వైద్య రంగ సంస్కరణల నిర్వీర్యమే లక్ష్యంగా సర్కారు అడుగులు
ఆస్పత్రులకు అత్యవసర మందుల కేంద్రీకృత సరఫరా రద్దు
స్థానికంగా మందులు కొనుగోలు చేసే పాత విధానం పునరుద్ధరణ
ఉన్నఫళంగా రద్దుతో ఆస్పత్రుల్లో గందరగోళ పరిస్థితులు
మందుల సరఫరా నిలిచిపోయి రోగులకు వైద్య సేవలపై ప్రభావం
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ప్రజారోగ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 104, 108 నిర్వహణను అస్మదీయులకు కట్టబెట్టేందుకు నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా అంబులెన్స్‌లను మూలన పడేయగా.. బీమాను తెరపైకి తెచ్చి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను అతలాకుతలం చేయడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా జిల్లా, బోధనాస్పత్రులకు మందులు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది. ఆస్పత్రులకు అత్యవసర మందులు సరఫరా కోసం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసింది. డీ–సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో అత్యవసర మందులను ఆస్పత్రులే స్థానికంగా కొనుగోలు చేసే పాత విధానాన్ని పునరుద్ధరించింది.
కేంద్రీకృత విధానంతో జవాబుదారీతనం
జిల్లా, బోధనాస్పత్రులకు మందుల కొనుగోలు కోసం కేటాయించే మొత్తం బడ్జెట్‌లో 80 శాతం మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్‌ఐడీసీ సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌ను అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తారు. 2022 జూలైలో అత్యవసర మందుల సరఫరాకు కేంద్రీకృత విధానాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. టెండర్లలో శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఎంఆర్‌పీలో 35.6 శాతం రాయితీపై మందులు సరఫరా చేస్తూ వచ్చింది. అత్యవసర మందులతో పాటు కొన్ని సందర్భాల్లో 80 శాతం బడ్జెట్‌లోని ఎసెన్షియల్ డ్రగ్స్‌లో అందుబాటులో లేని మందులను సరఫరా చేసేలా అనుమతులు ఇచ్చారు.
తద్వారా లోకల్ టెండరింగ్‌లో నడిచే అవినీతి అక్రమాలతో పాటు ఆస్పత్రుల్లో మందుల కొరతను అరికట్టేలా చర్యలు తీసుకుంది. దీంతో గతంలో ఆస్పత్రులకు ఎంత బడ్జెట్ కేటాయిస్తే అంతా ఖర్చైందని అదనపు బడ్జెట్ కోసం అడిగే పరిస్థితుల నుంచి రోగులకు మందుల కొరత లేకుండా ప్రజాధనం ఆదా అయ్యేలా పరిస్థితులు మెరుగయ్యాయి. 2022–23 నుంచి ఇప్పటి వరకు అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం రూ.84 కోట్లు కేటాయించగా అందులో రూ.37.09 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయింది. ఈ విధానంలో ఆస్పత్రుల్లో మందులకు ఇండెంట్ పెట్టిన దగ్గర నుంచి సరఫరా సంస్థకు బిల్లులు చెల్లింపు వరకు ప్రతి దశలో ఉన్నతస్థాయి పర్యవేక్షణతో పాటు జవాబుదారీతనం ఉంటుంది.
అవినీతికి గేట్లు ఎత్తిన సర్కార్
రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధరతో ఏపీఎంఎస్‌ఐడీసీ పర్యవేక్షణలో పారదర్శకంగా మందులు సరఫరా చేసే వ్యవస్థను రద్దు చేసి స్థానికంగా మందులు కొనుగోలు చేసే పాత విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి సర్కారు అవినీతికి గేట్లు తెరిచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రుల్లో కొందరు వైద్యులతో తమకున్న పరిచయాలతో కమీషన్ ఆశ చూపిన సంస్థలకు మందులు సరఫరా చేసేలా టెండర్ నిబంధనలు రూపొందించి అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఈ విధానంలో మందుల ధరల్లో ప్రతి జిల్లాకు వ్యత్యాసం ఉంటుంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బోధనాస్పత్రుల సంఖ్య, మందుల వినియోగం, బడ్జెట్ భారీగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఉన్న పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం గమనార్హం.
ఆస్పత్రుల్లో గందరగోళం
అత్యవసర మందుల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నట్లు సూపరింటెండెంట్‌లకు గత వారంలో డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నఫళంగా ప్రస్తుత విధానాన్ని రద్దు చేశారు. స్థానికంగా కొనుగోళ్లకు సరఫరా సంస్థలను ఎంపిక చేసే వరకూ జన్‌స్టోర్స్‌లో ఎంఆర్‌పీపై మందులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే బోధనాస్పత్రులకు అవసరమైన మందులు ఈ స్టోర్స్‌లో అందుబాటులో లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని మందులు ఆ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ ఆస్పత్రులకు అవసరమైన స్థాయిలో సరఫరా చేయలేమని నిర్వాహకులు తేల్చిచెప్పినట్టు తెలిసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి 80 శాతం బడ్జెట్‌కు సంబంధించి 608 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఎక్కడ చూసినా 100 నుంచి 200 మేర మందులు అందుబాటులో ఉండటం లేదు. ఈ కొరత ఉన్న మందులను సైతం ఆస్పత్రులు అత్యవసర మందుల సరఫరా సంస్థ నుంచే పొందుతున్నాయి. ఉన్నఫళంగా సరఫరా వ్యవస్థను రద్దు చేయడంతో గుంటూరు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ సహా చాలా ఆస్పత్రుల్లో ఫ్యాక్టర్స్, ఇమ్యూనోగ్లోబిలిన్స్, క్రిటికల్ కేర్, థియేటర్, ఎమర్జెన్సీ డ్రగ్స్ కొరత నెలకొంది. దీంతో రోగుల చికిత్సలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పలువురు సూపరింటెండెంట్‌లు స్థానికంగా సరఫరాదారులను ఎంపిక చేసే వరకు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని లేఖ కూడా రాసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment