తనకు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్దకు వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ అభివాదం
సాక్షి, అమరావతి/గన్నవరం: విదేశీ పర్యటన అనంతరం రాష్ట్రానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం గన్నవరం విమానాశ్రయంలో మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి.. ఇటీవలే జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొని పోరాడదామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు తదితరులున్నారు. విమానాశ్రయం నుంచి తాడేపల్లి బయలుదేరిన వైఎస్ జగన్‌కు మార్గం మధ్యలో ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు తదితర కూడళ్లలో ఏఎంసీ మాజీ చైర్మన్ కొమ్మా కోట్లు, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి నేతృత్వంలో కార్యకర్తలు, అభిమానులు పూల వర్షం కురిపించారు.
వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
తాడేపల్లిలోని శ్రీ ఫార్చూన్ గ్రాండ్ హోటల్ ఎండీ, వైఎస్సార్‌సీపీ నేత కొండా సూర్యప్రతాప్ రెడ్డి వివాహ వేడుక సోమవారం గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు పరిమళ రెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment