![Tribals react to Ayyanna Patrudu comments](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/222.jpg.webp?itok=27nnnAe_)
బంద్ విజయవంతం
1/70 చట్టం సవరించాలన్న స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలపై గిరిజనుల మండిపాటు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 48 గంటల మన్యం బంద్‌కు పిలుపు
తెల్లవారుజామున 4 గంటల నుంచే రోడ్లపైకి వైఎస్సార్‌సీపీ, అఖిలపక్ష పార్టీల నేతలు
దుకాణాలు, కార్యాలయాలు, విద్యాలయాలు, బస్సులు బంద్
అయ్యన్నపై చర్యలతో పాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్
దిగి వచ్చిన సీఎం చంద్రబాబు.. చట్టాన్ని సవరించబోమని వెల్లడి
బంద్‌ను విరమించిన నేతలు
సాక్షి, పాడేరు/బుట్టాయగూడెం: గిరిజనుల ప్రధాన చట్టం 1/70ని సవరించి టూరిజం అభివృద్ధి చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో తలపెట్టిన 48 గంటల రాష్ట్ర మన్యం బంద్ తొలిరోజు విజయవంతం చేశారు. వైఎస్సార్‌సీపీతో పాటు అఖిలపక్షాల నేతలు ఈ బంద్‌లో పాల్గొన్నారు.
పాడేరు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా బంద్ జరిగింది. పాడేరు, అరకు, రంపచోడవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి తదితర ప్రాంతాల్లో గిరిజనులంతా ఏకమై సంపూర్ణ బంద్ చేశారు. మన్యం మొత్తం స్తంభించడంతో సీఎం చంద్రబాబు దిగి వచ్చారు. 1/70 చట్టాన్ని సవరించబోమని స్వయంగా ‘ఎక్స్’లో ప్రకటించారు.
అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అఖిలపక్ష నాయకులతో మంగళవారం సమావేశమై గిరిజన చట్టాలు, హక్కులను పరిరక్షిస్తామని సీఎం ప్రకటించారని, 1/70 చట్టం రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. దీంతో మంగళవారం సాయంత్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. బంద్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించారు.
గిరిజన చట్టాల జోలికి వస్తే ఖబడ్దార్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
కూటమి ప్రభుత్వ పెద్దలు గిరిజన హక్కులు, చట్టాల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు హెచ్చరించారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ బాధ్యత పాలకులపై ఉందన్నారు.
1/70 చట్టాన్ని సవరించి గిరిజనుల సంపదను దోచుకునేలా స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలిరోజు బంద్ విజయవంతం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చిందని, ప్రభుత్వం గిరిజనులకు నష్టం చేసే ఏ కార్యక్రమం తలపెట్టినా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎమ్మెల్యే› విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు.
అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే బాలరాజు
గిరిజన చట్టాలను సవరించాలంటూ వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు గిరిజనులకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ 1/70 చట్టం సవరణ చేయాలని చూస్తే సహించేది లేదన్నారు.
స్పీకర్ అయ్యన్నపై జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
రాజవొమ్మంగి: గిరిజనుల చట్టం 1/70పై వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకా యల అయ్యన్నపాత్రుడుపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయ కులు జడ్డంగి పోలీస్ స్టేషన్‌లో మంగళవా రం ఫిర్యాదు చేశారు. టూరిజంతో పాటు ఇతరత్రా మన్యం అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలన్న అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం నాయకులు తెడ్ల రాంబాబు, సత్యన్నారాయణ, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, సవిరెల చంద్రుడు, పలువురు మహిళా నాయకులు చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉన్న అయ్యన్న ఇలా మాట్లాడటం చట్ట వ్యతిరేకమని అన్నారు.
వేకువజాము నుంచే బంద్
మంగళవారం వేకువజాము పాడేరులో వైఎస్సార్ïÜపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సీపీఎం, సీపీఐతో పాటు గిరిజన, ప్రజా సంఘాలన్నీ మంగళవారం బంద్ చేపట్టాయి. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, సీపీఎం రాష్ట్ర నేతలు పి.అప్పలనరస, కిల్లో సురేంద్రతో పాటు నేతలంతా గిరిజనులకు అయ్యన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పెదబయలులో మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో నేతలంతా రోడ్లపై బైఠాయించారు. అరకు లోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు ఘాట్‌లో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతిరాణి, వైఎస్సార్‌సీపీ నేతలంతా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలు, పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగానే మూసివేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వారపు సంతలు రద్దయ్యాయి.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షను వాయిదా వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగానే పనిచేశాయి. బ్యాంకులు తెరచుకోలేదు. అకిలపక్ష నేతలు రోడ్లపైనే భోజనాలు చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసివే యించారు. స్థానిక బస్టాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ, ప్రజా సంఘాల నాయకులు బైఠాయించారు.
Comments
Please login to add a commentAdd a comment