టూర్‌కీ ఉంది ఓ ట్యాక్స్‌! | Tax to deal with over tourism problem | Sakshi
Sakshi News home page

టూర్‌కీ ఉంది ఓ ట్యాక్స్‌!

Published Tue, Feb 4 2025 4:47 AM | Last Updated on Tue, Feb 4 2025 4:47 AM

Tax to deal with over tourism problem

ఓవర్‌ టూరిజం సమస్యను ఎదుర్కోవడానికే పన్ను

భూటాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లో ఇప్పటికే పర్యాటకులపై ట్యాక్స్‌ 

వీటి బాటలోనే సిద్ధమవుతున్న రష్యా, తదితర దేశాలు 

ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్‌లోనూ ఇప్పటికే గ్రీన్‌ ట్యాక్స్‌ 

అన్నీ ముందే తెలుసుకుని టూర్‌ ప్లాన్‌ చేసుకోవాలంటున్న ట్రావెల్‌ ఆపరేటర్లు

అంతర్జాతీయ పర్యాటకుల నుంచి టూరిస్ట్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్న పలు దేశాలు

ఏపీ సెంట్రల్‌ డెస్క్‌: ఒత్తిడితో కూడుకున్న జీవితం నుంచి కాస్తంత సేద తీరడానికి ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడాలని.. చిల్‌ కావాలని కోరుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరి ఆర్థిక స్థోమతలను బట్టి వారు దేశీయ, విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు అత్యధిక సంఖ్యలో వెళ్తున్నవారిలో భారతీయులు కూడా ఉంటున్నారు. 

ప్రపంచ పర్యాటకులు అత్యధికంగా సందర్శిస్తున్న వాటిలో బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌), వెనిస్‌ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్‌), యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నవారిని పర్యాటక పన్నులు (టూరిస్టు ట్యాక్సెస్‌) కలవరపెడుతున్నాయి. విదేశాల్లోనే కాకుండా మనదేశంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్‌లోనూ పర్యాటకులపై గ్రీన్‌ ట్యాక్స్‌ విధిస్తుండటం గమనార్హం.

పర్యాటక పన్ను ఎందుకంటే..  
పర్యాటక పన్నులనేవి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్‌ కాదు. గత కొన్నేళ్లుగా, ఆమ్‌స్టర్‌డామ్, వెనిస్, బాలి తదితర నగరాలు పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. అక్కడ పర్యాటకుల తాకిడికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఆయా నగరాల్లో ఇతర వసతుల కల్పనకు, పరిశుభ్రంగా ఉంచడానికి పర్యాటక పన్ను విధిస్తున్నాయి. అలాగే పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఆయా కార్యక్రమాలను నిర్వహించడానికి నిధులు అవసరం కాబట్టే తాము పర్యాటక పన్నును వసూలు చేస్తున్నామని ఆయా నగరాలు చెబుతున్నాయి. ఓవర్‌ టూరిజంతో వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికే తాము టూరిస్టు ట్యాక్స్‌ వసూలు చేస్తున్నామని పేర్కొంటున్నాయి. ఇప్పటికే యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ఎడిన్‌బర్గ్‌ నగరం వచ్చే ఏడాది జూలై నుంచి పర్యాటక పన్నును వసూలు చేస్తామని ప్రకటించింది. ఎడిన్‌బర్గ్‌ బాటలోనే మరికొన్ని నగరాలు కూడా నడవడానికి సిద్ధమవుతున్నాయి.  

కలవరపెడుతున్న ఓవర్‌ టూరిజం..  
కొన్ని దేశాలు పర్యాటకుల రాకపై ఆందోళన చెందుతుంటే మరికొన్ని దేశాలు ఓవర్‌ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆయా పర్యాటక ప్రాంతాల్లో ఉన్న మొత్తం జనాభా కంటే కొన్ని రెట్ల సంఖ్యలో పర్యాటకులు ఆయా ప్రాంతాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌), వెనిస్‌ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్‌), ఆమ్‌స్టర్‌డామ్‌ (నెదర్లాండ్స్‌) వంటివి ఓవర్‌ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆ నగరాల్లో ఉన్న జనాభాను మించి సంవత్సరం పొడవునా పర్యాటకులు ఈ నగరాలకు పోటెత్తుతుండటంతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం పెద్ద సమస్యగా మారింది. డిమాండ్‌కు తగ్గట్టు నివాస, ఆహార సదుపాయాలు కల్పించడానికి, హోటళ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున స్థలాలు అవసరం పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానికులకు ఇళ్ల స్థలాలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా అత్యధికంగా ధర చెల్లించాల్సి వస్తోంది.

అదేవిధంగా నిత్యం పర్యాటకులతో ట్రాఫిక్‌ సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. దీంతో స్థానికులు తమ దైనందిన పనులు చేసుకోవడానికి, ఆఫీసులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరప్‌ దేశం స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఇటీవల ఓవర్‌ టూరిజం సమస్యను అరికట్టాలని స్థానికులు నిరసనలకు దిగడం ఇందుకు నిదర్శనం. ఇళ్ల స్థలాల కొరత, ట్రాఫిక్‌ సమస్యలే కాకుండా తమ ప్రాంతాలకు భారీ ఎత్తున తరలివస్తున్న పర్యాటకులతో పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆయా దేశాల పర్యాటకులు పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇతర అపరిశుభ్రమైన చర్యలతో చెత్తకుప్పల్లా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఓవర్‌ టూరిజం సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

పర్యాటకులకు మరింత భారమేనా? 
అయితే ఆయా దేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు ట్యాక్స్‌ విధించడం పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు ట్రావెల్‌ ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పర్యాటకులపై మరింత అదనపు ఖర్చు పడుతుందంటున్నారు. పర్యాటకులపై పన్ను విధించడం వల్ల వారు పన్ను లేని వేరే కొత్త గమ్యస్థానాలపై దృష్టి సారిస్తారని అంటున్నారు. దీనివల్ల పన్ను విధిస్తున్న దేశాలకు పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోతుందని పేర్కొంటున్నారు. మరికొందరు ట్రావెల్‌ ఆపరేటర్లు మాత్రం పర్యాటక పన్ను విధించడం మంచి విషయమేనని చెబుతున్నారు. పర్యాటకులకు వసతులు కల్పించడానికి, ఓవర్‌ టూరిజం సమస్యను ఎదుర్కోవడానికి టూరిస్టు ట్యాక్స్‌ ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.  

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని పర్యాటక పన్నులు... 
ఇటలీలోని వెనిస్‌ పర్యాటకుల తాకిడిని నియంత్రించడానికి ‘డే–ట్రిప్పర్‌ ట్యాక్స్‌’ పేరుతో ఒక్కో పర్యాటకుడి నుంచి రోజుకు 5 యూరోలు వసూలు చేస్తోంది.  
 నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో పర్యాటకులు తమ హోటల్‌ బిల్లుపై 7% అదనంగా చెల్లించాల్సిందే. అంతేకాకుండా రాత్రి అక్కడే ఉంటే సిటీ ట్యాక్స్‌ కింద మరో 3 యూరోలు సమరి్పంచుకోవాల్సిందే. 
భారత్‌ పొరుగు దేశం భూటాన్‌ సైతం పర్యాటకుల నుంచి రోజువారీ రుసుమును వసూలు చేస్తోంది. వసతి, భోజనం, సాంస్కృతిక పర్యటనలను కవర్‌ చేయడానికి రోజుకు 200 నుంచి 250 డాలర్లను రోజువారీ సందర్శకుల రుసుము కింద తీసుకుంటోంది. 

 ఓడ లేదా విమానం ద్వారా వెళ్లే అంతర్జాతీయ పర్యాటకుల నుంచి ’సయోనారా ట్యాక్స్‌’ కింద జపాన్‌ 1,000 యెన్‌లు వసూలు చేస్తోంది. 
 యూకేలోని మాంచెస్టర్‌లోని హోటళ్లలో ఒక రాత్రి నివాసం ఉంటే ప్రతి పర్యాటకుడు ఒక పౌండ్‌.. నైట్‌ ట్యాక్స్‌ కింద చెల్లించాల్సిందే. 
స్పెయిన్‌లోని బార్సిలోనాలో వసతి రకాన్ని, ప్రదేశాన్ని బట్టి ఒక్కో రాత్రికి 4 యూరోల వరకు టూరిస్టు ట్యాక్స్‌ చెల్లించాలి. 

 గతేడాది అక్టోబర్‌ 1 నుంచి న్యూజిలాండ్‌ టూరిస్టు ట్యాక్స్‌ను ఏకంగా మూడురెట్లు పెంచింది. అంతర్జాతీయ పర్యాటకులు ఆ దేశంలో అడుగుపెడితే 135 న్యూజిలాండ్‌ డాలర్లను చెల్లించాల్సిందే. 
 భారతీయ పర్యాటకులు అత్యధికంగా వెళ్లే దేశాల జాబితాలో ఉన్న మలేషియా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, గ్రీస్, క్రొయేషియా, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చెక్‌ రిపబ్లిక్, పోర్చుగల్‌ తదితర దేశాల్లోనూ టూరిస్టు ట్యాక్స్‌లు అమల్లో ఉన్నాయి. 

గతేడాది యూకే.. ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్‌ (ఈటీఏ)ను ప్రవేశపెట్టింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, కొన్ని యూరప్‌ దేశాల నుంచి యూకేకు రావాలనుకునేవారు ముందుగా ఈటీఏకి దరఖాస్తు చేసుకో­వాలి.. అలాగే నిర్దేశిత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.  ఈ విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అన్ని దేశాలకు యూకే వర్తింపజేయనుంది. 
 ఈ ఏడాది జనవరి 1 నుంచి రష్యా పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది. 

 ఈ ఏడాది మధ్య నుంచి థాయ్‌లాండ్‌ పర్యాటక పన్నును విధించడానికి సిద్ధమవుతోంది. విమానం ద్వారా తమ దేశంలో ప్రవేశించే పర్యాటకులు 300 బాత్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అదే భూ లేదా సముద్ర మార్గం ద్వారా థాయ్‌లాండ్‌లో ప్రవేశిస్తే టూరిస్టు ట్యాక్స్‌ కొంత తక్కువ ఉంటుంది. 
మనదేశంలో ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్‌లో ప్లాస్టిక్‌ బాటిళ్లను నియంత్రించడానికి పర్యాటకుల నుంచి రూ.20 గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు.

పర్యాటకులు ఏం చేయాలి? 
విదేశాల్లో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే, ముందు ఆయా దేశాల్లో పర్యాటకులపై ఎలాంటి పన్నులు ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమమని ట్రావెల్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. కొన్ని దేశాలు పర్యాటకులు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచే పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. ఆ దేశంలో ఎన్ని రోజులు ఉంటారనేదాని ఆధారంగా ఈ రుసుములు ఉంటున్నాయి. మరికొన్ని దేశాలు పర్యాటకులు టూర్‌ని ముగించుకుని వెళ్లిపోతున్నప్పుడు పన్నును (డిపార్చర్‌ ట్యాక్స్‌) వసూలు చేస్తున్నాయి. కాబట్టి పర్యాటకులు తమ పర్యటనలకు ముందే ఈ ట్యాక్సుల గురించి తెలుసుకోవాలని ట్రావెల్‌ ఆపరేటర్లు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement