108 అంబులెన్స్ అందుబాటులో లేక సకాలంలో అందని వైద్యం
చెక్క బీరువా మీదపడడంతో మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు
ఆస్పత్రిలో గంటపాటు విలవిల్లాడి ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా మృత్యువాత
కాకినాడ జిల్లా ఉప్పాడలో దుర్ఘటన
కొత్తపల్లి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై టీడీపీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి బలైంది. 108 అంబులెన్సుల నిర్వహణలో ప్రభుత్వం చేస్తున్న అనవసర రాజకీయాలు ఈ దారుణానికి పరోక్ష కారణం. అందుబాటులో 108 అంబులెన్స్ లేకపోవడంతో జరిగిన జాప్యంవల్ల సకాలంలో సరైన చికిత్స అందక తమ కుమార్తె మరణించిందని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఏమిటంటే.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ప్రముఖ ప్రార్థనాలయానికి చెందిన పాస్టర్ కుమార్తె రత్నప్రకాశకు పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన జోగి షారోన్‌కుమార్‌తో వివాహమైంది. వీరు ప్రస్తుతం కృష్టా జిల్లా పామర్రు నియోజకవర్గం వీరంకిలాకు గ్రామంలో ఉంటున్నారు. వీరి కుమార్తె బెట్సీ జయకీర్తన (3) కొద్దిరోజులుగా ఉప్పాడలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద తల్లితో కలిసి ఉంటోంది.
క్రిస్మస్ వేడుకలు సమీపించడంతో శనివారం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మేడపై ఉన్న పాత చెక్క బీరువాను కిందకు దింపి, పైన గదులు శుభ్రపరుస్తున్నారు. కింద ఆడుకుంటున్న జయకీర్తన చెక్క బీరువా గెడను పట్టుకుని వేలాడింది. అంతే.. ఒక్కసారిగా బీరువా ఆమె మీద పడింది. చిన్నారి ఏడుపు విని పరుగున వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెను బయటకుతీసి కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో 108 అంబులెన్సుకు ఫోన్చేశారు. అయితే, అది అందుబాటులో లేకపోవడంతో కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆ చిన్నారిని బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ 108 రాకపోవడంతో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్సులో కాకినాడకు తరలించారు. మార్గంమధ్యలోనే జయకీర్తన ప్రాణాలు విడిచింది.
అప్పటివరకూ ఆడుకుంటూ కేరింతలు కొట్టిన ఆ చిన్నారి అంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆనందంగా పండగ జరుపుకోవాల్సిన సమయంలో పండంటి బిడ్డను పోగొట్టుకున్నామంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని వీరంకిలాకులకు తరలించారు. సకాలంలో 108 అంబులెన్సు వచ్చి ఉంటే తమ పాప బతికేదని తల్లి రత్నప్రకాశ విలపించింది.
Comments
Please login to add a commentAdd a comment