
ఆస్పత్రుల్లో మందుల్లేవ్.. అధ్వాన్నంగా ప్రభుత్వాస్పత్రులు
ప్రజల ఆరోగ్యం పట్టని చంద్రబాబు ప్రభుత్వం
నిబంధనల ప్రకారం బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండాల్సిన మందుల సంఖ్య: 608
వీటిలో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు
అత్యవసర మందులూ లేక ఇబ్బందులు పడుతున్న రోగులు
బయట కొనుక్కోండంటూ రోగులకు చీటీలు రాసిస్తున్న వైద్యులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు సిరప్‌లు, ఆయింట్‌మెంట్‌లూ లేని దుస్థితి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు దొరక్క రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే ఇన్సులిన్ కొరత.. గ్యాస్ బిళ్లలకు కటకట.. అరకొరగానే రక్తహీనత చికిత్సలో వినియోగించే ఐరన్ సుక్రోజ్.. కనీసం దగ్గు సిరప్‌లు కూడా ఆస్పత్రుల్లో లభించడంలేదు. గతంలో షుగర్ రోగులకు ఇంటి దగ్గర కూడా ఇన్సులిన్ వేసుకోవడానికి నెలకు 3, 4 వెయిల్స్ ఇచ్చేవారు.
నాలుగైదు నెలలుగా ఇన్సులిన్ వెయిల్స్ ఇంటికి ఇవ్వడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీమోఫీలియా చికిత్సలో వాడే అన్ని రకాల ఇంజెక్షన్‌లు రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో దొరకడంలేదు. ఇలా.. అన్ని రకాల మందుల కొరత పేద రోగులను వేధిస్తోంది. మందులు బయట కొనుక్కోండంటూ రోగులకు వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. ఇది రోగులపై భారాన్ని మోపుతోంది.
సరఫరా ‘గుండు సున్నా’
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్య శాఖ మందులు సరఫరా చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో నాలుగు క్వార్టర్‌లుగా మందులు సరఫరా అవుతాయి. తొలి మూడు క్వార్టర్‌లకే మందులు సరిగా సరఫరా కాలేదు. ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టినప్పటికీ కొన్ని రకాల మందులు, సర్జికల్స్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రాలేదు.
ఇక నాలుగో క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) మొదలై నెల రోజులైనా ఈ మూడు నెలలకు రావాల్సిన మందులు రాలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. గతేడాది డిసెంబర్‌కి పూర్తయిన మూడు క్వార్టర్‌లకు ప్రధానమైన 100 రకాల మందులు కూడా అందుబాటులో లేవు. మందులు లక్షల సంఖ్యలో అవసరమని ఆస్పత్రుల నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్ పెట్టారు.
రాజధానికి చేరువలోని ఆస్పత్రుల్లోనూ అవస్థలే
రాజధానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు, విజయవాడ జీజీహెచ్‌లను కూడా మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గడిచిన మూడు క్వార్టర్‌లలో ఈ ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టిన 100 రకాల మందులు సరిగా సరఫరా కాలేదు. గుండె వైఫల్యానికి అందించే చికిత్సలో వినియోగించే ఇవాబ్రడిన్ హైడ్రోక్లోరైడ్ 5 ఎంజీ మాత్రలు 25 వేలు కావాలని గుంటూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్క మాత్ర కూడా రాలేదు.
బ్యాక్టీరియా చికిత్సల్లో వాడే అమోక్సిలిన్, క్లావులనేట్ యాసిడ్ మందు 50 వేలు, మూర్ఛ, కొన్ని రకాల శస్త్ర చికిత్సలకు వినియోగించే లారాజెపామ్ ఇంజెక్షన్లు వెయ్యి కావాలని కోరినా ఇవ్వలేదు. విజయవాడ జీజీహెచ్‌లో కిడ్నీ, గుండె, జనరల్ మెడిసిన్ వంటి పలు విభాగాలను మందుల కొరత వేధిస్తోంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం జీజీహెచ్ అధికారులు ఫ్యాక్టర్–8 ఇంజెక్షన్ వెయిల్స్ 50, మైగ్రేన్ మాత్రలు ఫ్లూనరిన్ 13 వేలు, తేలికపాటి నొప్పుల నుంచి విముక్తి కోసం వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్లు 21 వేలకు డిమాండ్ పెట్టినా ఒక్కటీ పంపలేదు. సాధారణ జ్వరం, ఆర్థరైటిస్, గౌట్, తల, కండరాల నొప్పి నిగవారణకు వినియోగించే నాప్రొక్సెన్ 500 ఎంజీ మాత్రలు 30వేలు, తీవ్రమైన నొప్పుల కోసం స్వల్ప కాలిక విముక్తికి వాడే ట్రమాడోల్ హెచ్‌సీఎల్ 100 ఎంజీ ఇంజెక్షన్లు 8 వేలు అవసరమైన నెల్లూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్కటీ సరఫరా చేయలేదు.
ఇటీవల విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు బయట నుంచి మందులు కొనుగోలు చేసి తెచ్చుకోవాలని రోగులకు రాసిచ్చిన చీటీలు
దగ్గు సిరప్‌లకూ కటకటే
ప్రీవెంటివ్ కేర్‌లో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లనూ మందుల కొరత వేధిస్తోంది. వీటిలో కనీసం దగ్గు సిరప్‌లకు కూడా కటకటగా ఉంటోందని కొందరు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇన్సులిన్, గ్యాస్, నొప్పులు, థైరాయిడ్, యాంటిబయోటిక్స్ అందుబాటులో లేవు. గుండె, న్యూరో వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వాడాల్సిన మందులు సైతం పూర్తి స్థాయిలో ఉండటంలేదు. స్కిన్ అలర్జీ, గాయాలకు వాడే ఆయింట్‌మెంట్‌ల కొరతా తీవ్రంగానే ఉంది.

సూపరింటెండెంట్‌లు లేఖ రాసినా..
డ్రగ్ స్టోర్స్‌లో అన్ని రకాల మందులు లేకపోవడం, కొరత కారణంగా వైద్య సేవల్లో ఇబ్బందులపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు సూపరింటెండెంట్‌లు తెలిపారు. ప్రధాన మందుల కోసం
ఇండెంట్ పెట్టినా ఒక్క మందు, ఇంజెక్షన్ కూడా సరఫరా అవలేదని, దీంతో స్థానికంగా కొనాల్సివస్తోందని వెల్లడించారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి సరఫరా అవ్వని మందులు, అత్యవసర మందుల సరఫరాకు గత ప్రభుత్వంలో ఓ సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేశారు. ఈ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇక తిరుపతికి చెందిన జన్–ఔషధి మందుల సరఫరా సంస్థతో ఓ మంత్రి డీల్ కుదుర్చుకుని, ఆ సంస్థ ద్వారానే బోధనాస్పత్రులకు మందులు సరఫరా అయ్యేలా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఉత్తర్వులు ఇప్పించారు.
జన్–ఔషధికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మెలిక పెట్టారు. అయితే ఆస్పత్రులకు పెద్దమొత్తంలో అవసరమయ్యే జన్–ఔషధి మందులను వేగంగా సరఫరా చేయలేమని సరఫరాదారులు చేతులెత్తేస్తున్నారు. ఇది ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని పలువురు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment