Vishnuja: జాబ్‌ లేదు.. అందం అసలే లేదు! | Shocking Details Revelaed In Kerala Vishnuja Case | Sakshi
Sakshi News home page

Vishnuja: జాబ్‌ లేదు.. అందం అసలే లేదు!

Published Mon, Feb 3 2025 4:57 PM | Last Updated on Mon, Feb 3 2025 5:38 PM

Shocking Details Revelaed In Kerala Vishnuja Case

అడిగినంత కట్నం ఇచ్చి బిడ్డకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పండగలకు వచ్చిపోతున్న ఆమెను చూసి..  మెట్టినింట్లో సంతోషంగా ఉంటోందని అంతా సంబుర పడ్డారు. కానీ, తోబుట్టువులకు కూడా చెప్పుకోలేని రీతిలో ఆమె వేధింపులు ఎదుర్కొంది. చివరకు..  ఓపిక నశించి అఘాయిత్యానికి పాల్పడింది!. 

తిరువనంతపురం: కేరళలలో సంచలనం సృష్టించిన విష్ణుజా(25) కేసులో(Vishnuja Case).. విస్మయం కలిగించే విషయాలు బయటకు వచ్చాయి. భర్త, అతని కుటుంబం పెట్టే హింస భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

మలప్పురం ప్రాంతానికి చెందిన విష్ణుజా(Vishnuja)కి 2023 మే నెలలో ప్రభిన్‌ అనే యువకుడితో వివాహమైంది. ఆ తర్వాత ఆ జంట ఎలంగూర్‌లో కాపురం పెట్టింది. ప్రభిన్‌ ఓ పేరుమోసిన ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నాడు. అయితే జనవరి 31వ తేదీన ఉదయం భార్యభర్తలిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. కాసేపటికే ప్రభిన్‌ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా ప్రభిన్‌ ఇంటికి రాకపోవడంతో.. విష్ణుజా కూడా కిందకు దిగకపోవడంతో కింద పోర్షన్‌లో‌ ఉండే ఆమె అత్త పైకి వెళ్లి చూసింది. ఎంతకీ స్పందన లేకపోవడంతో.. స్థానిక సాయంతో తలుపు పగలకొట్టింది. చూసేసరికి.. విష్ణుజా ఫ్యాన్‌ను ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది.

స్నేహితుల స్టేట్‌మెంట్‌ ప్రకారం.. గత కొంతకాలంగా విష్ణుజాను భర్త శారీరకంగా, మానసికంగా హింసిస్తూ వచ్చాడు. ఈ విషయం అతని తల్లికి కూడా తెలుసు.  ప్రభిన్‌ తీరు వల్ల ఈ విషయాలను ఆమె పుట్టింటి వాళ్లతో పంచుకోలేదు. ఎలాగైనా భర్తను మార్చుకోవానుకుంది. కానీ, ఆ మూర్ఖుడి మనసు కరగలేదు. సరికదా.. ఆ వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. 

క్షోభకు గురై..
పెళ్లైన తొలినాళ్ల నుంచే విష్ణుజాను భర్త హింసిస్తూ వచ్చాడు. అందంగా లేదని..  తనకు నచ్చినట్లు తయారు కావట్లేదని సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఆ వంకతోనే ఆమెను తన బైక్‌ మీద తిప్పేవాడు కూడా కాదు. పైగా తరచూ ఆమెను కొట్టేవాడు. ఇంత చదువు చదివి ఉద్యోగమూ లేదని తిట్టేవాడు. ఇంత జరుగుతున్నా..  ఆమె భరించింది. భర్త మెల్లిగా మారుతాడులే అనుకుంది. కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌లకు ప్రిపేర్‌ అవుతూ వచ్చింది. 

ఈ క్రమంలో వేధింపుల విషయాన్ని ఆమె తన స్నేహితులతో పంచుకుంది. అయితే ఆ విషయం తెలిసిన ప్రభిన్‌ మరింత రెచ్చిపోయాడు. ఆమె ఫోన్‌, వాట్సాప్‌పై‌ నిఘా పెట్టి.. ఆమె ప్రతీ చర్యను పరిశీలించి హింసించసాగాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ.. చివరకు ఆమె విగతజీవిగా మారిపోయింది. 

ఏనాడూ ఇంటికి రాలేదు
అయితే తమ కూతురిని ఆమె భర్త, అత్తలు వేధిస్తున్న విషయం.. చనిపోయాక స్నేహితుల ద్వారానే తెలిసిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. పెళ్లైనప్పటి నుంచి ప్రభిన్‌ ఏనాడూ మా ఇంటికి రాలేదు. అడిగితే.. చిన్న సమస్యే నాకు వదిలేయండి అని మా కూతురు చెబుతుండేది. చదువుకునే రోజుల్లోనే పార్ట్‌ టైం జాబ్‌తో మా కష్టాలను పంచుకున్న మా బిడ్డ.. పెళ్లయ్యాక ఆమె కష్టాలను మాత్రం మాకు చెప్పుకోలేకపోయింది’’ అని తండ్రి వసుదేవన్‌ కంటితడి పెట్టారు. అంతేకాదు..

తన కూతురిని ప్రభిన్‌ హత్య చేసి ఉంటాడని ఆయన అనుమానిస్తున్నారు. అతనికి వేరే యువతితో సంబంధం ఉందని ఇప్పుడే తెలిసింది. బహుశా ఆ ఉద్దేశంతోనే నా కూతురిని ఆ కుటుంబం మొత్తం కడతేర్చి ఉండొచ్చు’’ అని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ కేసు తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. నిందితుడికి కఠినంగా శిక్షించాలని చర్చ జరుగుతోంది. గృహహింస చట్టాలను మరింత కఠినతరంగా అమలు చేయాలనే డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement