
విశాఖలో డీఎంహెచ్‌వోకు సమ్మె నోటీసు ఇస్తున్న 108 ఉద్యోగ సంఘ నాయకులు
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 25 నుంచి 108 ఉద్యోగుల సమ్మె
రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోనున్న 768 అంబులెన్స్‌లు
అన్ని జిల్లాల్లో అధికారులకు సమ్మె నోటీసులు ఇస్తున్న ఉద్యోగులు
అత్యవసర సేవకుల సమ్మెతో ప్రజలకు అపార నష్టం
సాక్షి నెట్‌వర్క్: తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. బాబు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినా 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. పైగా కాంట్రాక్టు సంస్థను మార్చి మరింత గందరగోళానికి గురిచేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇటీవల డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అదనపు సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చారు.
మొత్తం 3,600 మంది ఉద్యోగులు (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్లు) సమ్మెలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 768 అంబులెన్స్‌లు నిలిచిపోనున్నాయి. ఆపదలో ప్రాణాలు కాపాడే అపర సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది.
108 సర్వీస్‌లను ప్రభుత్వమే నిర్వహించాలి.. ఉద్యోగులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి.. వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేసే ఉద్యోగాల్లో 108లో పని చేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వాలి.. మరణించిన 108 ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షలు ఇవ్వాలి.. తదితర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయనగరం, అనకాపల్లి, విశాఖ, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీఆర్వో, మండల స్థాయి అధికారులకు సమ్మె నోటిస్‌లు ఇచ్చారు.