత. ప్రభుత్వంలోనూ ఇలాంటి కీలక వ్యక్తులను ప్రసన్నం చేసుకుంటే ఇంక తిరుగే ఉండదు.. అనుకున్న పనులు అనుకున్నట్లు చకచకా జరిగిపోతాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఇప్పుడు అచ్చం ఇదే జరుగుతోంది. 108, 104 వాహనాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ నిర్వహణ టెండర్లలో ఓ అస్మదీయ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ముఖ్యనేతల డైరెక్షన్‌లో ‘భవ్య’మైన స్కెచ్ వేశారు. ఆ ప్రణాళిక కథాకమామిషు ఇదిగో ఇదే..
ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యం
పేద, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా గత ప్రభుత్వంలో అమలైన డైరెక్ట్ బెన్‌ఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) స్కీంలను టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అటకెక్కించింది. కూటమి పార్టీ నేతల జేబులు నింపే దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) కార్యక్రమాలనే పక్కాగా అమలుచేస్తోంది. అస్మదీయ సంస్థలకు పనులను కట్టబెట్టడం ద్వారా రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగు లు వేస్తోంది.
ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలోని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్‌సీ) నిర్వహణ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థకు కట్టబెట్టడానికి ఓ ‘భవ్య’మైన ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయ సమాచారం. పై మూడింటికీ కలిపి ఏపీఎంఎస్‌ఐడీసీ ఒకే టెండరును పిలిచింది. ఈ టెండరు నిబంధనలను చూసి ‘నిబంధనలన్నీ ప్రభుత్వ పెద్దలు నిశ్చయించుకున్న సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టేలా ఉన్నాయి.
ఆ సంస్థ పేరొక్కటే టెండరు డాక్యుమెంట్‌లో పొందుపరచలేదు’.. అని వైద్యశాఖలో ఇప్పుడీ అంశాన్ని విస్తృతంగా చర్చించుకుంటున్నారు. నిజానికి.. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో బాధితులకు సత్వర వైద్యసాయం అందజేత, ప్రివెంటివ్ కేర్‌లో 108, 104 సేవలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ పూర్వ అనుభవం, సామర్థ్యం ఎంతో కీలకం.
వీలైనన్ని ఎక్కువ సంస్థలు ఈ టెండరులో పాల్గొనే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. కానీ, పెద్దఎత్తున అంబులెన్స్‌లు, ఎంఎంయూలు నిర్వహించిన, అనుభవం, సామర్థ్యంలేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం ఇష్టమొచ్చినట్లు నిబంధనలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది.
ఒకే తరహా సేవలకు వేర్వేరు నిబంధనలు..
రాష్ట్రవ్యాప్తంగా 1,700 అంబులెన్స్‌లు, ఎంఎంయూలు ఐదేళ్లపాటు నిర్వహణ, ఇతర అవసరాలకు రూ.రెండు వేల కోట్ల అంచనాతో టెండరు రూపొందించారు. ఇంత విలువైన కాంట్రాక్టులను ఓ చిన్న సంస్థకు కట్టబెట్టడం కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. సీవీసీ మార్గదర్శకాల ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయంలో మూడు ఆర్థిక సంవత్సరాల సగటు వార్షిక టర్నోవర్ కనీసం 30 శాతం ఉండాలి.
అయితే, ప్రస్తుత టెండరులో వార్షిక టర్నోవర్ రూ.100 కోట్ల వరకూ ఉండాలని పేర్కొన్నారు. అలాగే, గిరిజన ప్రాంతాల్లో 122 ఫీడర్ అంబులెన్స్ నిర్వహణ కోసం ఏపీఎంఎస్‌ఐడీసీ టెండర్లు పిలిచింది. ఇందులో సర్వీస్ ప్రొవైడర్‌కు కనీసం రెండేళ్ల అనుభవంతో పాటు, కనీసం 33 శాతం (40) ఫీడర్ అంబులెన్సులను గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నిర్వహించి ఉండాలని నిబంధన విధించారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/12_28.png)
కానీ, 108, 104 టెండరులో మాత్రం బిడ్ దాఖలుచేసే నాటికి 100 వరకూ అంబులెన్స్‌లు/ఎంఎయూ/వెటర్నరీ యూనిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్వహించి ఉంటే చాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకే తరహా సేవలకు సంబంధించిన టెండర్లలో వేర్వేరు నిబంధనలు విధించడం ఇక్కడ గమనార్హం. ఫీడర్ అంబులెన్స్‌ల తరహాలో 33 శాతం నిబంధన పెడితే అస్మదీయ సంస్థ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురవుతుందని 104, 108 టెండరులో మెలికపెట్టినట్లు తెలిసింది.
సదరు సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో వెటర్నరీ అంబులెన్స్‌లు నిర్వహిస్తుండడంతో ప్రస్తుత టెండర్లలో వెటర్నరీ అంశాన్ని చేర్చినట్లు సమాచారం. మరోవైపు.. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల (ఈహెచ్‌ఆర్) సృష్టిలో అనుభవం ఆధారంగా ఐదు మార్కులు కేటాయిస్తామని టెండరులో పేర్కొన్నారు.
ఇక సదరు అస్మదీయ సంస్థ పలు రాష్ట్రాల్లో ఈహెచ్‌ఆర్ ప్రాజెక్టులు చేసిన క్రమంలో దాని ఆధారంగా మార్కులిచ్చి మేలు చేయడానికే ఈ నిబంధన కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు హెల్త్‌కేర్ ప్రాజెక్టుల్లో ఈ సంస్థ ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టుకు 1.5 చొప్పున 15 మార్కుల వరకూ బోనస్ ఇచ్చేలా నిబంధన పెట్టారు.
ఒకే బిడ్ వచ్చినా ఆమోదించేలా..
ఇక సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా పనులకు టెండర్లు పిలిచినప్పుడు ఒకే సంస్థ బిడ్ వేస్తే ఆ టెండర్‌ను రద్దుచేసి, మరోసారి పిలవడం ఆనవాయితీ. కానీ, ఓ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం పూర్వ అనుభవం, సామర్థ్యం కలిగిన సంస్థలు పోటీలో ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘భవ్య’మైన ప్రణాళికను రచించింది.
ఒక్క బిడ్ దాఖలైనా ఆమోదించేలా షరతు విధించింది. దీంతో.. ఒకే సంస్థ పోటీలో ఉండేలా నిబంధనలు పొందుపరిచి, ఆ మేరకు బిడ్ ఆమోదించే వెసులుబాటు కల్పించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో టెండర్లు పిలిచినప్పుడు ఇలాంటి నిబంధనలు ఉండేవి కావని, ఇప్పుడే చేర్చారని ఏపీఎంఎస్‌ఐడీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment