బాలయ్య మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే.. | Psychologist Visesh Analysis On Balayya Comments | Sakshi
Sakshi News home page

బాలయ్య మాటల్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలంటే..

Published Mon, Feb 3 2025 2:08 PM | Last Updated on Mon, Feb 3 2025 3:15 PM

Psychologist Visesh Analysis On Balayya Comments

పదవులు మనకు అలంకారం కాదు. మనకు పదవులు అలంకారం కావాలి. నేను ఎప్పడు ఏది ఆశించి చేయలేదు. ఇది మా నాన్నగారి ఆశీర్వాదం. ఇలాంటి సన్మానాలు మనలో బాధ్యత పెంచుతుంది. నాకు వచ్చిన ఈ అవార్డు మీకు అందరికి వచ్చినట్లే ఈ రోజు నాకు వచ్చిన ఈ అత్యున్నత పురస్కారం రేపు మీకు రావచ్చు. అందుకోసం అనుక్షణం స్వంత లాభం కొంత మానుకొని సమాజం కోసం పని చేయండి.. పద్మభూషణుడు నందమూరి బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన అభిమానులు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ చేశారు. అయితే.. 

మొన్న ఫేస్బుక్ బ్రౌజ్ చేసుంటే నందమూరి బాలకృష్ణ చేసిన ఆ ఉపన్యాసం కనిపించింది. ‘‘కాబట్టి పదవులకు నేను అలంకారమేమో కానీ, పదవులు నాకెప్పుడూ అలంకారం కాదు’’ అనే మాటలు వినిపించాయి. వెంటనే ‘‘మేం వేరు, మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు’’ అని గతంలో ఆయన మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. సరే ఈసారేం మాట్లాడాడో విందామని వీడియో చూసా. ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మోడల్ గా ఉపయోగపడుతుందని విశ్లేషణ చేసి పోస్ట్ చేశా. 

రెండు నిమిషాల వీడియోతో మనస్తత్వాన్ని ఎలా విశ్లేషించగలరనే డౌట్ రావచ్చు. అలా రావడం సహజం కూడా. కానీ, ఆ రెండు నిమిషాలు మాట్లాడిన మాట్లాడిన ప్రతీ మాట వెనుక, ఆ మాటల ఎంపిక వెనుకనే అంతా దాగివుంది. ఈ ఉపన్యాసం, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని, ప్రపంచాన్ని చూడే కోణాన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తికరమైన అంశాలను అందిస్తుంది. ఈ ప్రసంగాన్ని సైకాలజికల్ అనాలిసిస్ చేస్తూ, అవసరమైన సందర్భాల్లో ఆయన గత ప్రవర్తనను ప్రస్తావిస్తూ విశ్లేషణను కొనసాగిద్దాం.

👉కాబట్టి పదవులకు నేను అలంకారమేమో కానీ, పదవులు నీకెప్పుడూ అలంకారం కాదు

ఇది సాధారణంగా ఒక వ్యక్తి అనగల మాటేనా? కాదు. సాధారణంగా, ఎవరికైనా పద్మభూషణ్ లాంటి పురస్కారం వస్తే, వారు కృతజ్ఞతా భావంతో సమాజం, ప్రభుత్వం, తాము పనిచేసిన రంగం మీద అఫర్మేషన్ ఇచ్చే అవకాశముంది. కానీ బాలకృష్ణ, పదవులకు తానే అలంకారం అన్న మాట ద్వారా, తన ప్రాముఖ్యతను, ప్రత్యేకతను హైలైట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే వ్యక్తి గతంలో "మేము వేరు, మా బ్రీడ్ వేరు" అని చెప్పడం, ఆయనలో ఉన్న గ్రాండియోసిటీని (తాను సామాన్య ప్రజలకన్నా ఉన్నతుడని భావించడం) సూచిస్తుంది. ఇదంతా నార్సిసిస్టిక్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ రకమైన అహంకార ధోరణులు, ప్రజాప్రతినిధుల్లో ప్రమాదకరమైన లక్షణాలు.
 

👉నా తండ్రి, గురువు, దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు..

ఈ వ్యాఖ్యలో బాలకృష్ణ తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా తన తండ్రి ద్వారా నిర్వచించుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. ఆయన సాధించినదంతా తన తండ్రి వారసత్వానికి సంబంధించినదేనని చెప్పడం, తాను నేడు ఉన్న స్థాయికి కారణం తన స్వీయ ప్రతిభ కాదన్న భావన కలగవచ్చు. కానీ.. 

గతంలో ఇదే బాలకృష్ణ తండ్రిని ముఖ్యమంత్రిపదవి నుంచి దింపడంలో కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ వాఖ్యలు విరుద్ధంగా కనిపిస్తాయి. గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రిని పక్కన పెట్టిన వ్యక్తి, ఇప్పుడు ఆయనను దేవుడిగా కీర్తించడం, తన ఐడెంటిటీని ప్రజల్లో తిరిగి బలపర్చుకునేందుకు ఉద్దేశించిన చర్యగా అనిపిస్తుంది.
 

👉నాకు జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు, విశ్వానికే నటరూపం ఎలా ఉంటుందో చూపించిన దైవాంశ సంభూతుడు...

ఇక్కడ తన తండ్రిని దేవుడితో పోలుస్తూనే, తాను ఆయన ప్రతిరూపమని చెప్పడం గమనార్హం. ఇక్కడ బాలకృష్ణ తన తండ్రి గొప్పతనాన్ని పొగుడుతూ, తాను కూడా అదే వారసత్వానికి చెందినవాడినని, తాను కూడా అంతే గొప్పవాడినని నిరూపించుకోవడానికి మాట్లాడడం కనిపిస్తోంది. ఇదే వ్యక్తి ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో తన అక్క ఇంటిముందు తొడ కొట్టడం, అభిమానులను కొట్టడం లాంటి చర్యలు చేసారు. ఇవన్నీ చూస్తే, ఆయన నిజమైన అహంకార రహిత వ్యక్తి కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
 

👉షేక్‌స్పియర్ చెప్పినట్టు.. ఇదంతా ఒక నటనే. అంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు.. 

ఇదొక ఆసక్తికరమైన వ్యాఖ్య. ఈ వాఖ్యలో బాలకృష్ణ జీవితాన్ని ఒక రంగస్థలంగా చూస్తూ, దానిలో తన పాత్ర ఒక ప్రత్యేకమైనదిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా, గొప్పతనం భావన (Grandiosity) కలిగిన వ్యక్తులు, ప్రపంచాన్ని ఒక నాటకంగా, తాము దానిలో ముఖ్య పాత్రధారులమని భావిస్తారు. అయితే, షేక్స్‌పియర్‌ చెప్పిన ఆలోచన మానవ సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినది, కానీ బాలకృష్ణ దాన్ని కేవలం తన ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ఉపయోగించడం Selective Interpretation కు సంకేతం.
 

👉ఇదుగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్‌లు కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే.. 

ఇక్కడ ఆయన, అవార్డులు తనని వెతుక్కుంటూ వచ్చాయని చెప్పడం, నార్సిసిజం యొక్క మరో స్పష్టమైన ఉదాహరణ.  సాధారణంగా, నిజమైన అచీవర్స్ "ఈ అవార్డు నాకు లభించడం గౌరవంగా భావిస్తున్నాను" అనే విధంగా స్పందిస్తారు. కానీ బాలకృష్ణ తనకి అవార్డులు రావడం సహజమే అనే ధోరణిలో మాట్లాడడం, తనలోని గొప్పతనం తానే హైలైట్ చేసుకోవాలనే మానసిక స్థితిని సూచిస్తుంది.
 

👉రేపు మీలో ఎవరికైనా రావచ్చు భవిష్యత్తులో. స్టేజ్ మీద ఉన్న వారిలో ఎవరికైనా రావొచ్చు. 

ఈ మాట ఒక ఫేక్ హంబుల్‌నెస్ (False Humility) కి ఉదాహరణ. అవార్డు తానే పొందాడు, కానీ మరెవరైనా పొందవచ్చని చెప్పడం, పైకి వినసొంపుగా ఉన్నా, లోపల మాత్రం "మీకు రాదు, నేనే గొప్ప" అనే అహంకారాన్ని బలపరిచే ప్రయత్నమే. ఇదే వ్యక్తి తన అభిమానులను కొట్టినప్పుడు, అవకాశాల కోసం తమను తాము తక్కువగా చూడాల్సిన అవసరం లేదని చెప్పలేదు. ప్రజలను ఉపయోగించుకోవడం, అవసరమైనప్పుడు తమను సమానంగా చూడడం.. ఇది బాలకృష్ణ రాజకీయ మానసిక స్థితికి అద్దం పడుతుంది.
 

👉 ఈ ఉపన్యాసం మొత్తం బాలకృష్ణ వ్యక్తిత్వంలో పరస్పర విరుద్ధతలను (Contradictions) చూపిస్తోంది.

తాను కష్టపడి సాధించానని చెబుతూనే, అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని చెప్పడం... గతంలో తండ్రికి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని కొనసాగిస్తున్నానని చెప్పడం... గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు చేసి, ఇప్పుడు ప్రజలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పడం.. ఇవన్నీ పరస్పర విరుద్ధతలను చూపిస్తున్నాయి. 

అందుకే, ఈ ఉపన్యాసం పూర్తిగా నిజాయితీతో నిండినదిగా అనిపించదు. ఆయన ఉపన్యాస శైలిని, గత ప్రవర్తనను తులనాత్మకంగా పరిశీలిస్తే, తన రాజకీయం, సినిమా, నందమూరి వారసత్వాన్ని ప్రజల్లో మరింత బలపరిచేందుకు చేసిన ఎమోషనల్ స్ట్రాటజీగా చెప్పవచ్చు.
 

అయితే...
✔ ఇది క్లినికల్ డయాగ్నోసిస్ కాదు, కేవలం ఆయన ప్రవర్తన ఆధారంగా మానసిక విశ్లేషణ మాత్రమే.
✔ ఏ వ్యక్తి అయినా ఒకటి లేదా రెండు లక్షణాలను కలిగి ఉండవచ్చు, కానీ మూడింటి కంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటే, అది వ్యక్తిత్వ రుగ్మతగా పరిగణించాలి.
✔ రాజకీయ, సినీ ప్రపంచంలో ఉండే చాలా మందికి "Public Persona vs. Real Persona" మధ్య వ్యత్యాసం ఉంటుంది. 
✔ బాలకృష్ణ ప్రవర్తనలో అతిశయమైన అహంకారం, నియంత్రించలేని కోపం, ఇంపల్సివ్ యాక్షన్స్, ఇతరులను మోసగించాలనే ధోరణి ఉన్నాయి. ఇవన్నీ తీవ్రంగా ఉంటే, అతనికి Narcissistic Personality Disorder (NPD) & Impulse Control Disorder (ICD) ఉన్నట్లు చెప్పొచ్చు.

ఇది ఒక నటుడు, రాజకీయ నాయకుడిని విమర్శిస్తున్నట్టు కాకుండా, ఒక మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే కోణంగానే చూడాలి. ఒక అధ్యయన విషయంగా చూస్తే బాలకృష్ణ వ్యక్తిత్వం "Power & Narcissism" కి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు!

:::PsyVishesh

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement