ఆస్పత్రులకు మందుల సరఫరాలో ఓ అమాత్యుడి చేతివాటం
జన్–ఔషధి మందుల పేరిట రూ.కోట్లు కొట్టేయడానికి పన్నాగం
బోధనాస్పత్రుల్లో ఏటా స్థానికంగా రూ.50 కోట్ల మేర అత్యవసర మందుల కొనుగోలు
తిరుపతికి చెందిన సంస్థతో డీల్ కుదుర్చుకున్న ఓ మంత్రి
టెండర్లతో పని లేకుండా ఒప్పంద ప్రాతిపదికన సరఫరాకు స్కెచ్
సరఫరాలో జాప్యం జరిగినా చర్యలు లేని విధంగా నిబంధనలు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ధనార్జనే ధ్యేయంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఓ రేటు మాట్లాడేసుకుని టెండర్లు లేకుండానే ప్రభుత్వ శాఖల్లో పనులను నచ్చిన వారికి కట్టబెట్టేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట ఓ మంత్రి కమీషన్‌ల రూపంలో రూ.కోట్లలో కొట్టేయడానికి పన్నాగం పన్నారని వైద్య శాఖలో జోరుగా చర్చ సాగుతోంది. బోధనాస్పత్రులకు మందులు, సర్జికల్స్ కొనుగోలుకు కేటాయించే బడ్జెట్‌లో 80 శాతం సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తుంది.
మిగిలిన 20 శాతం డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో అత్యవసర మందులు, సర్జికల్స్ స్థానికంగానే కొనుగోలు చేస్తుంటారు. ఏటా డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో రూ.50 కోట్ల మేర కొనుగోళ్లు చేపడుతుంటారు. వీటితో పాటు, సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి సరఫరా అవ్వని మందుల కొనుగోళ్లలో జన్ ఔషధికే ప్రాధాన్యం ఇవ్వాలనే విధానాన్ని గతేడాది వైద్య శాఖ ప్రవేశపెట్టింది. జన్ ఔషధిలో సరఫరా చేయని మందులనే, ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనుగోలు చేయాలని షరతులు పెట్టారు.
ఏకంగా ఉత్తర్వులు మార్చి గ్రీన్ సిగ్నల్
ఈ నేపథ్యంలో సదరు మంత్రి ఒక మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకున్న క్రమంలోనే జన్ ఔషధి వ్యవహారం తెరమీదకు వచ్చిందని ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు, వైద్యులు చర్చించుకుంటున్నారు. తిరుపతికి చెందిన సదరు సంస్థ ప్రతినిధులు ‘జన్– ఔషధి విధానం ప్రవేశపెట్టిందే మా కోసం.. మాతోనే ఎంవోయూ చేసుకోవాలి’ అని ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లను సంప్రదించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఫలానా సంస్థతో ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలివ్వాలని మంత్రి కార్యాలయం ఒత్తిళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి.. సదరు సంస్థతోనే సూపరింటెండెంట్‌లు ఒప్పందం కుదుర్చుకునేలా నిబంధనల్లో మెలికలు పెడుతూ గత నెల (జనవరి) 23న ఇచ్చిన ఉత్తర్వులకు సవరణలు చేశారు.
మంత్రికి చెందిన సరఫరాదారుడికి రాయలసీమతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ జన్ ఔషధి స్టోర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ పీఎంబీజేకే – జన్‌ఔషధి స్టోర్స్ ఉన్న సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకోవాలని నిబంధనలు మార్చారు. అదే విధంగా తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో కనీసం ఏడాది ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవాలన్నారు. ఈ నిబంధనను సవరించి, రెండేళ్ల కాలనికి పొడిగించారు. హెచ్‌డీఎస్, ఆరోగ్యశ్రీ మందుల కొనుగోళ్లలోనూ ఇవే నిబంధనలు పాటించాలని మెలిక పెట్టారు.
ఈ మేరకు సవరించిన ఉత్తర్వులను జనవరి 28న ఇచ్చారు. దీంతో ఏటా రూ.50 కోట్లకుపైగా మందులు, సర్జికల్స్ కొనుగోళ్ల వ్యవహారంలో టెండర్లు పిలవకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థకు మేలు జరిగేలా మంత్రి చక్రం తిప్పారని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం రెండేళ్ల ప్రాతిపదికన ఎంవోయూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన రూ.100 కోట్లకుపైగా బిజినెస్ కల్పించడం ద్వారా కమీషన్ల రూపంలో రూ.కోట్లలోనే లబ్ధి పొందాలని మంత్రి ప్రణాళికలు రచించినట్టు స్పష్టమవుతోంది.
పెనాల్టీలు కూడా లేవట!
పీఎంబీజేకే–జన్ ఔషధి గుర్తింపు పొందిన, కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు మందులు సరఫరా చేసే సంస్థలతో ఎంవోయూ చేసుకోవాలని డీఎంఈ డిసెంబర్‌లో ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రధానంగా సూపరింటెండెంట్‌లకు సూచించారు. ఎమర్జెన్సీ మందులు అయితే 24 గంటల్లో, తక్కువ మొత్తంలో మందులు అయితే ఇండెంట్ పెట్టిన మూడు రోజుల్లో, పెద్ద ఎత్తున అయితే వారంలో సరఫరా చేయాల్సి ఉంటుందని మార్గదర్శకాలు రూపొందించారు. నిర్దేశించిన సమయంలోగా మందులు సరఫరా చేయకుంటే సదరు సంస్థకు పెనాల్టీ విధించేలా ఎలాంటి నిబంధనలు పెట్టకుండానే ఎంవోయూ రూపొందిస్తున్నట్లు సమాచారం. మందుల సరఫరాలో పదే పదే ఆలస్యం చేసినా చర్యలు తీసుకోలేని విధంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా నిబంధనలు తయారు చేశారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment